Volvo company
-
వోల్వో కొత్త స్పోర్ట్స్ సెడాన్
- ఎనిమిది గేర్ల కారు - ధర రూ.42 లక్షలు చెన్నై: వోల్వో కంపెనీ కొత్త స్పోర్ట్స్ సెడాన్-ఎస్60 టీ26 పెట్రోల్ వేరియంట్‌ను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఎనిమిది గేర్లు(ఆటోమాటిక్)తో కూడిన ఈ కారు ధర రూ.42 లక్షలని(ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) వోల్వో ఆటో ఇండియా ఎండీ, టామ్ వాన్ బాన్స్డాఫ్ చెప్పారు. 306 హార్స్పవర్ ఉన్న ఈ కారు జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీలైన ఆడి, బీఎండబ్ల్యూ బ్రాండ్ కార్లకు గట్టిపోటీనిస్తుందని పేర్కొన్నారు. గతేడాది 1,200 కార్లు విక్రయించామని, లగ్జరీ కార్ల మార్కెట్లో తమ వాటా 3.5% ఉందని తెలిపారు. వోల్వో కంపెనీ ప్రస్తుతం ఐదు లగ్జరీ మోడళ్లను-స్పోర్టీ సెడాన్ ఎస్60, ఎలిగెంట్ ఎస్80, లగ్జరీ హ్యాచ్‌బాక్ వీ40, వీ40 క్రాస్ కంట్రీ, లగ్జరీ ఎస్యూవీ ఎక్స్‌సీ60, 7 సీట్ల లగ్జరీ ఎస్యూవీ ఎక్స్‌సీ90 లను భారత్‌లో విక్రయిస్తోంది. -
రూ.80 కోట్లతో కొత్త బస్సులు
* అధికారులతో సమీక్షలో మంత్రి మహేందర్‌రెడ్డి * వోల్వో కంపెనీ నుంచి కొంటున్న ఆర్టీసీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ అప్పుడే ఓ అడుగు ముందుకేసి ఒక్కోటి రూ.కోటి విలువైన అత్యాధునిక బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటిని వోల్వో కంపెనీ నుంచి కొనుగోలు చేయబోతోంది. ఇప్పటి వరకు ఈ తరహా బస్సులు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో మాత్రమే నడుస్తున్నాయి. మన ఆర్టీసీ తొలి విడతగా జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద రూ.80 కోట్ల వ్యయంతో 80 బస్సులను కొనబోతోంది. ఈ వ్యయంలో కేంద్రం 35 శాతం, ఆర్టీసీ 50 శాతం, రాష్ట్రం 15 శాతం భరించనుంది. గురువారం సాయంత్రం బస్‌భవన్‌లో జరిగిన సమీక్ష అనంతరం ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. కాగా, బెంగళూరును ఆదర్శంగా తీసుకుని వోల్వో బస్సుల కొనుగోలుకు ముందుకు వస్తున్న సర్కారు తీరుపై విమర్శలు వస్తున్నాయి. అక్కడ వోల్వోలు నష్టాలు కురిపించడంతో ఈ బస్సుల కొనుగోలును నిలిపివేయడం గమనార్హం. రవాణా వసతి లేని 1300 గ్రామాలకు బస్సులు తెలంగాణలో రవాణా వసతి లేని 1300 గ్రామాలకు బస్సులు తిప్పాలని నిర్ణయించినట్టు రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి విలేఖరుల సమావేశంలో చెప్పారు. ఇందుకు ఆయా గ్రామాలకు రోడ్లను నిర్మించనున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో కొత్తగా 21 డిపోలను ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తున్నామని చెప్పారు. ముంబైలో సిటీ బస్సులు నడుపుతున్న తీరును పరిశీలించి ఆ విధానాలను హైదరాబాద్‌లో ప్రారంభిస్తామన్నారు. -
డిజైన్ మార్చండి
వోల్వో బస్సుల సంస్థకు ప్రభుత్వ సూచన ఇప్పటికిప్పుడు మార్చలేమన్న ‘వోల్వో’ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రెండు బస్సులు 52 మందిని పొట్టనబెట్టుకుని మూడు నెలలు పూర్తి కావస్తున్న తరుణంలో ఇకమీదట బస్సుల డిజైన్లను మార్చాల్సిందిగా రాష్ర్ట ప్రభుత్వం వోల్వో సంస్థను ఆదేశించింది. ప్రయాణికుల భద్రతను పెంచడంతో పాటు అగ్ని ప్రమాదాల బారిన పడకుండా ఉండేలా డిజైన్లను మార్చాలని రవాణా శాఖ సూచించింది. అయితే జాతీయ, అంతర్జాతీయ నిబంధనలను పాటించాల్సి ఉన్నందున ఇప్పటికిప్పుడు డిజైన్లను మార్చలేమని ఆ సంస్థ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్ నగరలో జిల్లాలో గత ఏడాది అక్టోబరు 30న వోల్వో బస్సు దగ్ధమైన సంఘటనలో 45 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. మరో రెండు వారాలకే హావేరి వద్ద మరో వోల్వో బస్సు దగ్ధం కాగా, ఏడు మంది మరణించారు. ఈ సంఘటనలపై రాష్ట్ర రవాణా శాఖ చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో డ్రైవర్ తప్పులు, అతి వేగం ప్రమాదానికి కారణాలని తేల్చింది. అయితే తుది నివేదికలో బస్సు డిజైన్లతో పాటు పలు మార్పులను సూచించింది. గతంలో వోల్వో బస్సులో డీజిల్ ట్యాంకు సామర్థ్యం 300 లీటర్లు కాగా, ఇప్పుడు 600 లీటర్లకు పెంచారు. ఇంజన్ పక్కనే ట్యాంకు ఉండడం వల్ల ప్రమాదం జరిగిన వెంటనే బస్సులు దగ్ధమయ్యాయని నివేదిక తెలిపింది. పైగా ట్యాంకును ఫైబర్‌తో తయారు చేశారని, దానికి మండే స్వభావం ఉందని వెల్లడించింది. మూడో అత్యవసర ద్వారాన్ని ఫిబ్రవరి నాటికి ఏర్పాటు చేసి తీరాలని కూడా ప్రభుత్వం వోల్వోను హెచ్చరించింది. అయితే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తాము బస్సులను తయారు చేశామని, ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు డ్రైవర్ ప్రవర్తన, ఆపరేటర్ నిర్వహణా తీరునూ పరిశీలించాల్సి ఉంటుందని ఆ సంస్థ అభిప్రాయపడుతోంది.