సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. దాంతో సీమాంధ్రతోపాటు హైదరాబాద్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లనున్నాయి. అయితే ఇప్పటికే అధికారులు నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనధికార కోతలు విధిస్తున్నారు. కాగా విజయవాడ సమీపంలోని వీటీపీఎస్లో ఉద్యోగుల సమ్మె నేడు 3వ రోజుకు చేరుకుంది. దాంతో 1500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. శ్రీశైలం ప్రాజెక్ట్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది, ఆ ప్రాజెక్ట్లో 770 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
విద్యుత్ ఉద్యోగుల సమ్మె రైల్వే శాఖను తాకింది. దాంతో సికింద్రాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, రేణిగుంట మార్గంలోని అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం హైదరాబాద్లో విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో పలురైళ్లు ఆగిపోవడం లేదా రద్దు చేసే అవకాశం ఉందని వాల్తేర్ డివిజన్ అధికారులు వెల్లడించారు. ఉద్యోగుల సమ్మెతో ప్రకాశం జిల్లా పూర్తిగా అంధకారమయం అయింది. దాంతో జిల్లాలో పలురైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు.