పాతాళపుటంచుకు చేరిన ‘గంగ’
- పలు నగరాల్లో నీటి కటకట
- బీడ్ జిల్లాలో 10 రోజులుగా జరగని నీటి సరఫరా
పింప్రి: రాష్ట్రంలో ఇటీవల వడగండ్ల వానలు కురిసినప్పటికీ నీటి సమస్య మాత్రం తీరలేదు. గ్రామాల్లో నీటి నిల్వలు అంతకంతకు తగ్గుతూనే ఉన్నాయి. మరఠ్వాడాలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. రాబోయే రెండు నెలలకు నీటి నిల్వలను వినియోగించుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల్ కు సూచించింది.
గత కొన్నేళ్లుగా రాష్ట్రం కరవు పరిస్థితిని ఎదుర్కొంటుంది. దీంతో ఏటా నీటి సమస్య వెక్కిరిస్తోంది. గతేడాది ఏప్రిల్లో మరఠ్వాడాలోని పలు రిజర్వాయర్లలో 2,184 మిలియన్ ఘన మీటర్ల నీటి నిల్వ ఉండగా, ప్రస్తుతం 826 మిలియన్ ఘన మీటర్లు మాత్రమే ఉంది. బీడ్ జిల్లాలో తాగు నీటి సమస్య తాండవిస్తోంది. గత 10 రోజులుగా నీటి సరఫరా జరగలేదంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. ఇక్కడ 300 మిలియన్ ఘన మీటర్ల నీటి సరఫరా జరుగుతోంది. పుణే, నాసిక్ విభాగంలోనూ ఇదే పరిస్థితి.