VS Achuthanandan
-
93 ఏళ్ల వయసులో చకచకా అసెంబ్లీకి
సాధారణంగా 70 ఏళ్ల వయసు వచ్చిందంటేనే కృష్ణా రామా అంటూ ఇంట్లో కూర్చుంటారు. అదే 90 ఏళ్లు దాటితే.. ఇక వాళ్లను ఇంట్లోవాళ్లు గాజుబొమ్మల కంటే జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ, కేరళలోని సీపీఎం కురువృద్ధుడు వీఎస్ అచ్యుతానందన్ మాత్రం 93 ఏళ్ల వయసులో కూడా చకచకా అసెంబ్లీకి వెళ్తున్నారు. అవును.. అచ్యుతానందన్‌కు 93 ఏళ్లు వచ్చాయి. పుట్టినరోజు నాడు కూడా ఆయన అసెంబ్లీకి యథావిధిగా వచ్చేశారు. తన ట్రేడ్ మార్కు తెల్ల చొక్కా, పంచె ధరించి ఆయన రాగానే పలవురు యువ ఎమ్మెల్యేలు పరుగున వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ పి. శ్రీరామకృష్ణన్ సభ తరఫున ఆయనకు అభినందనల చెప్పారు. ''సభలోనే అత్యంత సీనియర్ సభ్యుడైన అచ్చుతానందన్ 93వ పుట్టినరోజు సందర్భంగా ఈ సభ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది'' అని ఆయన ప్రకటించగానే.. ప్రతిపక్ష, విపక్ష సభ్యులంతా చప్పట్లతో అసెంబ్లీని హోరెత్తించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీడబ్ల్యుసీ సీనియర్ సభ్యుడు ఏకే ఆంటోనీ తదితరులు ఫోన్ చేసి అచ్యుతానందన్‌ను అభినందించారు. పాలనా సంస్కరణల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వీఎస్.. రాష్ట్రంలో ఐటీ రంగ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. రాష్ట్రంలోని ఐటీ ఉద్యోగులను దోచుకుంటున్నారని ఆయన అన్నారు. వెలిక్కత్ శంకరన్ అచ్యుతానందన్ 1923 అక్టోబర్ 20వ తేదీన అళప్పుళ జిల్లాలోని ఉన్నప్ర గ్రామంలో ఓ కార్మిక కుటుంబంలో పుట్టారు. 1964లో సీపీఐ నుంచి సీపీఎం విడిపోయినప్పటికే ఆయన పార్టీ సభ్యుడు. 2006-11 సంవత్సరాల మధ్య ఆయన కేరళ సీఎంగా వ్యవహరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష నేత. ఈసారి మళ్లీ వామపక్షం గెలిచినప్పుడు కూడా ఆయనను సీఎం చేస్తారని అనుకున్నా, ఆయన వయసు.. శారీరక పరిమితుల దృష్ట్యా ఆయన్ను కాదని పినరయి విజయన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. -
కొత్త కేబినెట్ కు మాజీ సీఎం సెల్యూట్
తిరువనంతపురం: పినరయి విజయన్ నేతృత్వంలో ఏర్పడబోయే ఎల్డీఎఫ్ సంకీర్ణ ప్రభుత్వం ప్రజల మద్దతుతో మంచి పరిపాలన అందించాలని కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ ఆకాంక్షించారు. కేరళను విజయన్ ప్రభుత్వం ప్రగతిపథంలో నడిపిస్తుందన్న ఆకాంక్షను ఆయన వెలిబుచ్చారు. ఈ మేరకు తన అభిప్రాయాలను పేస్ బుక్ లో పోస్ట్ చేశారు. విజయన్ నాయకత్వంలో కొత్తగా ఏర్పడబోయే కేబినెట్ కు ఆయన అభినందలు తెలుపుతూ సెల్యూట్ చేశారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యాల గురించి విజయన్ చేసిన ప్రకటనను ఆయన స్వాగతించారు. కేరళలో శాంతిభద్రతలు క్షీణించాయని బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై కూడా అచ్యుతానందన్ స్పందించారు. ప్రగతిశీల ప్రభుత్వాలను కూలదోసేందుకు కాషాయ పార్టీ వెనుకాడబోదని, వామపక్షాలు ఒక కంట కనిపెట్టుకుని ఉండాలని అన్నారు. -
మోదీకి కురువృద్ధ నేత ఘాటు కౌంటర్
తిరువనంతపురం: కేరళ సీపీఎం కురువృద్ధ నేత, మాజీ సీఎం వీఎస్ అచ్చుతానందన్ తనదైన శైలిలో ప్రధాని నరేంద్రమోదీపై ఘాటు విమర్శలు చేశారు. ఎంతసేపు స్వచ్ఛ భారత్, మరుగుదొడ్ల నిర్మాణం అని చెప్పే మోదీ.. ముందు దేశంలో చాలామందికి తినడానికి తిండి కూడా లేదనే విషయం గుర్తించాలని అన్నారు. అసలు తిండే లేనప్పుడు శౌచాలయం(మరుగుదొడ్డి) కట్టుకొని ఏం చేస్తారని ఆయన వినూత్న విమర్శ చేశారు. ప్రస్తుతం సీపీఎం విజయం సాధిస్తే.. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్న ఆయన ఓ టీవీ చానెల్ తో మాట్లాడారు. ప్రధానంగా మోదీ కార్యక్రమాలపైనే ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. 'అతడు (ప్రధాని నరేంద్రమోదీ) ఎంతసేపు ప్రతి భారతీయుడికి శౌచాలయ్.. శౌచాలయ్.. శౌచాలయ్ అని పాడుతున్నారు. కానీ, తినడానికి తిండే లేనప్పుడు వాళ్లు ఆ శౌచాలయాన్ని ఎలా ఉపయోగించుకుంటారు' అని ఆయన ప్రశ్నించారు.