‘ఉపాధి’కి వీక్లీ ప్లాన్!
= డ్వామా అధికారుల ప్రత్యేక ప్రణాళిక
= రోజూ 2 లక్షల మందికి ఉపాధి పనులు
= మండలాల వారీగా లక్ష్యాలు
= సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్‌లైన్
= నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు
అనంతపురం టౌన్ : కరువు కోరల్లో చిక్కుకున్న ‘అనంత’లో వలసల నివారణ కోసం ‘ఉపాధి’ పనులు వేగవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో లక్ష్య సాధన కోసం అధికారులు ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగా ‘వీక్లీ ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టారు. ఇన్నాళ్లూ నెలవారీ లక్ష్యాలతో ముందుకు సాగిన జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు మరో నాలుగు వారాల్లో ప్రగతి సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు.
రోజుకు 2 లక్షల మందికి ఉపాధికల్పన
జిల్లాలో 47,826 శ్రమ శక్తి సంఘాలుండగా 7,86,159 మందికి జాబ్‌కార్డులున్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.461 కోట్లను ఖర్చు చేశారు. కోటి 50 లక్షల పనిదినాలు లక్ష్యం కాగా, ఇప్పటికే కోటి 65 లక్షల పనిదినాలు పూర్తి చేశారు. కరువు మండలాలు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాకు అదనంగా కోటి పనిదినాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత మేరకు అదనపు లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులు భావిస్తున్నారు. నెల రోజుల క్రితం వరకు రోజూ వేలల్లో కూలీలు పనులకు వచ్చే వారు. అయితే ఇప్పుడు లక్షన్నర మంది పనుల్లో పాల్గొంటున్నారు. దీన్ని మరింత పెంచేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ నెల రోజులూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రోజూ 2 లక్షల మందికి పని కల్పించాలి్సందేని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మండలాల వారీగా ‘వీక్లీ’ టార్గెట్లు :
జిల్లా వ్యాప్తంగా అధికారులకు మండలాల వారీగా ‘వీక్లీ’ లక్ష్యాలను నిర్దేశించారు. ప్రతి మండలంలో 125 ఫారంపాండ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు 100, వర్మీకం పోస్ట్‌లు 100 పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు పంపారు. రోజూ పంచాయతీకి కనీసం 300 మంది కూలీలను పనులకు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఏరోజుకారోజు ప్రగతి వివరాలు సేకరిస్తూ నిర్లక్ష్యం గా ఉన్న అధికారులకు నోటీసులు చేస్తున్నట్లు డ్వామా అధికారులు చెబుతున్నారు. అవసరమైతే విధుల్లోంచి తొలగించడానికి కూడా వెనుకాడమని స్పష్టం చేస్తున్నారు.
‘ఉపాధి’ కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్
ఉపాధి పనులకు సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. డ్వామా కార్యాలయంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇది పని చేస్తుంది. హెల్ప్ లైన్ నంబర్ : 18004258554. ఎక్కడైనా ఫీల్డ్ అసిస్టెంట్లు పని కల్పించని పక్షంలో ఈ నంబర్‌కు కాల్ చేయవచ్చు.
వలస వెళ్లినట్లు తెలిస్తే చర్యలు
జిల్లాలో ఉపాధి పనులను ఉద్యమంలా చేపడతాం. అధికారులు, సిబ్బంది కలిసికట్టుగా పని చేసి వలసలు వెళ్లకుండా చూడాలి. ఎవరైనా ఉపాధి పనులు కల్పించలేదని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే వలస వెళ్లిన వారి ఫోన్ నంబర్లు మా వద్ద ఉన్నాయి. అలాంటి వారిందరికీ ఫోన్లు చేసి పిలిపించాలని ఆదేశించాం. వలసల నివారణే ధ్యేయంగా పని చేయాలి. పనులు చేసే చోట అన్ని సదుపాయాలు ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది చర్యలు తీసుకోవాలి. కూలీల చెల్లింపులో సమస్యలుంటే నా దృష్టికి తీసుకురావచ్చు. హెల్ప్‌లైన్ కు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
– నాగభూషణం, డ్వామా పీడీ