రూ.80 కోట్లతో కొత్త బస్సులు
* అధికారులతో సమీక్షలో మంత్రి మహేందర్‌రెడ్డి
* వోల్వో కంపెనీ నుంచి కొంటున్న ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ అప్పుడే ఓ అడుగు ముందుకేసి ఒక్కోటి రూ.కోటి విలువైన అత్యాధునిక బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటిని వోల్వో కంపెనీ నుంచి కొనుగోలు చేయబోతోంది. ఇప్పటి వరకు ఈ తరహా బస్సులు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో మాత్రమే నడుస్తున్నాయి. మన ఆర్టీసీ తొలి విడతగా జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద రూ.80 కోట్ల వ్యయంతో 80 బస్సులను కొనబోతోంది.
ఈ వ్యయంలో కేంద్రం 35 శాతం, ఆర్టీసీ 50 శాతం, రాష్ట్రం 15 శాతం భరించనుంది. గురువారం సాయంత్రం బస్‌భవన్‌లో జరిగిన సమీక్ష అనంతరం ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. కాగా, బెంగళూరును ఆదర్శంగా తీసుకుని వోల్వో బస్సుల కొనుగోలుకు ముందుకు వస్తున్న సర్కారు తీరుపై విమర్శలు వస్తున్నాయి. అక్కడ వోల్వోలు నష్టాలు కురిపించడంతో ఈ బస్సుల కొనుగోలును నిలిపివేయడం గమనార్హం.
రవాణా వసతి లేని 1300 గ్రామాలకు బస్సులు
తెలంగాణలో రవాణా వసతి లేని 1300 గ్రామాలకు బస్సులు తిప్పాలని నిర్ణయించినట్టు రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి విలేఖరుల సమావేశంలో చెప్పారు. ఇందుకు ఆయా గ్రామాలకు రోడ్లను నిర్మించనున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో కొత్తగా 21 డిపోలను ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తున్నామని చెప్పారు. ముంబైలో సిటీ బస్సులు నడుపుతున్న తీరును పరిశీలించి ఆ విధానాలను హైదరాబాద్‌లో ప్రారంభిస్తామన్నారు.