రచయితకైనా.. జర్నలిస్టుకైనా.. సంతృప్తే ముఖ్యం..
వండర్ బుక్ ఆఫ్ రికార్డు, అష్టాదశ సహస్రసభా కేసరి బిరుదు పొందిన ‘తుర్లపాటి’తో ప్రత్యేక ఇంటర్వ్యూ
ఆ గళం సభా సరస్వతికి ఆభరణం.. ఆ కలం రాజకీయ దర్పణం.. సుదీర్ఘమైన పాత్రికేయ వృత్తి, అంతకుమించిన రాజకీయ పరిణితి, అణుబాంబు నుంచి ఆవకాయ దాకా, ప్రాచీన సాహిత్యం నుంచి వర్తమాన కవిత్వంలో వచ్చిన మార్పులను వివరించడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన వ్యాసాలు.. వర్తమాన రాజ కీయాలకు దర్పణాలు. ఆయనే సీనియర్ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు. సుదీర్ఘమైన అనుభవం కలిగిన తుర్లపాటి పద్మశ్రీ బిరుదుతో పాటు అనేక అవార్డులు, రికార్డులు సొంతం చేసుకున్నారు. తాజాగా వండర్ బుక్ ఆఫ్ రికార్డుతోపాటు అష్టాదశ సహస్రసభా కేసరి బిరుదు పొందిన ఆయన ఆ ఆనందాన్ని‘సాక్షి’తో పంచుకున్నారు.
- విజయవాడ కల్చరల్
సాక్షి : మీకు ఉపన్యాస కళ ఎలా అబ్బింది?
తుర్లపాటి : చిన్నతనంలో పామర్రులో చదువుకున్నా. అక్కడ డిబేటింగ్ సొసైటీ ఉండేది. ప్రతివారం సభలు జరిగేవి. అక్కడే నా ఉపన్యాస కళ ప్రారంభమైంది. ఇచ్చిన అంశం కోసం విపరీతంగా చదివేవాడ్ని.
సాక్షి : మీ తొలి ఉపన్యాసం..
తుర్లపాటి : 1947 ఆగస్టు 15వ తేదీన గన్నవరంలో ఇచ్చాను. 2014 ఆగస్టు 15న విజయవాడలో ఇచ్చిన ఉపన్యాసంతో కలిపి ఇప్పటికి 18వేలు పూర్తయ్యూరుు. ఈ సందర్భంగానే తెలుగు బుక్ ఆఫ్ రికార్డుతో పాటు అష్టాదశ సహస్రసభా కేసరి బిరుదు లభించింది.
సాక్షి : మీకు అనేక అవార్డులు వచ్చాయి కదా..అందుకు మీకు నచ్చింది..
తుర్లపాటి : నిస్సందేహంగా భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ. ఈ గౌరవం జర్నలిజంలో నాకు మాత్రమే లభించింది.
సాక్షి : మహాత్మాగాంధీకి నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాలని మీరు కోరారు కదా.. అరుునా ఇవ్వకపోవడం వెనుక ఏదైనా కారణం ఉందా..
తుర్లపాటి : ఈ విషయంపై నోబుల్ శాంతి బహుమతి కమిటీ-స్వీడన్ వారితో నేను మాట్లాడాను. మరణించిన వారికి ఇచ్చే సంప్రదాయం లేదన్నారు. నాకు తెలిసి స్వీడన్ దేశస్తుడైన డాక్ విమాన ప్రమాదంలో మరణించిన తరువాత ఆయనకు ఆ బహుమతి ఇచ్చారు. దీనిపై వారి వద్ద నుంచి ఎటువంటి సమాధానం రాలేదు.
సాక్షి : ‘నా కలం - నా గళం’ అన్న మీ జీవిత చరిత్రలో మీకు సంబంధించిన విషయూల కంటే.. రాజకీయూలే ప్రస్తావించారు. కారణం..
తుర్లపాటి : చాలా సంవత్సరాలుగా జర్నలిస్టుగా ఉన్నా. చాలామంది రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉండేవి. ఆనాటి రాజకీయ చరిత్రను భావితరాలకోసం అలా రాయాల్సి వచ్చింది.
సాక్షి : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి మీరు కార్యదర్శిగా పనిచేశారు కదా, వారితో మీ సంబంధాలు ఎలా ఉండేవి?
తుర్లపాటి : ప్రకాశం గారు అందరినీ ఏకవచనంతో సంబోధించేవారు. నన్ను మాత్రమే ‘తుర్లపాటి’ అని పిలిచేవారు. విలువలు కలిగిన రాజకీయ నేత ఆయన. జీవితంలో రాజీపడకపోవటం ఆయన నైజం.
సాక్షి : అప్పటికీ, ఇప్పటికీ రాజకీయాల్లో తేడా ఏంటీ?
తుర్లపాటి : అప్పటివి రాజకీయూలు.. ఇప్పటివి అరాజకీయూలు..
సాక్షి : రాష్ట్ర విభజన గురించి మీరేమంటారు?
తుర్లపాటి : విభజన వల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. కొత్త రాష్ట్రంలో అన్నీ కొత్తగా ఏర్పాటుచేసుకోవాల్సి వచ్చింది.
సాక్షి : రచయితగా, కాలమిస్టుగా మీ జీవితం సంతృప్తికరంగా సాగిందా..?
తుర్లపాటి : రచయితకైనా,జర్నలిస్టుకైనా.. సంతృప్తి ముఖ్యం. అది ఉంటే అన్నీ ఉన్నట్టే.
సాక్షి : భావి జర్నలిస్టులకు మీరిచ్చే సలహా ఏమిటీ?
తుర్లపాటి : చదవటం బాగా అలవాటు చేసుకోవాలి. విషయ సేకరణ కోసం అందిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యం కష్టపడి కాదు.. ఇష్టపడి వృత్తిలోకి ప్రవేశించాలి.
స్వర్ణాంధ్ర కష్టమే...
స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం దాదాపు అసాధ్యమే. బంగ్లాదేశ్‌ను పాలించిన ముజబూర్ రెహమాన్ ఆ దేశాన్ని సోనార్ బంగ్లా చేస్తానన్నాడు. ఆయన తరువాత అది మూలనపడింది. చిత్తశుద్ధిలేని పనుల వల్ల ఏ పనీ పూర్తికాదు.