సీమాంధ్ర ఎంపీలు మోసం చేస్తున్నారు: అశోక్ బాబు
సీమాంధ్ర ఎంపీలు ప్రజలను మోసం చేస్తున్నారని, దీనిపై ప్రజల్లో ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. అసెంబ్లీ తీర్మానం వస్తే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ వ్యవస్థలలో వైఫల్యం వల్లే తాము రోడ్డు మీదకు వచ్చామని తెలిపారు. సమ్మె విరమించినంత మాత్రాన సమైక్యాంధ్ర పోరాటం ఆగిపోదన్నారు. పోరాటంలో సమ్మె ఒక భాగం మాత్రమేనని తెలిపారు.
రాష్ట్ర విభజన సమస్య సమస్య రాజకీమైంది కాబట్టే రాజకీయంగా మాట్లాడుతున్నాం తప్ప, తాము రాజకీయ వేత్తలం కాదని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ప్రస్తుతం గాడిదపని గుర్రం, గుర్రం పని గాడిద చేయాల్సి వస్తోందని తెలిపారు. విజయనగరంలో జరిగిన లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదేనని ఆయన అన్నారు.
రాజీనామాలు చేయకుండా పదవులు పట్టుకుని వేలాడుతున్న మంత్రులకు భవిష్యత్తు అన్నది లేకుండా చేస్తామని అశోక్బాబు హెచ్చరించారు. విభజన విషయంలో రాజకీయ నాయకులు అనుసరిస్తున్న వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లి, మళ్లీ ఎన్నికల్లో వాళ్లకు ఎవరూ ఓట్లు వేయకుండా చూస్తామని చెప్పారు. పార్టీల కంటే, ఉద్యమంలో ముందుంటున్న వ్యక్తులకే ప్రాధాన్యం ఇవ్వాలనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన వివరించారు.