- వోల్వో బస్సుల సంస్థకు ప్రభుత్వ సూచన
- ఇప్పటికిప్పుడు మార్చలేమన్న ‘వోల్వో’
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రెండు బస్సులు 52 మందిని పొట్టనబెట్టుకుని మూడు నెలలు పూర్తి కావస్తున్న తరుణంలో ఇకమీదట బస్సుల డిజైన్లను మార్చాల్సిందిగా రాష్ర్ట ప్రభుత్వం వోల్వో సంస్థను ఆదేశించింది. ప్రయాణికుల భద్రతను పెంచడంతో పాటు అగ్ని ప్రమాదాల బారిన పడకుండా ఉండేలా డిజైన్లను మార్చాలని రవాణా శాఖ సూచించింది. అయితే జాతీయ, అంతర్జాతీయ నిబంధనలను పాటించాల్సి ఉన్నందున ఇప్పటికిప్పుడు డిజైన్లను మార్చలేమని ఆ సంస్థ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్ నగరలో జిల్లాలో గత ఏడాది అక్టోబరు 30న వోల్వో బస్సు దగ్ధమైన సంఘటనలో 45 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. మరో రెండు వారాలకే హావేరి వద్ద మరో వోల్వో బస్సు దగ్ధం కాగా, ఏడు మంది మరణించారు. ఈ సంఘటనలపై రాష్ట్ర రవాణా శాఖ చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో డ్రైవర్ తప్పులు, అతి వేగం ప్రమాదానికి కారణాలని తేల్చింది. అయితే తుది నివేదికలో బస్సు డిజైన్లతో పాటు పలు మార్పులను సూచించింది. గతంలో వోల్వో బస్సులో డీజిల్ ట్యాంకు సామర్థ్యం 300 లీటర్లు కాగా, ఇప్పుడు 600 లీటర్లకు పెంచారు.
ఇంజన్ పక్కనే ట్యాంకు ఉండడం వల్ల ప్రమాదం జరిగిన వెంటనే బస్సులు దగ్ధమయ్యాయని నివేదిక తెలిపింది. పైగా ట్యాంకును ఫైబర్‌తో తయారు చేశారని, దానికి మండే స్వభావం ఉందని వెల్లడించింది. మూడో అత్యవసర ద్వారాన్ని ఫిబ్రవరి నాటికి ఏర్పాటు చేసి తీరాలని కూడా ప్రభుత్వం వోల్వోను హెచ్చరించింది. అయితే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తాము బస్సులను తయారు చేశామని, ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు డ్రైవర్ ప్రవర్తన, ఆపరేటర్ నిర్వహణా తీరునూ పరిశీలించాల్సి ఉంటుందని ఆ సంస్థ అభిప్రాయపడుతోంది.