పాలెం దుర్ఘటనపై చార్జిషీటు
- వోల్వో బస్సు దగ్ధం కేసులో 10 మందిపై అభియోగం
- ప్రమాదానికి కారణాలపై ప్రభుత్వానికి సీఐడీ నివేదిక
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జాతీయ రహదారిపై వోల్వో బస్సు దగ్ధమై మొత్తం 45 మంది సజీవదహనమైన కేసులో సీఐడీ అధికారులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. 2013 అక్టోబర్ 30న జరిగిన ఈ ఘోర సంఘటనకు సంబంధించి పది మంది నిందితులను అరెస్టు చేశారు. సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తూ మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద కల్వర్టును ఢీకొని దగ్ధమైంది. ఈ కేసును సీఐడీ విభాగం అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపింది.
జాతీయ రహదారిలో ఏవైనా లోపాలున్నాయా? బస్సు డిజైన్‌లో లోపాలున్నాయా? అన్న అంశాలను పరిశీలించారు. పాలెం వద్ద బస్సు స్పీడ్‌గా వచ్చి కల్వర్టును ఢీకొనడం వల్ల.. అక్కడ లేచిన మంటలు బస్సు ముందు టైర్ల వెనక ఉన్న ప్లాస్టిక్ ఫ్యూయల్ ట్యాంకులకు అంటుకోవడంతో బస్సు కాలిందని విచారణలో తేల్చారు. ఈ సమయంలో గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులను మంటలు చుట్టుముట్టడంతో తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బస్సు అద్దాలను పగులగొట్టేందుకు అవసరమైన సుత్తి లాంటి అత్యవసర పరికరాలు కూడా అందుబాటులో లేకపోవడంతో కూడా మరణాల సంఖ్య పెరగడానికి కారణమైందని దర్యాప్తులో తేల్చారు.
ఘటనకు బాధ్యులుగా తేలిన జబ్బార్ ట్రావెల్స్ యాజమానులు షకీల్ జబ్బార్, అతని సోదరుడు, డ్రైవర్ ఫెరోజ్‌పాషా, క్లీనర్ అయాజ్‌పాషాలతో పాటు ఇతర సిబ్బందిని అరెస్టు చేశారు. ఈ బస్సును జబ్బార్ ట్రావెల్స్‌కు లీజుకు ఇచ్చిన జేసీ దివాకర్ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్‌రెడ్డి భార్య ఉమారెడ్డిని కూడా అరెస్టు చేశారు. అలాగే, లాభాపేక్షలో నిర్వాహకులు బస్సులో ఉండాల్సిన 45 సీట్ల కంటే అధికంగా మరో ఐదు సీట్లను ఏర్పాటు చేసినట్లు కూడా తేలింది. బస్సులో మంటలు త్వరగా విస్తరించడానికి బస్సు ఫ్లోర్‌ను చెక్కతో పాటు రబ్బర్ మాటింగ్ చేయడం మరో కారణంగా తేల్చారు.
జాతీయ రహదారిపై పాలెం వద్ద కల్వర్టు పారాపిట్ వాల్ రహదారిలోకి కొద్దిగా చొచ్చుకొని వచ్చేలా నిర్మించడం కూడా ప్రమాదానికి కారణమని కూడా సీఐడీ దర్యాప్తులో తేలింది. ఇన్ని విధాలుగా కేసును దర్యాప్తు చేసిన తర్వాత పది మంది నిందితులను అరెస్టు చేసి, వారిపై పకడ్బందీగా చార్జిషీటు రూపొందించారు. దీనిని మే 7న మహబూబ్‌నగర్ కోర్టులో దాఖలు చేశామని సీఐడీ అదనపు డీజీ తెలిపారు. కేసుకు సంబంధించి అవసరమైన అనుబంధ పత్రాలను శనివారం కోర్టుకు అందజేసినట్లు వివరించారు. అంతేకాకుండా బస్సు దుర్ఘటనకు కారణమైన అంశాలను పేర్కొంటూ ప్రభుత్వానికి 400 పేజీల నివేదికను శనివారం అందజేసినట్లు వివంచారు. ఈ సందర్భంగా ఈ కేసు దర్యాప్తును సమగ్రంగా పూర్తి చేసిన సీఐడీ అధికారులను ఆయన అభినందనలు తెలిపారు.