Voters List Amendment to Schedule
-
మహిళల కన్నా పురుషులే అధికం..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ఓటర్ల తుది జాబితా విడుదలైంది. జనవరి 15 నాటికి రాష్ట్రంలో మొత్తం 3,01,65,569 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) డాక్టర్ శశాంక్ గోయల్ వివరాలు వెల్లడించారు. జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం పురుష ఓటర్లు 1,51,61,714 కాగా, మహిళా ఓటర్లు 1,50,02,227 మంది ఉన్నారు. అంటే మహిళల కన్నా పురుష ఓటర్లు 1,59,487 మంది అధికంగా ఉన్నారు. మొత్తం ఓట్లలో సర్వీస్ ఓటర్లు 13,703 మంది ఉన్నారు. అలాగే రాష్ట్రంలో ఇతర ఓటర్ల (థర్డ్ జండర్ ) సంఖ్య 1,628గా పేర్కొన్నారు. గత నవంబర్ 16న ప్రకటించిన ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితాలో 3,00,55,327 ఓటర్లుండగా, కొత్తగా 2,82,497 ఓటర్లు జాబితాలో చేరారు. డబుల్ ఓట్లు, తొలగించినవి కలుపుకొని మొత్తం 1,72,255 ఓట్ల తొలగించాక రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,01,65,569గా నమోదైంది. దీంతో పాటు రాష్ట్రంలో మొత్తం పోలింగ్ బూత్‌ల సంఖ్య 34,708గా ఉన్నట్లు సీఈవో ప్రకటించారు. చదవండి: ఓటర్లు.. ఆమే నిర్ణేత 20–49 ఏళ్ల లోపు ఓటర్లే 2,15,27,426 మంది... రాష్ట్రంలో వయస్సు వారీగా చూస్తే అత్యధికంగా 20 నుంచి 49 ఏళ్లలోపు వారు 2,15,27,426 మంది ఉన్నారు. అంటే మొత్తం ఓట్లలో దాదాపు మూడో వంతు శాతం ఉన్నారు. వీరిలో 20–29ఏళ్ల మధ్యలోని వారు 62,57,483 మంది, 30–39 ఏళ్ల లోపు 89,28,827 మంది, 40–49 ఏళ్ల లోపు 63,41,116 మంది ఉన్నారు. నవయువ(18–19 ఏళ్ల వారు) ఓటర్లు 1,09,733 మంది ఉండగా, 50–59 ఏళ్ల మధ్యలో 42,31,789 మంది, 60–69 మధ్యలో 25,91,067 మంది, 70–79 మధ్యలో 12,87,859 ఉన్నారు. 80 ఏళ్లు పైబడిన వారు 4,17,695 మంది ఉన్నారు. 20 జిల్లాల్లో మహిళా ఓటర్లు ఎక్కువ ... రాష్ట్రంలో మొత్తం 20 జిల్లాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఇందులో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 68,628 అధికంగా ఉన్నారు. అలాగే ఖమ్మం జిల్లాలో 26,443 మంది, నిర్మల్ జిల్లాలో 22,601 మంది మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. -
కొత్త ఓటర్ల నమోదు మొదలు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, కొత్త ఓటర్ల నమోదు ఆదివారం ప్రారంభమైంది. ఈ ప్రక్రియ అక్టోబర్ 15 వరకు 45 రోజులపాటు కొనసాగుతుంది. ఇందుకోసం రాష్ట్రంలో 11వేల సహాయ కేంద్రాలు ఏర్పాటుచేశారు. వచ్చే ఏడాది జనవరిలో తప్పుల్లేని తుది జాబితా ప్రచురణ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె. విజయానంద్ కోరారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఓటర్ల సహాయ కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ఓటర్లుగా నమోదైన వారు జాబితాలో తమ వివరాల్లోని తప్పులను సరిచేసుకోవడానికి ఇది చక్కని అవకాశమన్నారు. రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంతోపాటు డివిజన్ స్థాయిలోను, తహశీల్దార్ ఆఫీసుల్లో ఏర్పాటుచేసిన సహాయ కేంద్రాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని విజయానంద్ వెల్లడించారు. అలాగే, బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితా పరిశీలిస్తారని వివరించారు. జాబితాలో మార్పులు, చేర్పుల కోసం పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్, రేషన్‌కార్డు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు జారీచేసే గుర్తింపు కార్డులు, బ్యాంకు పాస్‌బుక్, రైతు గుర్తింపు కార్డు వంటి ఏదో ఒక కార్డుతో ఎన్నికల సిబ్బందిని సంప్రదించాలన్నారు. ఇంటి నుంచే మార్పులు, చేర్పులు ఇదిలా ఉంటే.. నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్, ఓటర్స్ హెల్ప్, 1950 కాల్ సెంటర్ ద్వారా ఇంటి నుంచే తగిన మార్పులు చేసుకోవచ్చని కె. విజయానంద్ తెలిపారు. ఎన్నికల సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారించిన అనంతరమే సవరణలు చోటుచేసుకుంటాయన్నారు. కాగా, మార్పుల చేర్పులు కోసం ఫారం–8 ద్వారా దరఖాస్తులను సమర్పించుకోవచ్చని ఆయన చెప్పారు. మరణించిన, చిరునామా మారిన ఓటర్ల కోసం ఫారం–7 అందుబాటులో ఉంటుందన్నారు. 2020 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఫారం–6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మాధవీలత, డీఆర్ఓ ఏ ప్రసాద్ విజయవాడ ఇన్చార్జి సబ్‌కలెక్టర్ చక్రపాణి పాల్గొన్నారు. -
13న ఓటర్ల ముసాయిదా
ఓటర్ల జాబితా సవరణ షెడ్యూలు సిటీబ్యూరో, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల ముసాయిదా జాబితాను ఈనెల 13న వెలువరించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. వీటికి సంబంధించి వెలువడే అభ్యంతరాలను డిసెంబర్ 8 వరకు స్వీకరిస్తారు. ముసాయిదా జాబితాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో, పోలింగ్ కేంద్రాల భవనాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.