7 నెలల సెలవులతో పాటు జీతం
న్యూఢిల్లీ : గర్భిణీ ఉద్యోగులకు ఆఫీసులకు రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. చాలామంది మహిళలు ఈ సమయంలోనే ఉద్యోగం మానేస్తుంటారు కూడా. మరి కొంతమంది జీవనాధారం కోసం ఎంతకష్టమైనా ఆఫీసులకు వస్తుంటారు. ఇలాంటి ఇబ్బందులకు గర్భిణీ మహిళలు స్వస్తి చెప్పేందుకు, టాటా సన్స్ మహిళల కోసం సరికొత్త పాలసీలను ప్రవేశపెట్టింది. ప్రసూతి సెలవుల కింద ఏడు నెలలను మంజూరు చేస్తూ, ఆ నెలల్లో కూడా పూర్తి జీతం ఇవ్వాలని నిర్ణయించింది.
అంతేకాక ప్రసవం అనంతరం వారికి మద్దతుగా సగం జీతం-సగం పనిదినం అనే పాలసీని తీసుకొచ్చింది. ప్రసవించిన అనంతరం 18 నెలలు పాటు వారే పని సమయాన్ని నిర్ణయించుకుని, ఉద్యోగం చేసేలా అవకాశం కల్పించనుంది. ఒకవేళ టాటా సన్స్ కంపెనీలో ఐదు సంవత్సరాల ఉద్యోగం పూర్తిచేసుకున్న వారికి అదనంగా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ పాలసీని ప్రవేశపెట్టింది. కేర్ టేకర్ గా బాధ్యత కలిగిన వారికి సగం జీతంతో ఏడాది పాటు సెలవులు మంజూరు చేసేలా ఈ పాలసీని ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం టాటా సన్స్ కలిగి ఉన్న సాల్డ్ నుంచి సాప్ట్ వేర్ సర్వీసులకు వరకూ ఈ పాలసీలు వర్తించనున్నాయి. టాటా గ్రూప్ కు చెందిన మిగిలిన కంపెనీలు భవిష్యత్ లో ఈ పాలసీలను కల్పించనున్నాయి. భారత్ లో మహిళల పని జీవితానికి సంబంధించి టాటా సన్స్ తీసుకున్న ఈ పాలసీలే కొత్త ప్రమాణాలు. ఇప్పటివరకూ భారత్ లో చాలా కంపెనీలు మూడు నెలలు లేదా ఆరు నెలలు సెలవులు ఇస్తుంటాయి. కానీ మహిళలకు వివిధ స్టేజ్ ల్లో సెలవులు, అనుమైన పనిసమయాన్నికల్పిస్తూ ప్రవేశపెట్టిన సంపూర్ణ విధానం ఇదేనని కంపెనీ తెలిపింది.
'మహిళల విషయంలో మా సంస్థ అంకితభావంతో పనిచేస్తూ..వారిని జాగ్రత్తగా చూసుకోవడంలో కృషిచేస్తుంది. మెటర్నిటీ అనేది చాలా క్లిష్టమైన సమయం. వారికి ఆ సమయంలో పూర్తి జీతంతో 7 నెలల ప్రసూతి సెలవులు, 18 నెలలు పోస్ట్ మెటర్నిటీ కింద సగం జీతం-సగం పని, మహిళలు వారికి అనువైన సమయంలోనే ఉద్యోగం చేసేలా అవకాశం ఇవ్వడం, మా బాధ్యతగా గుర్తించాం' అని టాటా సన్స్ చీఫ్ హ్యుమన్ రిసోర్స్ ఆఫీసర్ ఎన్ఎస్. రాజన్ తెలిపారు.
చిన్న పిల్లల్ని చూసుకునేటప్పుడు వారంలో రెండు రోజులు ఇంటి దగ్గరే పనిచేసుకునేలా, అనువైన పనిదినాలను వారు ఎంపికచేసుకునేలా పాలసీలను ప్రవేశపెట్టామన్నారు. 48శాతం మహిళలు ఈ సమయంలోనే ఉద్యోగం మానేస్తుంటారని అవతార్ కెరీర్ క్రీయేటర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు సౌందర్య రాజేష్ తెలిపారు. టాటా గ్రూప్ లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు లక్షా 45 వేల మంది ఉన్నారు. మొత్తం ఉద్యోగుల్లో వీరు 24 శాతం మంది. 2020 కల్లా రెండు లక్షల 30 వేల మంది మహిళలను ఉద్యోగులుగా చేర్చుకుంటామని టాటా గ్రూప్ 2014లో ప్రకటించింది. 2014 లో కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు లక్షా 15వేల మంది