water samples
-
హైదరాబాద్‌లో విషతుల్యంగా నల్లానీరు!
హైదరాబాద్: భాగ్యనగరంలో ‘జలం’ విషతుల్యంగా మారింది. నల్లా నీరు తాగడానికి సురక్షితం లేనట్లుగా ‘నీటి నమూనా పరీక్షల’ ఫలితాల నివేదికలు వెల్లడిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నగరానికి మంచినీటిని సరఫరా చేసేందుకు వందల కిలో మీటర్ల దూరంలోని గోదావరి, కృష్ణా, మంజీరా, సింగూరు నదుల నుంచి జలాల తరలింపు, నీటి శుద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా.. సంబంధిత ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం నగరవాసుల పాలిట ప్రాణసంకటంగా తయారైంది. కనీసం నల్లా ద్వారా సరఫరా జరుగుతున్న నీరు తాగేందుకు సంతృప్తికరం కాదని వెల్లడవుతున్న నీటి శాంపిల్స్ పరీక్షల నివేదికలను సైతం ఎక్కడికక్కడే తొక్కిపెట్టి గోప్యత ప్రదర్శించడం మరింత విస్మయానికి గురిస్తోంది. నీటి నాణ్యత అంశంలో ప్రజల నుంచి ఫిర్యాదుతో పాటు ఒత్తిడి వస్తే తప్ప అధికారులు స్పందించని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రస్తుతం నల్లా ద్వారా సరఫరా జరుగుతున్న నీటిని వేడి చేసి చల్లార్చి వడపోస్తే తప్ప తాగే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు. నల్లా నీటిని నేరుగా తాగితే జ్వరం, దగ్గు, వాంతులు, విరేచనాలు ఇతరత్రా వ్యాధుల బారిన పడుతున్నట్లు నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలమండలి మాత్రం ప్రజలకు శుద్ధమైన నీరు అందించేందుకు ఐఎస్ఓ నిబంధనల ప్రకారం శాసీ్త్రయంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకున్నట్లు ప్రగల్భాలు పలుకుతున్నా... క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్లు థర్ట్ పార్టీ నిర్వహించిన నీటి నమూనా పరీక్షలు వెల్లడించడం ఆందోళనకు గురిచేస్తోంది. నాలుగు విభాగాలుగా.. ఇంటింటికీ సరఫరా చేస్తున్న నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు నిత్యం నాలుగు విభాగాలుగా నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జలమండలి యంత్రాంగం పేర్కొంటోంది. జలమండలి, క్యూఏటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, స్వయం సహాయక బృందాల సభ్యుల ద్వారా వేర్వేరుగా నీటి శాంపిళ్లను సేకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సరఫరా అయ్యే నీటిలో క్లోరిన్న్ శాతం 0,5 పీపీఎం కంటే తక్కువగా ఉన్నా, కలుషితంగా ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించినా తక్షణమే నీటి సరఫరా నిలిపివేసి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుంది. కానీ.. ఎక్కడా ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. ఇటీవల జలమండలి యంత్రాంగం సరికొత్త సంస్కరణలో భాగంగా వినియోగదారుల సమక్షంలో ఇంటి వద్దనే నీటి పరీక్షలు నిర్వహించే విధంగా లైన్మెన్ల ఫోన్లలో ‘నాణ్యత’ పేరుతో ప్రత్యేక యాప్ ఇన్స్టాల్ చేసి అందుబాటులోకి తెచ్చినా.. లైన్‌మన్ ఇంటికి వచ్చి పరీక్షలు నిర్వహించిన దాఖలాలు మాత్రం లేవని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం కేవలం నాణ్యత యాప్ ద్వారానే ప్రతి రోజు సుమారు 15వేల శాంపిళ్లు సేకరించి పరీక్షిస్తున్నట్లు పేర్కొంటున్నారే తప్ప.. వాటి పరీక్షల నివేదికలు బహిర్గతం చేసేందుకు వెనుకాడటం మాత్రం అనుమానాలకు తావిస్తోంది. ఇదిగో నాణ్యతలేమి.. నల్లా ద్వారా సరఫరా అవుతున్న తాగునీటిలో నాణ్యతలేమి ఆందోళ కలిగిస్తోంది. సరఫరా చేస్తున్న నీటిలో తగిన మోతాదులో క్లోరిన్ శాతం ఉండేలా చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల తీరును థర్ట్‌పార్టీ నిర్వహించిన నీటి శాంపిల్ పరీక్ష ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్ధ అయిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, జలమండలి క్యూఏటీ విభాగాలు సంయుక్తంగా నగర వ్యాప్తంగా సరఫరా అవుతున్న నల్లా నీటిలో ర్యాండమ్‌గా శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు. నమూనా పరీక్షల్లో అసంతృప్తిగా వచ్చిన ఫలితాల నివేదికలను ఎప్పటికప్పుడు జలమండలి సంబంధిత ల్యాబ్‌కు సిఫారస్ చేస్తోంది. గత నెల (జులై)లో సేకరించిన నల్లా నీటి నమూనా పరీక్ష ఫలితాల నివేదిక ‘సాక్షి’ చేతికి చిక్కింది. వాటిని పరిశీస్తే.. నల్లా నీటిలో నాణ్యత ప్రమాణాల స్థితి బెంబేలెత్తిస్తోంది. ► మొత్తమ్మీద సుమారు 38 ప్రాంతాల్లో సరఫరా జరిగిన నీరు తాగడానికి ఆమోదయోగ్యం కానట్టు నీటి నమూనా పరీక్షల నివేదికలో వెల్లడైంది. అమీర్‌పేట్, అంబర్‌పేట, ఎల్లారెడ్డిగూడ, యూసుఫ్ గూడ, ఇమామ్‌గూడ, రెడ్‌హిల్స్, బన్సీలాల్‌పేట, బోయగూడ, సంతోష్‌నగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన నీటి సరఫరాలో కోర్లిన్ శాతం అసలు లేనట్లు పరీక్షలో తేలింది. ► మిగతా ప్రాంతాలు ఘాన్సీబజార్, ఆసిఫ్‌నగర్, రేతిబౌలి, షేక్‌పేట, లంగర్‌హౌస్, ఉస్మాన్‌గంజ్, చార్మినార్, వెంగళ్రావు నగర్, హుస్సేనీ ఆలం, ఖిల్వాత్, ఖైరతాబాద్, ముషీరాబాద్, రామ్‌నగర్, చంచలగూడ, కవాడిగూడ, సైదాబాద్, మలక్‌పేట, ఈదీబజార్, వనస్థిలిపురం తదితర ప్రాంతాల్లో జరిగిన నీటి సరఫరాలో కోర్లిన్్ శాతం 0. 5 నుంచి 1.0 పీపీఎం వరకు ఉన్నప్పటికీ.. నీరు కలుషితం, ఇతరత్రా కారణంగా తాగడానికి యోగ్యం కాదని వెల్లడైంది. గడిచిన ఆరు నెలల నివేదికలు సైతం పరిశీలిస్తే ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు బయటపడింది. అంతా గోప్యంగానే.. నల్లా ద్వారా సరఫరా చేసే నీటిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నట్లు జాతీయ స్థాయి సంస్ధల నుంచి అవార్డులపై అవార్డులు అందుకుంటున్న జలమండలి యంత్రాంగం నీటి శాంపిల్ పరీక్షల నివేదికలపై మాత్రం అత్యంత గోప్యత ప్రదర్శించడం విస్మయానికి గురిచేస్తోంది. నగరవాసులకు సురక్షిత జలాలు అందించేందుకు నిత్యం సరఫరా జరిగే నీటి నాణ్యత పరిశీలన కోసం నాలుగు వేర్వేరు విభాగాల బృందాలతో నీటి శాంపిల్స్ సేకరిస్తున్నట్లు ప్రకటిస్తున్నా.. వాటి పరీక్షల నివేదికలు మాత్రం బహిర్గతం కాకుండా సంస్థ ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి వరకు జాగ్రత్త పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. సాక్షాత్తూ సంబంధిత విభాగం డైరెక్టర్ అధికారికంగా నీటి నాణ్యత పరీక్షల నివేదికలు ఇచ్చేందుకు నిరాకరించడం విస్మయానికి గురిచేస్తోంది. ఇక నీటి నమూనాలు పరీక్ష కేంద్రం అధికారి నివేదికలు ఇచ్చేందుకు తాను ఆథరైజ్ కాదని, ఉన్నతాధికారికి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొనడం మరింత అనుమానాలకు తావిస్తోంది. -
కరీంనగర్లో వింతవ్యాధి కలకలం..! ఉన్నట్టుండి వాంతులు విరేచనాలు, ఆపై
విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. వింత రోగంతో తొలుత కొడుకు, ఆ తర్వాత బిడ్డ ఇటీవల భార్య ఒక్కొక్కరుగా కన్నుమూశారు. వాంతులు, విరేచనాలతో తల్లిడిల్లి కానరాకుండా పోయారు. ఆ మరణాలకు కారణాలేమై ఉంటాయో ఇప్పటికీ తెలియకపోవడం మరో విషాదం. తాజాగా ఆ కుటుంబ యజమాని వేముల శ్రీకాంత్ తనవాళ్లలాగే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కరీంగనగర్ జిల్లా మండల కేంద్రమైన గంగాధరలో భయాందోళనలు రేపుతున్న ఘటన వివరాలిలా ఉన్నాయి... వేముల శ్రీకాంత్ కుటుంబం కొన్నేళ్ల నుంచి వాగు ఒడ్డున నివసిస్తోంది. ఆయనకు భార్య మమత, కూతురు అమూల్య (4), అద్వైత్ (2) ఉన్నారు. ఆయన స్థానికంగా ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబ ప్రయాణంలో తీరని విషాదం నవంబర్ 16న చోటుచేసుకుంది. శ్రీకాంత్ తనయుడు అద్వైత్ వాంతులు, విరేచనాలతో అవస్థ పడగా, ఆస్పత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కగానొక్క కుమారుడి మరణంతో ఆ తల్లిదండ్రులు విలవిల్లాడిపోయారు. అయ్యో అమూల్య! తనయుడి మరణం నుంచి కోలుకోకుండానే శ్రీకాంత్ కూతురు అమూల్య కూడా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ డిసెంబర్ 4న కన్నుమూసింది. నెల వ్యవధిలోనే కంటికి రెప్పలా కాపాడుకున్న కొడుకు, కూతురు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనకు అంతులేకుండా పోయింది. మరోవైపు తమ బిడ్డల్ని బలితీసుకున్న ఆ వింతరోగమేంటో తెలియని పరిస్థితి! బిడ్డల కర్మకాండలు పూర్తి చేసుకున్న శ్రీకాంత్, మమత దంపతులు ఇటీవల ధర్మపురిలో గంగ స్నానం ఆచరించి ఇంటికివెళ్లారు. అయితే, ఉన్నట్టుండి మమత అస్వస్థతకు గురైంది. చిన్నారుల ప్రాణాలు తీసిన వింతవ్యాధి ఆమెను కూడా ఉక్కిరిబిక్కిరిచేసింది. ప్రమాదాన్ని గ్రహించిన శ్రీకాంత్ క్షణం ఆలస్యం చేయకుండా భార్యను హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ మమత ఆదివారం తుదిశ్వాస విడిచింది. ఒక్కొక్కరుగా తనవారు దూరమవడంతో శ్రీకాంత్‌కు ఏడుపే మిగిలింది. అయితే, తమ కుటుంబాన్ని పట్టిపీడిస్తున్న ఆ వింతవ్యాధి ఏంటో తెలియడం లేదని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈక్రమంలోనే శ్రీకాంత్ కూడా అదే తరహాలో వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యాడు. అతని రక్త నమూనాలు, వారు వినియోగిస్తున్న నీటి నమూనాలు సేకరించి పరీక్షల కోసం ముంబై పంపించామని వైద్య అధికారులు చెప్తున్నారు. అయితే, జిల్లా వైద్య అధికారులు ఆలస్యంగా స్పందించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
మరో ప్రాణం పోయింది!
ఈ గ్రామ దయనీయ పరిస్థితిని వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ ⇒ కిడ్నీ వ్యాధులతో సంభవిస్తున్న మరణాలపై కథనాలు ⇒ అయినా పట్టించుకోని అధికార యంత్రాంగం ⇒ ఇప్పుడు బాలుడి మృతితో కదలిక ⇒ బుధవారం గువ్వలగుట్టను సందర్శించనున్న అధికారులు ⇒ కిడ్నీ బాధితులపై ఆరా.. నీటి శాంపిళ్లను పరీక్షించాలని నిర్ణయం చందంపేట (దేవరకొండ): కన్న తల్లి దండ్రుల వేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది.. వారి కళ్ల ముందే కొడుకు ప్రాణం గాలిలో కలసిపోయింది.. ఎంత మొరపెట్టుకున్నా.. పత్రికల్లో కథనాలు వచ్చినా.. స్పందించని ప్రభుత్వ యంత్రాంగానికి ఆ చిన్నారి ప్రాణం బలైపోయింది.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్టకు చెందిన మేరావత్ లక్ష్మణ్ (12) మంగళవారం కన్నుమూశాడు. గువ్వలగుట్టలో జనం కిడ్నీ వ్యాధుల కారణంగా వరుసగా మృతి చెందుతున్న వైనంపై, చావు బతుకుల్లో ఉన్న లక్ష్మణ్ పరిస్థితిపై ‘జనం పరిస్థితి అధ్వానం.. ఇది మన ఉద్ధానం’పేరిట పక్షం రోజుల కింద ‘సాక్షి’మాన వీయ కథనాన్ని ప్రచురించింది. అక్కడి జనం పడుతున్న బాధలను వివ రించింది. కానీ అధికార యంత్రాంగంలో స్పందన కనిపించలేదు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న లక్ష్మణ్ మంగళవారం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న వైద్యారోగ్య శాఖ బృందం బుధవారం గువ్వలగుట్టను సందర్శించాలని నిర్ణయించింది. ఎన్నిసార్లు గోడు వెళ్లబోసుకున్నా..గువ్వలగుట్ట రోగాల పుట్టగా మారి పోతోంది. కిడ్నీ వ్యాధులు మెల్లమెల్లగా ఆ గ్రామాన్నే కబళించేస్తున్నాయి. ఇక్కడి నీటిలోని రసాయనాల కారణంగా ఈ దుస్థితి తలెత్తిందని ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. కానీ ఫలితం కనిపించలేదు. ఈ గ్రామం దుస్థితిపై ‘సాక్షి’ఎన్నో కథనాలను ప్రచు రించింది. ఆరు నెలల క్రితం ‘గువ్వలగుట్ట.. రోగాల పుట్ట’అన్న శీర్షికన గువ్వలగుట్టలో కిడ్నీ వ్యాధి మరణాలు, బాధితుల దీన స్థితిపై కథనాన్ని ప్రచురించింది. కిడ్నీ వ్యాధుల బారినపడి జనం పిట్టల్లా రాలిపోతున్న వైనాన్ని వివరించింది. వ్యాధులతో బాధపడుతూ, లక్షలకు లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించుకున్నా ఫలితం లేనివారి ఆందోళనను తెలిపింది. వారితోపాటు లక్ష్మణ్ పరిస్థితిని, తల్లి దండ్రుల ఆవేదనను కూడా వివరించింది. అయినా అధికార యంత్రాంగంలో స్పందన కానరాలేదు. సురక్షిత నీరు అందేదెన్నడు? గువ్వలగుట్టకు అతి సమీపంలోనే ఉన్న కృష్ణా బ్యాక్‌వాటర్ నుంచి మంచినీటిని ఈ గ్రామానికి అందించేందుకు చేపట్టిన పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. ట్యాంకులు నిర్మించి, పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసే పను లను మొదలుపెట్టి.. అర్ధంతరంగా వదిలే శారు. దాదాపు ఏడాదిగా కదలిక లేదు. నేడు గువ్వలగుట్టకు వైద్యారోగ్య శాఖ బృందం నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని గువ్వలగుట్టను బుధవారం వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధి బృందం సందర్శించనుంది. కిడ్నీ వ్యాధులతో ఇక్కడి జనం అవస్థలపై కథనాలు, మంగళవారం లక్ష్మణ్ అనే బాలుడి మృతి నేపథ్యంలో.. అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. వైద్యారోగ్య శాఖ బృందం బుధవారం గువ్వలగుట్టకు చేరుకుని కిడ్నీ వ్యాధుల బాధితులతో మాట్లాడతారు. వారి సమస్యలు తెలుసుకుని.. ఇక్కడి బోరుబావులు, నీటి పంపులను పరిశీలిస్తారు. నీటి శాంపిళ్లను సేకరించి ప్రయోగశాలకు పంపుతారు. చీఫ్ వాటర్ అనలిస్ట్ డాక్టర్ ఆంజనేయులు, సీనియర్ అనాలసిస్ట్ డాక్టర్ కిరణ్మయి ఈ బృందంలో ఉంటారు. -
గ్రామంలో అదుపులోకి వచ్చిన అతిసారం
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం నాగరాజపేటలో అతిసారం వ్యాధి అదుపులోకి వచ్చింది. వారం రోజుల వ్యవధిలో సుమారు 60 మంది అతిసారం బారిన పడి అస్వస్థతకు గురికాగా, ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. మంగళవారం కూడా నలుగురు అతిసారం బారినపడినట్టు సమాచారం. గ్రామంలోని నీటి నమూనాలను ప్రయోగశాలకు పంపారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో కృపావరం పర్యవేక్షణలో డాక్టర్ అరుణారావు వైద్య సేవలు అందిస్తున్నారు.