సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్(దక్షిణ కోస్తా) రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రత్యేకాధికారి ఇటీవలే రైల్వే అందించారు. దానిపై వివిధ వర్గాల సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత నాలుగు నెలల్లోగా జోన్ ప్రారంభానికి నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముంది. కొత్త జోన్ ఏర్పాటు, వాల్తేరు డివిజన్ విభజన జరిగితే తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్న ఉద్యోగులకు ఉపశమనం కలిగించే పలు అంశాలను సైతం డీపీఆర్‌లో చేర్చారు.
సీనియారిటీ పోతుందనే ఆందోళన..
జోన్ ఏర్పాటుతోనే మనుగడ కోల్పోనున్న వాల్తేరు డివిజన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఏ డివిజన్ కిందికి వస్తారన్న దానిపై ఇంతవరకు సందిగ్ధత ఉంది. కొత్త డివిజన్లలో తమను విలీనం చేస్తే సీనియారిటీ కోల్పోయి పదోన్నతి అవకాశాలు దూరమవుతాయని ఉద్యోగులు కలత చెందారు. కలాసీలు, ట్రాక్‌మెన్‌లు, టెక్నీషియన్లుగా ఉద్యోగాల్లో చేరి ఏళ్ల తరబడి ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారు పెద్దసంఖ్యలోనే ఉన్నారు. వారిలో వందలాది కలాసీలతోపాటు మూడేళ్లకు పైగా సర్వీస్ చేసిన సుమారు 300 మంది గ్యాంగ్‌మెన్‌లు జేఈ పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. డివిజన్ విడిపోతే టెక్నీషియన్లు డివిజనల్ సీనియారిటీ, గ్రూప్–డి ఉద్యోగులు యూనిట్ సీనియారిటీ కోల్పోయే ప్రమాదముందని ఉన్నతాధికారులకు విన్నవించుకున్నారు.
విభజించినా విశాఖలోనే...
ఉద్యోగుల ఆందోళనలకు తెరదించుతూ దక్షిణ కోస్తా జోన్ డీపీఆర్‌లో కొన్ని మార్గదర్శకాలు పొందుపరిచారు. వాల్తేరు డివిజన్‌లో ఉన్న ప్రతి ఉద్యోగి జోన్ పరిధిలోనే కొనసాగేలా చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం వాల్తేర్ డివిజన్‌లో 17,985 మంది ఉద్యోగులుండగా వీరిలో 930 మంది డీఆర్‌ఎం కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. జోన్ ప్రధాన కార్యాలయానికి 1250 మంది ఉద్యోగులు అవసరం. అంటే.. డీఆర్‌ఎం కార్యాలయంలో ప్రస్తుతం ఉన్న వారికి అదనంగా 320 మంది అవసరం. డీఆర్‌ఎం కార్యాలయ పరిధిలో పనిచేసే ఉద్యోగులు మినహా.. మిగిలిన వారంతా.. తమ స్థానాల్లోనే కొనసాగుతారు. 930 మందికే ఆప్షన్లతో కూడిన స్థానచలనం ఉంటుంది. మొత్తం ఉద్యోగుల్లో వీరి సంఖ్య 10 శాతానికి మించదు.
మూడు ఆప్షన్లు.. పైగా ఏడాది వ్యవధిలోనే....
డీఆర్‌ఎం కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులను మాత్రం కొత్త జోన్‌తో పాటు రాయగడ, విజయవాడ డివిజన్లలో సర్దుబాటు చేయనున్నారు. వీరికి మూడు ఆప్షన్లు ఇస్తారు. జోన్ కేంద్రం.. రాయగడ డివిజన్.. విజయవాడ డివిజన్.. ఈ మూడింటిలో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఇస్తారు. ఉద్యోగుల అభిప్రాయానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయనున్నారు. ఇక్కడి నుంచి బయటకు వెళ్లినా ఉద్యోగులు కొత్త జోన్ పరిధిలోకే వస్తారు. ఫలితంగా వారి సీనియారిటీలో మార్పులేకుండా ప్రమోషన్లు పొందేలా విధివిధానాలు రూపొందించారు. కొత్తగా ఏర్పడనున్న రాయగడ డివిజన్‌కు వెళ్లిన వారికి అదనపు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. కొత్త డివిజన్‌లో ఏడాది కాలం పని చేశాక.. ఎక్కడికి కావాలంటే అక్కడికి బదిలీ కోరే సౌకర్యం కల్పించనున్నారు. కాగా ఏ చిన్న పనికైనా విజయవాడ డివిజన్ కేంద్రానికి వెళ్లాల్సి వస్తుందన్న ఆందోళనకు కూడా పరిష్కారం సూచిస్తున్నారు. ఈ తరహా ఇబ్బందులను పరిహరించేందుకు వీలుగా ప్రత్యేక యాప్, వెబ్‌సైట్ రూపొందించనున్నారు. మొత్తంగా.. వాల్తేరు డివిజన్ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా డీపీఆర్‌ని రూపొందించినట్లు రైల్వే ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment