జుంబాహే... హెల్దీ రే!!
వెల్నెస్ ఎక్స్పో ప్రత్యేకం
వ్యాయామాన్ని ఇంగ్లిష్‌లో వర్కవుట్ అంటారు. ‘వర్క్’ అంటే ఎంతో కొంత శ్రమ చేయడమే కదా. కానీ వర్కవుట్ నుంచి వర్క్ తీసేయగలిగితే...! వ్యాయామం అసలు శ్రమే అనిపించకపోతే, పైగా అది స్ఫూర్తి రగిలించీ, కాలు కదిపించీ, మేలు కలిగించేలా ఉంటే?... ఇక అంతకంటే కావాల్సిందేముంది. అందుకే రూపొందిందీ ‘జుంబా’ అనే డాన్స్ ప్రక్రియ. ఇరు రాష్ట్రాల వాళ్లకూ సంపూర్ణమైన ఆరోగ్యంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘ఓవర్ ఆల్ వెల్బీయింగ్ ఎక్స్-పో’ అనే అద్భుత ప్రదర్శనను ఏర్పాటు చేయనుంది ‘సాక్షి దినపత్రిక’. ఈ సందర్భంగా జుంబా డాన్స్ ప్రక్రియను అందరితోనూ చేయిస్తూ ఆరోగ్యాన్ని పంచుతున్న ైెహ దరాబాద్‌లోనే జుంబా సర్టిఫైడ్ ట్రైనర్లలో ఒకరైన విజయతో మాట్లాడుదాం. జుంబా గురించి తెలుసుకుందాం రండి. జుంబారే అంటూ ఆరోగ్యాన్ని హాయిగా హ్యాపీగా పొందుదాం పదండి.
ప్ర: జుంబా అనే డాన్స్ ప్రక్రియ చాలా కొద్దిమందికే బాగా తెలుసు. దీని గురించి వివరించండి.
విజయ: జుంబా అనేది ఒక డాన్స్ ప్రక్రియ. 1990లలో కొలంబియన్ డాన్సర్, కొరియోగ్రాఫర్ ‘ఆల్బర్టో బీటో పెరేజ్’ దీన్ని రూపొందించారు. ఇందులో డాన్స్‌తో పాటు ఎరోబిక్స్ కూడా కలిసి ఉంటాయి. అంతేకాదు... ఈ డాన్స్ ప్రక్రియల్లో మరెన్నో ఇతర డాన్స్‌లూ సమ్మిళితమై ఉంటాయి. ఉదాహరణకు అనేక డాన్స్ ప్రక్రియలైన హిప్-హాప్, సోకా, సాంబా, సాల్సా, మెరెంగ్యూ, మాంబో... ఇలా చాలా రకాల నృత్యాలన్నీ కలిసి ‘జుంబా’ రూపొందింది.
ప్ర: జుంబా ప్రత్యేకతలేమిటి?
విజయ: మన ఆరోగ్యానికి వ్యాయామం చేయడం ఎంత అవసరమో, స్థూలకాయం లేకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలియనిది కాదు. అయితే వ్యాయామం చేయడాన్ని చాలామంది ఒక కష్టమైన పనిగా భావిస్తారు. ఒకటి రెండు రోజులు చేసినా, ఆ తర్వాత దాన్ని ఎలా ఎగ్గొట్టాలా అని ఆలోచిస్తుంటారు. కానీ ‘వర్కవుట్’ నుంచి ‘వర్క్’ను తీసేయగలిగామనుకోండి. అసలు వ్యాయామం అంటే శ్రమ లేనిదిగా చేయగలిగామనుకోండి. పైగా అందులో కాస్త వినోదం, నలుగురితో కలిసి చేయాలనే ఉత్సాహాన్ని కూడా కలిపామనుకోండి. మీరే ఊహించండి... ఆ ప్రక్రియను అనుసరించడానికి అందరూ ఎంతగా ఇష్టపడతారో! అందుకే జుంబాను అనుసరిస్తే అటు మేనికీ, మనసుకూ హాయిగా అనిపిస్తుంది, ఇటు వ్యాయామమూ చేకూరుతుంది. మనకు తెలియకుండానే వ్యాయామం సమకూరుతుంది కాబట్టి ఆరోగ్యమూ దక్కుతుంది. ఇలా రోగ్యం దక్కడానికి కారణం... ఇందులో గుండెకు సంబంధించిన వ్యాయామాలు (కార్డియో) ఉంటాయి. కండరాల సమన్వయపూరిత కదలికలుంటాయి. మిమ్మల్ని మీరు సాగదీసుకునేలా తేలికపాటి కదలికలుంటాయి. దాంతో మీరు ఫ్లెక్సిబుల్‌గా మారతారు. ఒకసారి క్లాస్‌లో డాన్స్ చేసి, సెషన్ ముగిశాక దివ్యానుభూతి ఉంటుంది.
ప్ర: డాన్స్ ఫామ్స్ చాలానే ఉన్నాయి కదా. వాటికీ ‘జుంబా’కు తేడా ఏమిటి?
విజయ: డాన్స్ చేయడం అంటే కొందరికి కాస్త బిడియంగా లేదా ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ ఇది నలుగురితో కలిసి కాలు కదుపుతూ చేసే ఒక ఆరోగ్య ప్రక్రియ అనుకుంటే ఆ ఇబ్బంది తొలగిపోతుంది. డాన్స్‌ను ఇష్టపడేవారికి ఇంతకు మించిన ప్రక్రియ మరోటి ఉండదు. వర్కవుట్ చేయడానికి బిడియపడేవారికి ఇది వరప్రదాయని.
ప్ర: డాన్స్ చేయాలంటే కాస్త శిక్షణ, కాస్త ప్రాక్టీస్ అవసరమేమో కదా!
విజయ: అది మామూలు డాన్స్ ప్రక్రియలకు. కానీ జుంబాకు శిక్షణ, ప్రాక్టీస్ అవసరం లేదు. ముఖ్యంగా బిగినర్స్‌కు (వర్కవుట్లు తొలిసారి ప్రారంభించేవారికి) ఇదెంతో ఉపయోగం. ఎందుకంటే ఇందులో ఒక పాటకు మూడు లేదా నాలుగు తేలికపాటి కదలికలు ఉంటాయి. అవీ చాలా సులభం. జుంబా ట్రైనర్ మాటలేమీ మాట్లాడకుండా కేవలం సైగలూ, చప్పట్లూ, సూచనలతో ఏ స్టెప్ నుంచి మరే స్టెప్‌కు మారాలో సూచిస్తుంటారు. దాన్ని బట్టి ఫాలో అయిపోతుంటే చాలు. ఇంకా చెప్పాలంటే ఇందులో బోర్ కొట్టడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఏ క్లాస్‌కు ఆ క్లాసే ప్రత్యేకం. ఒకదాంట్లో అనుసరించిన స్టెప్స్ మరోదాంట్లో రిపీట్ కావు. కాబట్టి మొనాటనీకి అవకాశమే ఉండదు. బోర్ కొట్టడానికి వీలు లేదు.
ప్ర : ఆరోగ్యానికి ఇదెలా తోడ్పడుతుంది?
విజయ: ఆరోగ్యం కోసం చేసే వర్కవుట్ నుంచి మనం శ్రమను తొలగిస్తాం అనడం కంటే... శ్రమను తెలియకుండానే చేసేలా చేస్తాం అనడం సబబు. ఇందులోనూ కాస్త తీవ్రత తక్కువ కదలికలూ, ఈ సెషన్‌ను పూర్తి చేసుకున్నవారికీ లేదా మరింత చురుకైన వారికోసం మరింత తీవ్రమైన కదలికలూ ఉన్న డాన్స్ ప్రక్రియలు ఉంటాయి. ఈ తేలికపాటి, తీవ్రమైన శారీరక కదలికలు ఒక నిర్దిష్ట క్రమపద్ధతిలో అనుసరిస్తూ ఈ డాన్స్ ఉత్సాహభరితంగా సాగుతుంటుంది. ఈ రిథమ్‌తో మనలో మరింత ఉత్తేజం కలుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది డాన్స్ రూపంలో ఉన్న వ్యాయామం. మరి వ్యాయామం అంటే ‘అబ్బా... అంత శ్రమ ఎవరు పడతారు చెప్పండి’ అనుకునే వారికి ఇంతకంటే తేలికగా వ్యాయామం చేసే పద్ధతి లేదనే చెప్పాలి.
ప్ర : జుంబా ట్రైనర్‌గా మీ గురించి చెప్పండి.
విజయ: నేను ఒక సర్టిఫైడ్ జుంబా ట్రైనర్‌గా 17 ఫిబ్రవరి 2012లో హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించా. నాకు తెలిసి మొదటి సర్టిఫైడ్ ట్రైనర్లలో నేనూ ఒకరిని. ‘జుంబా’ డాన్స్ రూపంలో శ్రమ తెలియకుండానే డాన్స్ పేరిట ఏరోబిక్స్ చేయిస్తూ గుండెజబ్బుల నుంచి దూరంగా ఉంచడం, స్థూలకాయం రాకుండా చూడటం, అదనపు క్యాలరీలను తేలికగా తెలియకుండానే బర్న్ చేసేస్తుండటంతో నన్ను అనుసరిస్తున్నవారి సంఖ్య క్రమేపీ పెరిగింది. ఇవ్వాళ్ల దాదాపు 300 మంది తమ ఆరోగ్యం కోసం నా అడుగులో అడుగు కలుపుతున్నారు.
ప్ర: జుంబా డాన్సర్‌గా మీ ఫిలాసఫీ...
విజయ: డాన్సర్‌గానే కాదు... ఒక వ్యక్తిగానూ నేనెప్పుడూ నమ్మేది ఒక్కటే. మీరు దాన్ని నా నినాదం అని కూడా అనుకోవచ్చు. అదే... ‘‘జీవించు, ప్రేమించు, స్ఫూర్తిని రగిలించు’’. ఇదే నా సందేశం.
ప్ర: సాక్షి నిర్వహించే వెల్నెస్ ఎక్స్పో పై మీ అభిప్రాయం...
విజయ: జుంబా లక్ష్యం ఏమిటో మీకు తెలిసింది కదా. వ్యాయామంతో శరీరానికి, వినోదాత్మకత కలగలసిన డాన్స్‌తో మానసిక ఆనందం, ఈ రెండూ కలగలసి ఆత్మానందం... ఇవన్నీ సమకూరినట్లే... అనేక ఆరోగ్య ప్రక్రియలపై సాధారణ ప్రజలకు అవగాహన కలిగేలా భారీగా జరిగే ‘సాక్షి వెల్నెస్ ఎక్స్పో’ విజయవంతం కావాలన్నది నా ఆకాంక్ష.
సాక్షి వెల్నెస్ ఎక్స్పో గురించి మరింత సమాచారం కోసం సంప్రదించాల్సిన నంబర్
96662 84600