తణుకుకు తరలిరండి
నేటి నుంచి జగన్ రైతుదీక్ష విజయవంతం
చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
మర్రి రాజశేఖర్ పిలుపు
గుంటూరు సిటీ : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముఖ్యమంత్రి అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను ఎండగడుతూ, ప్రజల పక్షాన ప్రశ్నించడానికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో తలపెట్టిన రైతు దీక్షను విజయవంతం చేసేందుకు తరలిరావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం గుంటూరు లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలు మాఫీ కాలేదు.
కొత్త రుణాలు పుట్టే అవకాశమే లేదు. మరోవైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇక రాష్ట్రంలో రైతు బతికేదెలాగని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రధానంగా ఇచ్చిన రుణమాఫీ హామీనే మాఫీ చేసిన ఘనుడని సీఎం చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు సైతం రద్దు చేయకుండా మహిళల ఉసురుపోసుకున్నారని ధ్వజమెత్తారు. సీఆర్డీఏ చట్టాన్ని అడ్డుపెట్టుకుని రాజధాని ప్రతిపాదిత గ్రామాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే బాధ్యత గల ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శని, ఆదివారాలు రైతుదీక్ష చేస్తున్నారని వివరించారు. ఇప్పటివరకు సీఎం సాధించిందేమీ లేదని, అయినప్పటికీ ఏదో ఊడబొడిచేసినట్లుగా నాలుగు రోజుల పాటు పాలనకు బ్రేక్ వేసి మంత్రులు, అధికారులు యోగా సాధకులుగా మారిపోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ దీక్ష దేనికని మంత్రులతో ప్రశ్నింపజేస్తున్న చంద్రబాబు తన యోగా దేనికో ముందు సెలవీ యాలని మర్రి రాజశేఖర్ డిమాండ్ చేశారు.