అందరినీ కలుపుకుపోతాం : అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఇదివరకు పోరాడినట్లే ఇక ముందూ ఉద్యమిస్తామని, ఉద్యమంలో అందరినీ కలుపుకుపోతామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు. సోమవారమిక్కడ జరిగిన ఏపీఎన్జీవో కార్యవర్గ తొలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్య రాష్ట్రం కోసం బలిదానం చేసుకున్న 22 మంది ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షలకు తగ్గకుండా సాయం చేయాలని కార్యవర్గం తీర్మానించిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో ఉద్యోగి నుంచి వారి అనుమతిపై రూ.100ను విరాళంగా సేకరించనున్నట్లు వెల్లడించారు.
ఎపీఎన్జీవో ఎన్నికల్లో ఓడిపోయినవారితో పాటు అందరినీ ఉద్యమంలో కలుపుకుపోతామన్నారు. సమైక్య ఉద్యమంలో భాగంగా రెండో విడత అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు మరోసారి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా, పదవీ విరమణ దగ్గర్లో ఉన్నప్పటికీ లెక్కచేయకుండా సమ్మెలో పాల్గొన్న ఏపీఎన్జీవో విశాఖ జిల్లా కార్యదర్శి తురగా గోపాలకృష్ణను ఎపీఎన్జీవో భవన్లో ఘనంగా సన్మానించారు.