సాక్షి, విశాఖపట్నం: శతాబ్దానికి పైగా మహోజ్వల చరిత ఉన్న వాల్తేరు డివిజన్ కొత్త జోన్ ప్రకటనతో కనుమరుగు కానుందని స్పష్టమైపోయింది. విశాఖ కేంద్రంగా సౌత్‌కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా వాల్తేరు డివిజన్ నుంచి మేజర్ భాగాలను విడదీసి రాయగడ డివిజన్‌గా ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంతో పాటు కొత్త డివిజన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది. అయితే తాజాగా రైల్వే మంత్రి చేసిన ప్రకటన మళ్లీ వాల్తేరుకు ఊపిరి పోసింది. కొత్త జోన్‌లో విశాఖ డివిజన్ కొనసాగుతుందన్న ఆశలు మళ్లీ చిగురించాయి. వాల్తేరు డివిజన్ తూర్పు కోస్తా రైల్వేకు ప్రధాన ఆదాయ వనరు.
రాష్ట్ర విభజన తర్వాత విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో 2019 ఫిబ్రవరి 27న కేంద్రం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. రైల్వే జోన్ రాక ఓవైపు ఆనందాన్ని కలిగించినా వాల్తేర్ డివిజన్ రద్దు చేసి డివిజన్ ప్రధాన కేంద్రంగా రాయగడను ప్రకటించడం అందర్నీ నిరాశకు గురిచేసింది. వాల్తేరును 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని విజయవాడ డివిజన్‌లోనూ మరోభాగాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న రాయగడ డివిజన్‌లోనూ కలుపుతున్నట్టు ప్రకటించడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజ్యసభలో పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించారు. రైల్వే బోర్డుకు, ప్రధానికి వినతిపత్రాలు అందించారు. కానీ రైల్వే మంత్రిత్వ శాఖ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది.
జోన్‌కు వాల్తేరే కీలకం
తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు వాల్తేరు డివిజన్ ఆదాయాన్ని తెచ్చిపెట్టే అతిపెద్ద డివిజన్. ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా, ఇతరత్రా ఆదాయం ఏటా దాదాపు రూ. 15 వేల కోట్లు కాగా, ఇందులో రూ.7 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు రూ.25 లక్షలు వస్తోంది. ఇది భువనేశ్వర్ (రూ.12–14 లక్షలు) కంటే ఎక్కువ. దేశంలోనే 260 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ ప్యాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ విశాఖ. ఇందులో సింహభాగం ఆదాయం ఐరెన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. ఇదంతా రాయగడ డివిజన్‌కు సొంతమవుతుంది. ఈ విషయంపైనే అనేక ఫిర్యాదులు బోర్డుకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకటనతో డివిజన్‌పై మళ్లీ ఆశలు మొలకెత్తాయి.
‘వాల్తేరు’ వినతులను పరిగణనలోకి..
పార్లమెంట్ సమావేశాల్లో విశాఖ జోన్ అంశం ప్రస్తావనకు వచ్చింది. జోన్ డీపీఆర్ సమర్పించి 23 నెలలు గడుస్తున్నా రైల్వే బోర్డు మాత్రం ఇంకా పరిశీలనలోనే ఉందని చెబుతున్న నేపథ్యంలో ఎంపీలు వాల్తేరు డివిజన్, రైల్వే జోన్ అంశంపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానమిచ్చారు. జోన్ ఏర్పాటుకు సమయాన్ని నిర్దేశించలేదని ప్రస్తుతం డీపీఆర్‌ని బోర్డు పరిశీలిస్తోందని చెప్పారు. వాల్తేరు డివిజన్‌ను విభజించకుండా.. కొత్త జోన్‌లో కొనసాగించాలని రాష్ట్రం నుంచి అనేక వినతులు వచ్చాయని వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటున్నామని వివరించారు. కొత్త జోన్ ఏర్పాటు, దాని భౌగోళిక పరిధిపై పరిపాలన, నిర్వహణ అవసరాలతో పాటు వాల్తేరు డివిజన్ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంటుందని మొత్తం ప్రక్రియకు సమయం పడుతుందన్నారు. మంత్రి ప్రకటనతో ప్రజలకు కొంత ఊరట లభించింది.
దక్షిణ కోస్తా జోన్ డీపీఆర్ స్వరూపమిదీ..
(2018–19 అంచనాల ప్రకారం..)
► జోన్ ఆదాయం – రూ.12,200 కోట్లు
► సరకు రవాణా– 86.7 మిలియన్ టన్నులు
► ప్రయాణికులు– 19.25 కోట్లు
► సిబ్బంది– 65,800 మంది
► మొత్తం రైల్వే రూట్ – 3,496 కిమీ
► మొత్తం రైల్వే ట్రాక్– 5,437 కిమీ
పోర్టులు
► విశాఖపట్నం,
► గంగవరం,
► కాకినాడ,
►కృష్ణపట్నం
►జోన్ ప్రధాన కార్యాలయానికి ప్రతిపాదించిన వ్యయం: రూ.111 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment