స్కూటర్‌పై వెళుతున్న యువతిని వెంబడించి..!
గురుగ్రామ్: చండీగఢ్‌లో సాక్షాత్తు బీజేపీ అధ్యక్షుడి కొడుకే ఓ యువతిని వెంటాడి వేధించిన ఘటనను మరువకముందే.. గురుగ్రామ్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. సోమవారం రాత్రి స్కూటర్‌పై ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతున్న 25 ఏళ్ల యువతిని ఇద్దరు వ్యక్తులు కారులో వెంబడించారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితురాలు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో గురుగ్రామ్ సెక్టర్-18లోని ఆఫీస్ నుంచి ఆమె స్కూటర్‌పై ఇంటికి బయలుదేరారు. ఇద్దరు వ్యక్తులు కారులో ఆమెను దాదాపు మూడుకిలోమీటర్ల వరకు వెంబడించి వేధించారు. స్కూటర్ ఆపాలంటూ పదేపదే అరవడమే కాకుండా.. ఆమెను కారుతో కార్నర్ చేసి కిందపడేయాలని చూశారు. ఓల్డ్ ఢిల్లీ-గురుగ్రామ్ రోడ్డు సమీపంలోని అతుల్ కటారియా చౌక్ వరకు ఈ దుర్మార్గం కొనసాగింది. 'వారు బెదిరింపులను పట్టించుకోకుండా ప్రాణాలు కాపాడుకోవడమే లక్ష్యంగా స్కూటర్‌ను వేగంగా నడిపాను. ఎంతో కష్టం మీద ఇంటికొచ్చాను' అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంలోనూ ఆమెకు చేదు అనుభవమే ఎదురైంది. సెక్టర్-14 పోలీసు స్టేషన్‌కు వెళ్లగా.. జరిగిన ఘటన తమ పరిధిలోకి రాదంటూ.. సెక్టర్-18 పోలీసు స్టేషన్‌కు వెళ్లమంటూ ఆమెను తిప్పిపంపారు. దీంతో మధ్యాహ్నం ఆమె పోలీసు కమిషనర్ ఆఫీస్‌కు నేరుగా వెళ్లి ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 354డీ (స్టాకింగ్) కింద అభియోగాలను మోపిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులను గుర్తించడానికి సీసీటీవీ దృశ్యాలు పోలీసులకు కీలకంగా మారనున్నాయి.