విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో సమైక్య ఉద్యమం తారాస్థాయికి చేరింది. ఆయిల్ కార్పొరేషన్ ఉద్యోగులు, కార్మికులు సోమవారం మెరుపుసమ్మెకు దిగడంతో పెట్రోలు, డీజిల్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ రెండిటి ప్రభావంతో ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. సమ్మె ఎఫెక్ట్ రైతులు, సాధారణ ప్రజలు, వ్యాపారులనే కాదు...ఆస్పత్రులనూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరెంట్ కోతలతో ఆస్పత్రుల్లో ఎక్స్‌రే నుంచి సిజేరియన్ దాకా అన్నిటికీ వైద్యులు ఫుల్‌స్టాప్ పెట్టారు.జనరేటర్‌లు ఉన్నా డీజిల్ సమస్యతో అవి నడవని పరిస్థితి. గత్యంతరం లేక రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. కరెంటులేకపోవడంతో సాగునీరు అందక వరి రైతులూ అల్లాడుతున్నారు.
కడప, సాక్షి:
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా విద్యుత్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ఆదివారం కరెంటు కష్టాలతో ఇబ్బంది పడిన జిల్లా వాసులకు సోమవారం అదే పరిస్థితి తలెత్తింది. ఆర్టీపీపీలో ఉద్యోగుల సమ్మెతో వరుసగా మూడోరోజు పూర్తిస్థాయిలో 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతోజెన్‌కోకు రోజుకు రూ. 5 కోట్ల నష్టం వాటిల్లుతోంది. కరెంటు షాక్ ఆస్పత్రులకూ తాకింది. అత్యవసర ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితులకూ కరెంటు అడ్డుతగలడం...ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆపరేషన్ చేయించుకునేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో రోగులు తీవ్ర వేదన పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 72 పీహెచ్‌సీ(ప్రెమరీ హెల్త్ సెంటర్)లు ఉన్నాయి. 448 సబ్‌సెంటర్లు ఉన్నాయి. 24 గంటలూ పనిచేసే ఆస్పత్రులు 34 ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కదానిలో జనరేటర్ లేదు. కొన్నిటిలో ఇన్వర్టర్లు ఉన్నా వాటితో అధికారులకు మినహా వైద్యానికి ఉపయోగం లేని స్థితి. కొన్ని ఆస్పత్రులలో మాత్రం ఇన్వర్టర్ల సాయంతో ఫ్రిజ్‌లలో ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్‌లు నిల్వ చేస్తున్నారు. పీహెచ్‌సీలలో కుటుంబనియంత్రణ ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపేశారు.
ఏరియా ఆస్పత్రుల్లో నరకమే:
రిమ్స్‌లో కరెంటు సమస్య లేకున్నా వైద్యులు, సిబ్బంది సమ్మెలో ఉండటంతో ఓపీ సేవలు నిలిచిపోయాయి. రోజూ ఓపీకి వచ్చే 1000-1500 మంది రోగులు ఇక్కట్లు పడుతున్నారు. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రితో పాటు పులివెందుల, రాయచోటి, రాజంపేట, లక్కిరెడ్డిపల్లిలోని ఏరియా ఆస్పత్రులు, జమ్మలమడుగులోని కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌పై కరెంటు ప్రభావం పడింది. ఇక్కడ ఉదయం 9 నుంచి12.30 గంటల వరకూ ఓపీ ఉంటుంది. సోమవారం ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకూ కరెంటు లేదు. దీంతో ఎక్స్‌రే మిషనరీ, రక్తపరీక్షలు చేసే ల్యాబ్‌లు, ఆపరేషన్ థియేటర్లు పూర్తిగా మూతపడ్డాయి. రోగుల వద్ద నుంచి రక్తం తీసుకుని, ఫలితం కోసం మరుసటి రోజు రావాలని చెబుతున్నారు. దీంతో రోగులు ప్రైవేటు క్లినిక్‌లను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులలో కరెంటు కోతతో పనిలేకుండా 24 గంటలూ కరెంటు ఉండేలా జనరేటర్లు అమర్చుకున్నారు.
జనరేటర్లు ఉన్నా...ఫలితం సున్నా:
లక్కిరెడ్డిపల్లి మినహా తక్కిన ఐదు ఏరియా ఆస్పత్రులలో జనరేటర్లు ఉన్నాయి. ఆస్పత్రికి సరిపడా కరెంట్ కావాలంటే గంటకు 10-12 లీటర్ల డీజిల్ అవసరం. ఈ లెక్కన 6 గంటలు కరెంట్ ఉండాలంటే 60-70 లీటర్ల డీజిల్ కావాలి. ప్రభుత్వం మాత్రం మూన్నెళ్లకు 2-3 వేల రూపాయలు మాత్రమే డీజిల్‌కు కేటాయింపులు చేస్తోంది. దీంతో పూర్తిస్థాయిలో జనరేటర్లు నడపలేని పరిస్థితి. గైనకాలజీ లాంటి అత్యవసర చికిత్సలకు మినహా మిగిలిన చికిత్సలను నిలిపేశారు. జిల్లాలో అన్ని ఏరియా ఆస్పత్రులలో రోజుకు సగటున 40 ఆపరేషన్లు చేసేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 5-10లోపు మాత్రమే ఉంది. విద్యుత్‌కోత దెబ్బకు బ్లడ్‌బ్యాంకులకు ఆటంకం ఏర్పడుతోంది. ఇన్వర్టర్లు ఉన్నా, అవి పూర్తిస్థాయిగా ‘బ్యాంకు’ను పరిరక్షించడం లేదు. దీంతో రక్తం చెడిపోతోంది.
అన్ని రంగాలకూ తీరని నష్టం:
కరెంటు ప్రభావం జిల్లాలోని అన్ని రకాల రిటైల్‌వ్యాపారులపై పడింది. దసరా సీజన్ కావడంతో వ్యాపారులు బాగా ఉంటాయని ఆశించివారికి కరెంటుకోత దెబ్బతీసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని వ్యాపారాలకు రోజుకు 30 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని అంచనా! అలాగే కరెంటుపై ఆధారపడి జీవించే మెకానిక్‌లు ఇబ్బంది పడుతున్నారు. వరుసగా రెండోరోజూ పట్టణాలతో పాటు పల్లెవాసులు తాగునీటి సమస్యతో అల్లాడిపోయారు. చాలాచోట్ల మినరల్‌వాటర్‌ను ఒక్కో క్యాన్ కు 35 రూపాయలు చెల్లించి కొనుగోలు చేశారు. రెండురోజులుగా కోతలతో సాగునీరు లేక వరిసాగు చేసిన రైతులు వేదన చెందుతున్నారు.
పెట్రోలు, డీజిల్.. నోస్టాక్
భారత్ పెట్రోలియం లిమిటెడ్, హిందుస్తాన్ పెట్రోలియం, ఇండియల్ ఆయిల్ కార్పొరేషన్ డిపోలు కడపలో ఉన్నాయి. వీటి నుంచి రోజుకు 36 లక్షల లీటర్ల పెట్రోలు, డీజిల్ అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్‌జిల్లాలకు, అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు సరఫరా అవుతోంది. డిపో డీలర్లతో పాటు ట్యాంకర్లకు లోడింగ్ చేసే కార్మికులు సోమవారం మెరుపుసమ్మెకు దిగారు. దీంతో ఆయిల్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దాదాపు అన్ని పెట్రోలు బంకుల్లో నోస్టాక్ బోర్డు పెట్టారు. పెట్రోలు లేకపోవడంతో ద్విచక్రవాహనదారులు ఇబ్బందులు పడ్డారు. డీజిల్ లేకపోవడంతో ఆటోలు, జీపులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు మరింత ఇబ్బంది పడ్డారు.
విద్యుత్ కోతతో విలవిల
Published Tue, Oct 8 2013 3:47 AM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM
Advertisement
Advertisement