యువ తేజం... యూత్ ఫర్ పీపుల్!
ఆదర్శం
సంకల్పబలం గట్టిదైతే ‘సాధన’ సులువవుతుంది. అది శ్రమ కావచ్చు. సామాజిక సేవ కావచ్చు. ఆపదల్లో ఉన్నవారికి, ప్రమాదంలో ఉన్నవారికి తనవంతుగా ఏదైనా చేయాలను కున్నప్పుడు దీపేష్‌కు దారి మొదట మసక మసకగా కనిపించింది. ‘ఏం చేయాలి? ఏలా చేయాలి?’ అనేది స్పష్టంగా బోధపడలేదు. సంకల్పబలం గట్టిదైనప్పుడు ఎదురుచూసే దారి వెలుగుతూ కనిపిస్తుంది. ఆ వెలుగులో వికసించిందే ‘యూత్ ఫర్ పీపుల్’ స్వచ్ఛంద సంస్థ. 2006లో ముంబై లోకల్ ట్రైన్లో బాంబు బ్లాస్ట్ జరిగింది.
ఆ దృశ్యాలను టీవిలో చూస్తున్నప్పుడు దీపేష్ మనసు కదిలిపోయింది. బాధితులకు తన వంతు సహాయం అందించడానికి తమ్ముడు పరేష్‌తో కలిసి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. తమకు తోచిన రీతిలో బాధితులకు సహాయపడడానికి భాగవతి, కూపర్, నానావతి... మూడు ఆస్పత్రులకు వెళ్లారు అన్నదమ్ములు. అయితే అక్కడి గందరగోళ వాతావరణంలో సహాయం మాట అలా ఉంచి అడుగు పెట్టడమే కష్టంగా మారింది. అయినప్పటికీ గాయపడిన వాళ్లను, శవాలను మోసుకెళ్లడంలాంటి పనుల్లో సహాయపడ్డారు.
ప్రభుత్వ ఏజెన్సీలకు తోడ్పడుతూ బాధితులకు సహాయపడడానికి ఒక శాశ్వత వేదికలాంటిది అవసరం అనే ఆలోచన ఆ సమయంలోనే దీపేష్‌కు వచ్చింది.
ఆ ఆలోచనల్లో నుంచి పుట్టిందే... ‘యూత్ ఫర్ పీపుల్’ (వైఎఫ్‌పి) స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ గురించి దీపేష్ మాటల్లో చెప్పాలంటే... నిర్మాణాత్మకమైన సేవాదృక్పథంతో వైఎఫ్‌పి మొదలైంది. విషాద సంఘటనలు జరిగినప్పుడు తక్షణ సహాయసహకారాలు అందించడానికి యువకులతో ఏర్పాటయిన బృందం... ‘యూత్ ఫర్ పీపుల్’ వైఎఫ్‌పి తరపున పనిచేస్తున్న యువకులు రకరకాల ఉద్యోగాలు చేస్తున్నవారే. తీరిక చేసుకునో, సెలవురోజుల్లోనో, సెలవు పెట్టో వైఎఫ్‌పి తరపున పని చేస్తున్నారు. 500 మంది సభ్యుల ఈ బృందం రకరకాల సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది.
ప్రమాదాలు జరిగినప్పుడు ఆన్-ది-స్పాట్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌ను నిర్వహిస్తుంది వైఎఫ్‌పి. ‘చైల్డ్ లిటరసీ క్యాంపెయిన్’ నిర్వహిస్తుంది. చలికాలంలో ‘మీ వంతుగా ఒక దుప్పటి దానం చేయండి’ అనే నినాదంతో ప్రచారం చేసి అలా వచ్చిన దుప్పట్లను పేదలకు ఇస్తుంది. ‘ది బాంబే రాక్ అసోసియేషన్’ సంస్థతో కలిసి క్యాన్సర్ పేషెంట్లకు సంఘీభావంగా ‘బ్లడ్ డొనేషన్ డ్రైవ్’ నిర్వహిస్తుంది.
‘సమస్య మనదైనప్పుడు, దాని పరిష్కారం గురించి కూడా మనమే ఆలోచించాలి’ అని చెబుతాడు దీపేష్.
లోకల్ ట్రైన్లలో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికులకు రౌడీలతో ఇబ్బందిగా మారింది. దీంతో ‘వార్ అగేనెస్ట్ రైల్వే రౌడీస్’ నినాదంతో మహిళా భద్రతపై దృష్టి సారించాడు దీపేష్.
ఒకరోజు మలడ్ రైల్వే స్టేషన్ దగ్గర కొందరు ఆకతాయిలు అమ్మాయిలను అల్లరి చేయడం చూసి పోలీసులకు మెయిల్ పెట్టాడు దీపేష్. అయితే దీని వల్ల పెద్ద ప్రయోజనం కనిపించలేదు.
దీంతో ఆకతాయిలకు బుద్ది చెప్పడానికి, వారిని కట్టడి చేయడానికి ‘వార్ అగేనెస్ట్ రైల్వే రౌడీస్’ ఆలోచనను ఆచరణలో పెట్టాడు దీపేష్. దీపేష్ బృందం రైల్వేస్టేషన్ దగ్గరికి వెళ్లి మహిళలతో మాట్లాడి అక్కడి పరిస్థితి అంచనా వేసి దానికి అనుగుణంగా ఒక కార్యాచరణ సిద్ధం చేస్తుంటుంది. రైల్వే స్టేషన్ల దగ్గర, ట్రైన్లలో మహిళలను అల్లరి చేస్తున్న వారిని మందలించడమో, పోలీసులకు అప్పగించడమో చేస్తారు. ‘వార్ అగేనెస్ట్ రైల్వే రౌడీస్’ కార్యక్రమం విజయవంతం అయింది. పోకిరీల బెడదా తప్పింది. రక్తదానం నుంచి మహిళల రక్షణ వరకు ఎన్నో రకాల పనులు చేస్తూ యువశక్తి గొప్పదనాన్ని గర్వంగా చాటుతుంది యూత్ ఫర్ పీపుల్ సంస్థ.