waltair railway division
-
వాల్తేర్ డివిజన్‌కు రూ.2857.85 కోట్లు కేటాయింపు
విజయనగరం టౌన్: ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్‌కు 2023–24 బడ్జెట్లో రూ. 2857.85 కోట్లు కేటాయించినట్టు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో విజయనగరం–సంబల్ పూర్ (టిట్లాఘర్) మూడోలైన్ (264.60 కిలోమీటర్లు) నిర్మాణానికి 920 కోట్లు, కొత్తవలస–కోరాపుట్ (189.278 కిలోమీటర్లకు) రూ. 410 కోట్లు కేటాయింపులు జరిగాయన్నారు. గోపాలపట్నం–విజయనగరం వరకూ ఆటో సిగ్నలింగ్ వ్యవస్థ, బైపాస్లైన్లు ఏర్పాటుకు రూ. 32.78 కోట్లు, రోడ్డు సేఫ్టీ వర్క్స్, అండర్ బ్రిడ్జిలకు సంబంధించి గుమడ–పార్వతీపురం ఆర్ఓబీకి రూ.60 లక్షలు, పలాస–పూండి లైన్‌కు రూ.2.05 కోట్లు, పొందూరు–సిగడం రోడ్డు ఓవర్ బ్రిడ్జికి రూ.1.50 కోట్లు, కోమటిపల్లి–గజపతినగరం ఆర్ఓబీ లెవెల్ క్రాసింగ్ రూ. 2లక్షలు, పలాస–పూండి, నౌపడలలో లిమిటెడ్ హైట్ సబ్వేస్కు రూ.3.71 కోట్లు, కోటబొమ్మాళి–తిలారు, పలాస–పూండి,కోట బొమ్మాళి యార్డ్‌లలో లిమిటెడ్ హైట్ సబ్వేస్కు రూ.3.2కోట్లు, కొత్తవలస– కిరండాల్ సబ్వేస్ లెవెల్ క్రాసింగ్లకు రూ.78 లక్షలు, నౌపాడ–కోట బొమ్మాళి ఆర్ఓబీ సబ్‌వేకు రూ.2 కోట్లు, ఉర్లాం–శ్రీకాకుళం ఆర్ఓబీకి రూ.2 కోట్లు కేటాయింపులు చేశారని పేర్కొన్నారు. రైల్వే ట్రాక్‌ల ఆధునికీరణకు సంబంధించి పలాస–విశాఖ–దువ్వాడకు రూ.40 కోట్లు, కోరాపుట్ –సింగపూర్ లైన్‌కు రూ.20.01 కోట్లు, సింగపూర్ –విజయనగరం రోడ్డుకు రూ.25 కోట్లు కేటాయించారన్నారు. రైల్వే అధికారులు, సిబ్బంది క్వార్టర్స్ ఆధునికీకరణ, రిపేర్లకు సంబంధించి రూ.15 లక్షలు కేటాయింపులు జరిగాయన్నారు. వీటితో పాటు సిగ్నల్ అండ్ టెలికమ్, వర్క్‌షాప్ ప్రొడక్షన్ యూనిట్స్, కొత్త లైన్లు, డబ్లింగ్ పనులు, రీమోడలింగ్స్, కొన్ని ప్రత్యేక గుర్తింపు పొందిన పనులకు నిధులు కేటాయించారన్నారు. -
గుడ్‌న్యూస్: ఈ రూట్లలో సంక్రాంతి పండుగకి ప్రత్యేక రైళ్లు
సాక్షి, విశాఖపట్నం: సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ–శ్రీకాకుళం రోడ్–వికారాబాద్ మధ్య వయా దువ్వాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు. ►కాచిగూడ–శ్రీకాకుళం రోడ్(07611) రైలు: కాచిగూడలో ఈ నెల 10న సాయంత్రం 6.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45కు దువ్వాడ చేరుతుంది. తిరిగి 5.47కు బయలుదేరి అదే రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. ►శ్రీకాకుళం రోడ్–వికారాబాద్(07612) రైలు: శ్రీకాకుళం రోడ్లో ఈ నెల 11న మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అదే రోజు సాయత్రం 5.10కు దువ్వాడ చేరుకుని, తిరిగి 5.47కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. ►వికారాబాద్–శ్రీకాకుళంరోడ్(07613) స్పెషల్: వికారాబాద్‌లో ఈ నెల 12న సాయంత్రం 4 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.45కు దువ్వాడ చేరుతుంది. తిరిగి 5.47కు బయలుదేరి అదే రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. ►శ్రీకాకుళం రోడ్–కాచిగూడ(07614) స్పెషల్: శ్రీకాకుళం రోడ్లో ఈ నెల 13న మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం 5.20కు దువ్వాడ చేరుకుని, తిరిగి 5.22కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. రైళ్ల గమ్యం కుదింపు, దారి మళ్లింపు.. ►వాల్తేర్ డివిజన్ కే–ఆర్ లైన్ కోరాపుట్–మనబర్, కోరాపుట్–దుమురిపుట్ సెక్షన్ల మధ్య జరుగుతున్న ట్రాక్ ఆధునికీకరణ, రెండో ట్రాక్ పనుల నిమిత్తం పలు రైళ్ల గమ్యం కుదిస్తున్నట్లు, మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ►విశాఖపట్నం–కోరాపుట్(08546) పాసింజర్ స్పెషల్ ఈ నెల 5 నుంచి 10 వరకు లక్ష్మీపూర్ రోడ్ వరకు మాత్రమే నడుస్తుంది. కోరాపుట్–విశాఖపట్నం(08545) పాసింజర్ స్పెషల్ ఈ నెల 6 నుంచి 11 వరకు లక్ష్మీపూర్ రోడ్ నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటుంది. ►విశాఖపట్నం–కోరాపుట్(08512) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 6, 9 తేదీల్లో దమన్‌జోడి వరకు మాత్రమే నడుస్తుంది. కోరాపుట్–విశాఖపట్నం(08511) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 7, 10 తేదీల్లో దమన్‌జోడి నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటుంది. ►ఈ నెల 6న విశాఖలో బయలుదేరే విశాఖపట్నం–కిరండూల్(08551) పాసింజర్ స్పెషల్ అరకు వరకు మాత్రమే నడుస్తుంది. ►ఈ నెల 6న కిరండూల్‌లో బయలుదేరే కిరండూల్–విశాఖపట్నం(08552) పాసింజర్ స్పెషల్ జయపూర్ వరకు మాత్రమే నడుస్తుంది. -
విశాఖ to బెంగళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు ఫుల్ డిమాండ్
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): బెంగళూరు రైలు ప్రయాణం విశాఖ వాసులకు గగనంగా మారింది. ఫుల్ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఒకటి అయినా.. బెంగళూరుకు విశాఖ నుంచి నేరుగా ఒక్క రైలు కూడా లేదు. అన్నీ ఇతర ప్రాంతాల నుంచి విశాఖ మీదుగా వెళ్లేవే. వాటిలో విశాఖ కోటా చాలా తక్కువ. గతంలో విశాఖపట్నం నుంచి నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను భువనేశ్వర్‌కు మళ్లించేశారు. అప్పటి నుంచి ప్రజాప్రతినిధులు, బెంగళూరుకు ప్రత్యేక రైలు కోసం ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకునేవారే లేకపోయారు. రిజర్వేషన్ కష్టమే.. విశాఖపట్నం మీదుగా బెంగళూరుకు ఎన్ని రైళ్లు రాకపోకలు సాగిస్తున్నా అన్ని ఫుల్‌గానే నడుస్తాయి. ప్రస్తుతం విశాఖపట్నం మీదుగా ప్రశాంతి, హౌరా –యశ్వంత్‌పూర్ వంటి రెగ్యులర్ రైళ్లతో పాటు, ముజఫర్‌పూర్–యశ్వంత్‌పూర్(మంగళ), గౌహతి–శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినస్ బెంగళూరు(ఎస్ఎంవీటీ) (సోమ, మంగళ, బుధ), హౌరా–ఎస్ఎంవీటీ (హమ్‌సఫర్)(మంగళ), హతియా–ఎస్ఎంవీటీ (సోమ, బుధ) భువనేశ్వర్–కృష్ణరాజపురం(హమ్‌సఫర్)(బుధ), డిబ్రూఘడ్–ఎస్ఎంవీటీ స్పెషల్ (గురు), భాగల్పూర్–ఎస్ఎంవీటీ (బుధ), టాటా–యశ్వంత్‌పూర్(శుక్ర), పూరీ–యశ్వంత్‌పూర్ (గరీబ్‌రధ్)(శుక్ర), హౌరా–మైసూరు(శని), టాటా–యశ్వంత్‌పూర్(శని). ప్రతీ ఆదివారాలలో హతియా–ఎస్ఎంవీటీ(ఆది), భువనేశ్వర్–బెంగళూరు కంటోన్మెంట్(ఆది), న్యూ టిన్సుకియా–బెంగళూరు(సోమ), అగర్తలా–ఎస్ఎంవీటీ(హమ్‌సఫర్) (సోమ) వంటీ వీక్లీ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. కానీ ఈ రైళ్లలో ఎప్పుడూ రిజర్వేషన్ దొరకదు. ఈ ఎక్స్‌ప్రెస్‌లలో రిజర్వేషన్ కావాలంటే కనీసం రెండు, మూడు నెలలు ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాలి. నగరవాసులు ఎక్కువశాతం బెంగళూరు వంటి ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వీరు తరచూ నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. కానీ రైళ్లలో వీరికి రిజర్వేషన్ దొరకక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీక్లీ ఎక్స్‌ప్రెస్.. మరో రెండు ఆదివారాలే.. ప్రస్తుత డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్‌కుమార్ సత్పతి ప్రత్యేక కృషితో విశాఖపట్నం నుంచి బెంగళూరుకు డైరెక్ట్‌గా వీక్లీ స్పెషల్ రైలును తాత్కాలికంగా రెండు నెలలు నడిపేందుకు అనుమతి వచ్చింది. ఈ విషయం జూలై 22న ప్రకటించగా వెంటనే ఈ రైల్లోని సీట్లు అన్ని దాదాపుగా ఫుల్ అయిపోయాయి. ఆగస్ట్ 7వ తేదీ నుంచి ఇప్పటివరకు ఈ రైలు 6 ట్రిప్పులు నడవగా ప్రతీ సారి సీట్లు, బెర్తులు ఫుల్ అయ్యి, పూర్తి ఆక్యుపెన్సీతో ఈ రైలు నడిచింది. ఇంకా మిగిలి ఉన్న రెండు ట్రిప్పులలో అంటే సెప్టెంబరు 18, 25తేదీల్లోనూ స్లీపర్ వెయిటింగ్ లిస్ట్ 64, 08 ఉంది, ఇక ఏసీలో 25, 2 ఉంది. కోచ్‌లు పెంచినా తరగని జాబితా.. ఈ రైలు ఆక్యుపెన్సీ దృష్టిలో పెట్టుకుని ఆగస్ట్ 22వ తేదీ నుంచి ఒక స్లీపర్‌క్లాస్, ఒక థర్డ్ ఏసీ కోచ్‌లను అదనంగా జత చేశారు. అయినా వెయిటింగ్ లిస్ట్ జాబితా తరగడం లేదు. గత ఆదివారం (సెప్టెంబరు 11వ తేదీన) రిజర్వేషన్లు దొరక్క స్లీపర్‌లో దాదాపు 43 మంది, ఏసీలో 15 మంది టికెట్లు రద్దు చేసుకున్నట్లు సమాచారం. అదనంగా పెంచిన కోచ్‌లతో ఈ రైల్లో మొత్తం స్లీపర్ క్లాస్ 720, థర్డ్ ఏసీ–370, సెకండ్ ఏసీ–46 బెర్తులు, సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయినా విశాఖపట్నం నుంచే ప్రతీసారి నూరు శాతం ఆక్యుపెన్సీతో బయల్దేరుతుంది. ఇంత డిమాండ్ ఉన్న ఈ మార్గంలో నడిచే ఈ వీక్లీ స్పెషల్‌ను డైలీ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని నగరవాసులు కోరుతున్నారు. దీనిపై ఇటీవల విలేకరుల సమావేశంలో డీఆర్ఎం మాట్లాడుతూ డిమాండ్ ఉన్న రూట్లలో రైళ్లు నడిపేందుకు, అవసరమైనప్పుడు అదనపు కోచ్‌లను జత చేసేందుకు వాల్తేర్ డివిజన్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఆయన కృషి ఫలించి, విశాఖ వాసుల ఆశ నెరవేరాలని ఆకాంక్షిద్దాం. (క్లిక్: నయా ‘ఆన్లైన్’ మోసం.. ఆర్డర్ ఇవ్వకపోయినా ఇంటికి కొరియర్) -
శ్రీమంతుడు సినిమాలోలా.. రైలు వదిలి సైకిలెక్కి!
తాటిచెట్లపాలెం: ఆయన వాల్తేరు డివిజన్ డీఆర్ఎం. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు గ్రామంలో పర్యటించినట్టు డీఆర్ఎం అనూప్‌కుమార్ సత్పతి కూడా తాటిచెట్లపాలెం రైల్వే కాలనీలో పర్యటించారు. కాలనీ మొత్తం సైకిల్‌పైనే ప్రయాణించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకున్నారు. కాలనీ ప్రజలతో మాట్లాడారు. సదుపాయాలు, వసతులు, పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, పార్కుల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. పారిశుధ్య, పరిశుభ్రత, సెక్యూరిటీ విషయంలో అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని సిబ్బందిని హెచ్చరించారు. ఆయన వెంట సివిల్ ఇంజినీరింగ్ విభాగ అధికారులు, పర్యావరణ, ఆరోగ్య విభాగ సిబ్బంది ఉన్నారు. -
‘ఈస్ట్‌కోస్ట్’లో కోచ్‌ల ఆట
సాక్షి, విశాఖపట్నం: ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారుల పక్షపాత ధోరణి మరోసారి బట్టబయలైంది. వాల్తేరు డివిజన్‌కు పాత కోచ్‌లు పడేసి.. కొత్త టెక్నాలజీతో తయారైన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను తమ పరిధిలో తిప్పుకోవడం వారికి ఆనవాయితీగా మారిపోయింది. వీటిపై విమర్శలు రావడంతో ఈసారి కొత్త పంథాని అనుసరించారు. కొత్త కోచ్‌లను విశాఖ డివిజన్‌కు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించి.. తమ పరిధిలోనే కొత్త కోచ్‌లను తిప్పుకుంటున్నారు. తాజాగా వచ్చిన ప్రకటనతో ఈ విషయం తేటతెల్లమైంది. పేరు వాల్తేరుదే అయినా.. కొత్త కోచ్‌లపై పెత్తనం మాత్రం భువనేశ్వర్దేనన్న విషయం చెప్పకనే చెప్పారు. జగదల్పూర్–భువనేశ్వర్(08445) స్పెషల్ ట్రైన్‌ను ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో ఈ నెల 10 నుంచి నడుపుతున్నట్లు గురువారం వాల్తేరు డివిజన్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ రైలు వాస్తవానికి జగదల్పూర్, కోరాపుట్, రాయగడ, విజయనగరం, పలాస మీదుగా ప్రయాణిస్తుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు రాదు. ఈ రైలు వల్ల విశాఖ డివిజన్‌కు పెద్దగా ఉపయోగం లేదు. వాల్తేరు డివిజన్ పరిధిలో ఉన్న కొన్ని స్టేషన్ల మీదుగా రైలు వెళ్తుంది కాబట్టి.. విశాఖ డివిజన్‌కు కేటాయించామని చెబుతున్నారు. కానీ.. పెత్తనమంతా భువనేశ్వర్ అధికారులదే. విశాఖ స్టేషన్‌కు రాని ఎల్‌హెచ్‌బీ ట్రైన్‌ని వాల్తేరు డివిజన్‌కు కేటాయిస్తున్నట్లు ఎలా పేర్కొంటారని రైల్వే యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విమర్శిస్తున్నారు. దీనిపై వాల్తేరు డివిజన్ అధికారులు కూడా నోరు మెదపకపోవడం శోచనీయమని వ్యాఖ్యానిస్తున్నారు. -
Waltair Railway Division: ఉన్నట్టా? లేనట్టా..?
సాక్షి, విశాఖపట్నం: శతాబ్దానికి పైగా మహోజ్వల చరిత ఉన్న వాల్తేరు డివిజన్ కొత్త జోన్ ప్రకటనతో కనుమరుగు కానుందని స్పష్టమైపోయింది. విశాఖ కేంద్రంగా సౌత్‌కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా వాల్తేరు డివిజన్ నుంచి మేజర్ భాగాలను విడదీసి రాయగడ డివిజన్‌గా ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంతో పాటు కొత్త డివిజన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది. అయితే తాజాగా రైల్వే మంత్రి చేసిన ప్రకటన మళ్లీ వాల్తేరుకు ఊపిరి పోసింది. కొత్త జోన్లో విశాఖ డివిజన్ కొనసాగుతుందన్న ఆశలు మళ్లీ చిగురించాయి. వాల్తేరు డివిజన్ తూర్పు కోస్తా రైల్వేకు ప్రధాన ఆదాయ వనరు. రాష్ట్ర విభజన తర్వాత విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో 2019 ఫిబ్రవరి 27న కేంద్రం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. రైల్వే జోన్ రాక ఓవైపు ఆనందాన్ని కలిగించినా వాల్తేర్ డివిజన్ రద్దు చేసి డివిజన్ ప్రధాన కేంద్రంగా రాయగడను ప్రకటించడం అందర్నీ నిరాశకు గురిచేసింది. వాల్తేరును 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని విజయవాడ డివిజన్‌లోనూ మరోభాగాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న రాయగడ డివిజన్‌లోనూ కలుపుతున్నట్టు ప్రకటించడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. వైఎస్సార్సీపీ ఎంపీలు రాజ్యసభలో పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించారు. రైల్వే బోర్డుకు, ప్రధానికి వినతిపత్రాలు అందించారు. కానీ రైల్వే మంత్రిత్వ శాఖ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. జోన్‌కు వాల్తేరే కీలకం తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు వాల్తేరు డివిజన్ ఆదాయాన్ని తెచ్చిపెట్టే అతిపెద్ద డివిజన్. ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా, ఇతరత్రా ఆదాయం ఏటా దాదాపు రూ. 15 వేల కోట్లు కాగా, ఇందులో రూ.7 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు రూ.25 లక్షలు వస్తోంది. ఇది భువనేశ్వర్ (రూ.12–14 లక్షలు) కంటే ఎక్కువ. దేశంలోనే 260 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ ప్యాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ విశాఖ. ఇందులో సింహభాగం ఆదాయం ఐరెన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. ఇదంతా రాయగడ డివిజన్‌కు సొంతమవుతుంది. ఈ విషయంపైనే అనేక ఫిర్యాదులు బోర్డుకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకటనతో డివిజన్‌పై మళ్లీ ఆశలు మొలకెత్తాయి. ‘వాల్తేరు’ వినతులను పరిగణనలోకి.. పార్లమెంట్ సమావేశాల్లో విశాఖ జోన్ అంశం ప్రస్తావనకు వచ్చింది. జోన్ డీపీఆర్ సమర్పించి 23 నెలలు గడుస్తున్నా రైల్వే బోర్డు మాత్రం ఇంకా పరిశీలనలోనే ఉందని చెబుతున్న నేపథ్యంలో ఎంపీలు వాల్తేరు డివిజన్, రైల్వే జోన్ అంశంపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానమిచ్చారు. జోన్ ఏర్పాటుకు సమయాన్ని నిర్దేశించలేదని ప్రస్తుతం డీపీఆర్‌ని బోర్డు పరిశీలిస్తోందని చెప్పారు. వాల్తేరు డివిజన్‌ను విభజించకుండా.. కొత్త జోన్లో కొనసాగించాలని రాష్ట్రం నుంచి అనేక వినతులు వచ్చాయని వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటున్నామని వివరించారు. కొత్త జోన్ ఏర్పాటు, దాని భౌగోళిక పరిధిపై పరిపాలన, నిర్వహణ అవసరాలతో పాటు వాల్తేరు డివిజన్ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంటుందని మొత్తం ప్రక్రియకు సమయం పడుతుందన్నారు. మంత్రి ప్రకటనతో ప్రజలకు కొంత ఊరట లభించింది. దక్షిణ కోస్తా జోన్ డీపీఆర్ స్వరూపమిదీ.. (2018–19 అంచనాల ప్రకారం..) ► జోన్ ఆదాయం – రూ.12,200 కోట్లు ► సరకు రవాణా– 86.7 మిలియన్ టన్నులు ► ప్రయాణికులు– 19.25 కోట్లు ► సిబ్బంది– 65,800 మంది ► మొత్తం రైల్వే రూట్ – 3,496 కిమీ ► మొత్తం రైల్వే ట్రాక్– 5,437 కిమీ పోర్టులు ► విశాఖపట్నం, ► గంగవరం, ► కాకినాడ, ►కృష్ణపట్నం ►జోన్ ప్రధాన కార్యాలయానికి ప్రతిపాదించిన వ్యయం: రూ.111 కోట్లు -
ఏపీలో ‘స్మార్ట్’గా రైల్వే సేవలు
సాక్షి, అమరావతి: రైలు టెర్మినళ్ల వద్ద వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రైల్వే శాఖ కొత్త పథకాన్ని తీసుకురానుంది. ఇందుకు గూడ్స్ షెడ్లను ఎంచుకుని అక్కడే వ్యాపారం ఆరంభించేందుకు ‘సర్వీస్ మార్కెట్ ఎట్ రైల్ టెర్మినల్స్’ (స్మార్ట్) అనే పథకం ప్రారంభించనుంది. రైలు టెర్మినళ్ల వద్ద సర్వీస్ మార్కెట్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులను ఆహ్వానించనుంది. అంటే గూడ్స్ షెడ్ల వద్ద సరుకును నేరుగా వినియోగదారులకు అందించేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు అవకాశం కల్పిస్తోంది. ఏపీలో ఈస్ట్‌కోస్ట్ రైల్వే పరిధిలోని వాల్తేరు డివిజన్ ఐదు చోట్ల గూడ్స్ షెడ్ల నిర్మాణం చేపట్టనుంది. ఉత్తరాంధ్రలోని కంటకపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, బొబ్బిలి, విశాఖపట్నంలలో గూడ్స్ షెడ్ల నిర్మాణాలు జరగనున్నాయి. సర్వీస్ ప్రొవైడర్లకు, వినియోగదారులకు మేలు స్మార్ట్ పథకం ద్వారా సర్వీస్ మార్కెట్ చేయాలనుకునే సర్వీస్ ప్రొవైడర్లు తమ సరుకు రైల్ ట్రాన్స్‌పోర్టు ద్వారా గూడ్స్ షెడ్లకు చేరుస్తారు. అక్కడి నుంచి నేరుగా వినియోగదారులకు మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రోడ్డు రవాణా కంటే రైల్ ట్రాన్స్‌పోర్టు ధరలు చౌకగా మారాయి. చౌకగా వినియోగదారులకు సరుకును అందించే అవకాశం ఉంటుంది. సర్వీస్ ప్రొవైడర్లు గూడ్స్ షెడ్ల ద్వారా మార్కెట్ చేయాలనుకుంటే తమ సంస్థ పేరును కానీ, వ్యక్తిగతంగా వివరాల్ని ఫ్రైట్ ఆపరేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎఫ్‌వోఐఎస్) ద్వారా నమోదు చేసుకోవాలి. వినియోగదారుడు ఎవరైనా నేరుగా సర్వీస్ ప్రొవైడర్‌ను స్మార్ట్ పథకం ద్వారా సంప్రదించవచ్చు. ట్రక్కులు, లాజిస్టిక్స్ వ్యాపారులు, రైలు రవాణాను ఉపయోగించే వినియోగదారులకు ప్రయోజకనకరంగా ఉంటుంది. ఇప్పటికే బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్లు దక్షిణ మధ్య రైల్వే గతేడాది అన్ని డివిజన్ల పరిధిలో బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్లు ఏర్పాటు చేసింది. సరుకు రవాణాలో కీలకంగా ఈ బీడీయూలను భాగస్వామ్యం చేసి ఆదాయం ఆర్జిస్తోంది. రైతులు, చిరువ్యాపారులు సైతం ఇతర రాష్ట్రాలకు రైల్వే వ్యాగన్ల ద్వారా సరుకు రవాణా చేస్తూ తమ ఉత్పత్తులకు మంచి ధరను పొందుతున్నారు. గతేడాది సరుకు రవాణా ద్వారా ఏపీ నుంచి రైల్వే శాఖ రూ.2,600 కోట్ల ఆదాయం పొందింది. అధికశాతం కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల నుంచి సరుకు రవాణాలో భాగస్వామ్యం ఉంది. -
‘వాల్తేరు’ ఉద్యోగులకు ఊరట
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్(దక్షిణ కోస్తా) రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రత్యేకాధికారి ఇటీవలే రైల్వే అందించారు. దానిపై వివిధ వర్గాల సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత నాలుగు నెలల్లోగా జోన్ ప్రారంభానికి నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముంది. కొత్త జోన్ ఏర్పాటు, వాల్తేరు డివిజన్ విభజన జరిగితే తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్న ఉద్యోగులకు ఉపశమనం కలిగించే పలు అంశాలను సైతం డీపీఆర్‌లో చేర్చారు. సీనియారిటీ పోతుందనే ఆందోళన.. జోన్ ఏర్పాటుతోనే మనుగడ కోల్పోనున్న వాల్తేరు డివిజన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఏ డివిజన్ కిందికి వస్తారన్న దానిపై ఇంతవరకు సందిగ్ధత ఉంది. కొత్త డివిజన్లలో తమను విలీనం చేస్తే సీనియారిటీ కోల్పోయి పదోన్నతి అవకాశాలు దూరమవుతాయని ఉద్యోగులు కలత చెందారు. కలాసీలు, ట్రాక్మెన్లు, టెక్నీషియన్లుగా ఉద్యోగాల్లో చేరి ఏళ్ల తరబడి ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారు పెద్దసంఖ్యలోనే ఉన్నారు. వారిలో వందలాది కలాసీలతోపాటు మూడేళ్లకు పైగా సర్వీస్ చేసిన సుమారు 300 మంది గ్యాంగ్మెన్లు జేఈ పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. డివిజన్ విడిపోతే టెక్నీషియన్లు డివిజనల్ సీనియారిటీ, గ్రూప్–డి ఉద్యోగులు యూనిట్ సీనియారిటీ కోల్పోయే ప్రమాదముందని ఉన్నతాధికారులకు విన్నవించుకున్నారు. విభజించినా విశాఖలోనే... ఉద్యోగుల ఆందోళనలకు తెరదించుతూ దక్షిణ కోస్తా జోన్ డీపీఆర్‌లో కొన్ని మార్గదర్శకాలు పొందుపరిచారు. వాల్తేరు డివిజన్లో ఉన్న ప్రతి ఉద్యోగి జోన్ పరిధిలోనే కొనసాగేలా చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం వాల్తేర్ డివిజన్లో 17,985 మంది ఉద్యోగులుండగా వీరిలో 930 మంది డీఆర్ఎం కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. జోన్ ప్రధాన కార్యాలయానికి 1250 మంది ఉద్యోగులు అవసరం. అంటే.. డీఆర్ఎం కార్యాలయంలో ప్రస్తుతం ఉన్న వారికి అదనంగా 320 మంది అవసరం. డీఆర్ఎం కార్యాలయ పరిధిలో పనిచేసే ఉద్యోగులు మినహా.. మిగిలిన వారంతా.. తమ స్థానాల్లోనే కొనసాగుతారు. 930 మందికే ఆప్షన్లతో కూడిన స్థానచలనం ఉంటుంది. మొత్తం ఉద్యోగుల్లో వీరి సంఖ్య 10 శాతానికి మించదు. మూడు ఆప్షన్లు.. పైగా ఏడాది వ్యవధిలోనే.... డీఆర్ఎం కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులను మాత్రం కొత్త జోన్‌తో పాటు రాయగడ, విజయవాడ డివిజన్లలో సర్దుబాటు చేయనున్నారు. వీరికి మూడు ఆప్షన్లు ఇస్తారు. జోన్ కేంద్రం.. రాయగడ డివిజన్.. విజయవాడ డివిజన్.. ఈ మూడింటిలో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఇస్తారు. ఉద్యోగుల అభిప్రాయానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయనున్నారు. ఇక్కడి నుంచి బయటకు వెళ్లినా ఉద్యోగులు కొత్త జోన్ పరిధిలోకే వస్తారు. ఫలితంగా వారి సీనియారిటీలో మార్పులేకుండా ప్రమోషన్లు పొందేలా విధివిధానాలు రూపొందించారు. కొత్తగా ఏర్పడనున్న రాయగడ డివిజన్‌కు వెళ్లిన వారికి అదనపు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. కొత్త డివిజన్లో ఏడాది కాలం పని చేశాక.. ఎక్కడికి కావాలంటే అక్కడికి బదిలీ కోరే సౌకర్యం కల్పించనున్నారు. కాగా ఏ చిన్న పనికైనా విజయవాడ డివిజన్ కేంద్రానికి వెళ్లాల్సి వస్తుందన్న ఆందోళనకు కూడా పరిష్కారం సూచిస్తున్నారు. ఈ తరహా ఇబ్బందులను పరిహరించేందుకు వీలుగా ప్రత్యేక యాప్, వెబ్సైట్ రూపొందించనున్నారు. మొత్తంగా.. వాల్తేరు డివిజన్ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా డీపీఆర్‌ని రూపొందించినట్లు రైల్వే ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. -
హౌరా - ఎర్నాకులం సువిధ వీక్లీ రైలు
తాటిచెట్లపాలెం : వేసవి రద్దీ దృష్ట్యా హౌరా-ఎర్నాకులం-హౌరా స్టేషన్ల మధ్య వీక్లీ సువిధ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 9 నుంచి జూన్ 28వ తేదీల మధ్య 12 ట్రిప్పులు నడపనున్నట్టు ఈకో రైల్వే వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎల్వేందర్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. హౌరా నుంచి ఎర్నాకులం వెళ్లే సువిధ రైలు(02853) ఈ నెల 9 నుంచి జూన్ 25 తేదీల్లో(శనివారాల్లో) సాయంత్రం 5 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు ఉదయం 6.45 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఆపై మర్నాడు ఉదయం 6 గంటలకు ఎర్నాకులం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 02854 నంబరుతో ఎర్నాకులం నుంచి ఈ నెల 12 నుంచి జూన్ 28 తేదీల్లో(మంగళవారాల్లో) ఉదయం 8.50 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు ఉదయం 8.25 గంటలకు విశాఖ చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 11 గంటలకు హౌరా చేరుకుంటుంది. ఓ సెకండ్ ఏసీ, నాలుగు థర్డ్ ఏసీ, 12 స్లీపర్ కోచ్‌లు, మరో రెండు సెకండ్ సిట్టింగ్ కమ్ లగేజ్ కోచ్‌లున్న ఈ రైలు భద్రక్, కటక్, భువనేశ్వర్, ఖుర్దారోడ్, బ్రహ్మపూర్, విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగిస్తుంది. -
విశాఖ దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు వేళల్లో మార్పు
విశాఖపట్నం : విశాఖపట్నం, సికింద్రాబాద్ నగరాల మధ్య నడిచే దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరు వేళల్లో స్పల్ప మార్పులు చేశారు. ఈ మేరకు వాల్తేరు డివిజన్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. రాత్రి 8.15 గంటలకు బదులు అరగంట ముందుగానే అంటే 7.45 గంటలకు బయలుదేరనుందని తెలిపింది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరు సమయంలో స్వల్ప మార్పులు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది. -
విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో పలు రైళ్లు రద్దు
సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. దాంతో సీమాంధ్రతోపాటు హైదరాబాద్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లనున్నాయి. అయితే ఇప్పటికే అధికారులు నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనధికార కోతలు విధిస్తున్నారు. కాగా విజయవాడ సమీపంలోని వీటీపీఎస్‌లో ఉద్యోగుల సమ్మె నేడు 3వ రోజుకు చేరుకుంది. దాంతో 1500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది, ఆ ప్రాజెక్ట్‌లో 770 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విద్యుత్ ఉద్యోగుల సమ్మె రైల్వే శాఖను తాకింది. దాంతో సికింద్రాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, రేణిగుంట మార్గంలోని అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో పలురైళ్లు ఆగిపోవడం లేదా రద్దు చేసే అవకాశం ఉందని వాల్తేర్ డివిజన్ అధికారులు వెల్లడించారు. ఉద్యోగుల సమ్మెతో ప్రకాశం జిల్లా పూర్తిగా అంధకారమయం అయింది. దాంతో జిల్లాలో పలురైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు.