ఆలయాల్లో వెలగని ‘దీపం’
మోర్తాడ్ : భక్తుల కోరికలను మన్నించే దేవుడు ప్రభుత్వ కటాక్షం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధూప, దీప నైవేద్యాలకు ప్రభుత్వం నిధులను ఇవ్వకపోవడంతో ఆలయాల నిర్వహణ ఇబ్బందికరంగా మారిందని అర్చకులు వాపోతున్నారు. ధూప, దీప నైవేద్యాలతో పాటు అర్చకులకు గౌరవ వేతనంగా ప్రభుత్వం ప్రతి నెల రూ.2,500 చొప్పున నిధులను మంజూరు చేస్తుంది.
అయితే ఆరు నెల లుగా ప్రభుత్వం నిధులను కేటాయిం చక పోవడంతో ధూప దీప నైవేద్యాలకు భక్తులపై ఆధారపడాల్సి వస్తోందని పలువురు అర్చకులు పేర్కొన్నారు. 2007లో ధూపదీప నైవేద్యాల పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దీంతో జిల్లాలో 189 ఆలయాలను పథకం కింద దేవాదాయ ధర్మదాయ శాఖ ఎంపిక చేసింది.
ఇటీవలే మరి కొన్ని కొత్త ఆలయాలను దేవాదాయ శాఖ చేర్చింది. ఆలయ అర్చకుని వేతనం కోసం రూ. 1500, నూనె, అగర్బత్తీలు, ప్రసాద సామాగ్రి ఇతర సరుకుల కోసం వెయ్యి రూపాయలు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పథకం ఆరంభం కాక ముందు గ్రామాభివృద్ధి కమిటీలు, ఆలయ కమిటీలు ఆలయాల నిర్వహణకు నిధులను కేటాయించేవి. పథకం ప్రారంభం అయిన నుంచి గ్రామాభివృద్ధి కమిటీలుగాని, ఆలయ కమిటీలు గాని నిధులను ఇవ్వడం లేదు.
అర్చకులకు వేతనం సరిపోక పోయినా పౌరోహిత్యంపై వచ్చే ఆదాయంతో సరిపెట్టుకుంటున్నారు. ఆరు నెలల నుంచి ప్రభుత్వం నిధులను మంజూరు చేయడం లేదు. ఆలయాల్లో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో దీపారాధన చేయా ల్సి ఉంటుంది. దీపారాధనకు నూనె ఎక్కువగానే వినియోగం అవుతుంది. దేవునికి పూజలు నిర్వహించిన అనంతరం ప్రసాదాలను నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచి పెట్టాలి. మార్కెట్లో నిత్యావసర ధరలు పెరగడంతో ప్రసాదానికి వినియోగించే సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి.
ఆలయాల నిర్వహణకు ప్రభుత్వం తక్కువగానే నిధు లు ఇస్తున్నా సకాలంలో నిధులు మం జూరు చేస్తేనే నిర్వహణ సాధ్యం అవుతుందని అర్చకులు చెబుతున్నారు. శ్రావణ మాసం, కార్తీక మాసాల్లోనూ, దసరా ఉత్సవాల సందర్భంగా ఆల యాల్లో ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి సందర్బాల్లో నిధులు ఎక్కువగా అవసరం అవుతాయి. అయితే ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖకు నిధులను కేటాయించక పోవడంతో ధూప, దీప నైవేద్యాలకు నిధుల కేటాయింపు సాధ్యపడలేదు. జిల్లాకు దాదాపు రూ. 35 లక్షల వరకు నిధులు మంజూరు కావాల్సి ఉంది.