హైదరాబాద్‌లో విషతుల్యంగా నల్లానీరు! | Drinking Water Triggers Panic In Hyderabad - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో విషతుల్యంగా నల్లానీరు!.. ఆ 38 ప్రాంతాలు ఇవే..

Published Wed, Aug 30 2023 6:10 AM | Last Updated on Wed, Aug 30 2023 8:37 AM

- - Sakshi

హైదరాబాద్: భాగ్యనగరంలో ‘జలం’ విషతుల్యంగా మారింది. నల్లా నీరు తాగడానికి సురక్షితం లేనట్లుగా ‘నీటి నమూనా పరీక్షల’ ఫలితాల నివేదికలు వెల్లడిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నగరానికి మంచినీటిని సరఫరా చేసేందుకు వందల కిలో మీటర్ల దూరంలోని గోదావరి, కృష్ణా, మంజీరా, సింగూరు నదుల నుంచి జలాల తరలింపు, నీటి శుద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా.. సంబంధిత ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం నగరవాసుల పాలిట ప్రాణసంకటంగా తయారైంది.

కనీసం నల్లా ద్వారా సరఫరా జరుగుతున్న నీరు తాగేందుకు సంతృప్తికరం కాదని వెల్లడవుతున్న నీటి శాంపిల్స్‌ పరీక్షల నివేదికలను సైతం ఎక్కడికక్కడే తొక్కిపెట్టి గోప్యత ప్రదర్శించడం మరింత విస్మయానికి గురిస్తోంది. నీటి నాణ్యత అంశంలో ప్రజల నుంచి ఫిర్యాదుతో పాటు ఒత్తిడి వస్తే తప్ప అధికారులు స్పందించని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రస్తుతం నల్లా ద్వారా సరఫరా జరుగుతున్న నీటిని వేడి చేసి చల్లార్చి వడపోస్తే తప్ప తాగే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు.

నల్లా నీటిని నేరుగా తాగితే జ్వరం, దగ్గు, వాంతులు, విరేచనాలు ఇతరత్రా వ్యాధుల బారిన పడుతున్నట్లు నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలమండలి మాత్రం ప్రజలకు శుద్ధమైన నీరు అందించేందుకు ఐఎస్‌ఓ నిబంధనల ప్రకారం శాసీ్త్రయంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకున్నట్లు ప్రగల్భాలు పలుకుతున్నా... క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్లు థర్ట్‌ పార్టీ నిర్వహించిన నీటి నమూనా పరీక్షలు వెల్లడించడం ఆందోళనకు గురిచేస్తోంది.

నాలుగు విభాగాలుగా..
ఇంటింటికీ సరఫరా చేస్తున్న నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు నిత్యం నాలుగు విభాగాలుగా నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జలమండలి యంత్రాంగం పేర్కొంటోంది. జలమండలి, క్యూఏటీ, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌, స్వయం సహాయక బృందాల సభ్యుల ద్వారా వేర్వేరుగా నీటి శాంపిళ్లను సేకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సరఫరా అయ్యే నీటిలో క్లోరిన్‌న్‌ శాతం 0,5 పీపీఎం కంటే తక్కువగా ఉన్నా, కలుషితంగా ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించినా తక్షణమే నీటి సరఫరా నిలిపివేసి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుంది.

కానీ.. ఎక్కడా ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. ఇటీవల జలమండలి యంత్రాంగం సరికొత్త సంస్కరణలో భాగంగా వినియోగదారుల సమక్షంలో ఇంటి వద్దనే నీటి పరీక్షలు నిర్వహించే విధంగా లైన్‌మెన్ల ఫోన్లలో ‘నాణ్యత’ పేరుతో ప్రత్యేక యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి అందుబాటులోకి తెచ్చినా.. లైన్‌మన్‌ ఇంటికి వచ్చి పరీక్షలు నిర్వహించిన దాఖలాలు మాత్రం లేవని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం కేవలం నాణ్యత యాప్‌ ద్వారానే ప్రతి రోజు సుమారు 15వేల శాంపిళ్లు సేకరించి పరీక్షిస్తున్నట్లు పేర్కొంటున్నారే తప్ప.. వాటి పరీక్షల నివేదికలు బహిర్గతం చేసేందుకు వెనుకాడటం మాత్రం అనుమానాలకు తావిస్తోంది.

ఇదిగో నాణ్యతలేమి..
నల్లా ద్వారా సరఫరా అవుతున్న తాగునీటిలో నాణ్యతలేమి ఆందోళ కలిగిస్తోంది. సరఫరా చేస్తున్న నీటిలో తగిన మోతాదులో క్లోరిన్‌ శాతం ఉండేలా చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల తీరును థర్ట్‌పార్టీ నిర్వహించిన నీటి శాంపిల్‌ పరీక్ష ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్ధ అయిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌, జలమండలి క్యూఏటీ విభాగాలు సంయుక్తంగా నగర వ్యాప్తంగా సరఫరా అవుతున్న నల్లా నీటిలో ర్యాండమ్‌గా శాంపిల్స్‌ సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు. నమూనా పరీక్షల్లో అసంతృప్తిగా వచ్చిన ఫలితాల నివేదికలను ఎప్పటికప్పుడు జలమండలి సంబంధిత ల్యాబ్‌కు సిఫారస్‌ చేస్తోంది. గత నెల (జులై)లో సేకరించిన నల్లా నీటి నమూనా పరీక్ష ఫలితాల నివేదిక ‘సాక్షి’ చేతికి చిక్కింది. వాటిని పరిశీస్తే.. నల్లా నీటిలో నాణ్యత ప్రమాణాల స్థితి బెంబేలెత్తిస్తోంది.

మొత్తమ్మీద సుమారు 38 ప్రాంతాల్లో సరఫరా జరిగిన నీరు తాగడానికి ఆమోదయోగ్యం కానట్టు నీటి నమూనా పరీక్షల నివేదికలో వెల్లడైంది. అమీర్‌పేట్‌, అంబర్‌పేట, ఎల్లారెడ్డిగూడ, యూసుఫ్‌ గూడ, ఇమామ్‌గూడ, రెడ్‌హిల్స్‌, బన్సీలాల్‌పేట, బోయగూడ, సంతోష్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో జరిగిన నీటి సరఫరాలో కోర్లిన్‌ శాతం అసలు లేనట్లు పరీక్షలో తేలింది.

మిగతా ప్రాంతాలు ఘాన్సీబజార్‌, ఆసిఫ్‌నగర్‌, రేతిబౌలి, షేక్‌పేట, లంగర్‌హౌస్‌, ఉస్మాన్‌గంజ్‌, చార్మినార్‌, వెంగళ్‌రావు నగర్‌, హుస్సేనీ ఆలం, ఖిల్వాత్‌, ఖైరతాబాద్‌, ముషీరాబాద్‌, రామ్‌నగర్‌, చంచలగూడ, కవాడిగూడ, సైదాబాద్‌, మలక్‌పేట, ఈదీబజార్‌, వనస్థిలిపురం తదితర ప్రాంతాల్లో జరిగిన నీటి సరఫరాలో కోర్లిన్‌్‌ శాతం 0. 5 నుంచి 1.0 పీపీఎం వరకు ఉన్నప్పటికీ.. నీరు కలుషితం, ఇతరత్రా కారణంగా తాగడానికి యోగ్యం కాదని వెల్లడైంది. గడిచిన ఆరు నెలల నివేదికలు సైతం పరిశీలిస్తే ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు బయటపడింది.

అంతా గోప్యంగానే..
నల్లా ద్వారా సరఫరా చేసే నీటిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నట్లు జాతీయ స్థాయి సంస్ధల నుంచి అవార్డులపై అవార్డులు అందుకుంటున్న జలమండలి యంత్రాంగం నీటి శాంపిల్‌ పరీక్షల నివేదికలపై మాత్రం అత్యంత గోప్యత ప్రదర్శించడం విస్మయానికి గురిచేస్తోంది. నగరవాసులకు సురక్షిత జలాలు అందించేందుకు నిత్యం సరఫరా జరిగే నీటి నాణ్యత పరిశీలన కోసం నాలుగు వేర్వేరు విభాగాల బృందాలతో నీటి శాంపిల్స్‌ సేకరిస్తున్నట్లు ప్రకటిస్తున్నా.. వాటి పరీక్షల నివేదికలు మాత్రం బహిర్గతం కాకుండా సంస్థ ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి వరకు జాగ్రత్త పడటం పలు అనుమానాలకు తావిస్తోంది.

సాక్షాత్తూ సంబంధిత విభాగం డైరెక్టర్‌ అధికారికంగా నీటి నాణ్యత పరీక్షల నివేదికలు ఇచ్చేందుకు నిరాకరించడం విస్మయానికి గురిచేస్తోంది. ఇక నీటి నమూనాలు పరీక్ష కేంద్రం అధికారి నివేదికలు ఇచ్చేందుకు తాను ఆథరైజ్‌ కాదని, ఉన్నతాధికారికి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొనడం మరింత అనుమానాలకు తావిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement