రూ.125 కోట్లతో 63 పనులు
ఆమోదం తెలిపిన ఖమ్మం కార్పొరేషన్ కౌన్సిల్
ఖమ్మం: సుదీర్ఘకాలం తర్వాత ఖమ్మం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మంగళవారం జరిగింది. రూ.125 కోట్ల విలువైన 63 పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. తీర్మానాలకంటే ముందు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పక్షాలకు చెందిన కార్పొరేటర్లు ముందుగా ఖేదం తెలిపినా.. ఆ తర్వాత తీర్మానాలు చదువుతుండగా.. మౌనంగా ఉండటంతో అన్నీ ఆమోదం పొందాయి. ప్రతి డివిజన్‌కు రూ.50లక్షల చొప్పున మొత్తం రూ.26కోట్ల కేటాయింపు; సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.100 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనల్లో గోళ్లపాడు చానల్ ఆధునికీకరణకు రూ.60 కోట్లు, నూతన కూరగాయల మార్కెట్ నిర్మాణానికి రూ.10 కోట్లు, కార్పొరేషన్ కార్యాలయ నిర్మాణానికి రూ.11 కోట్లు, లకారం చెరువు ఆధునికీకరణకు రూ.4కోట్లు, ప్రస్తుత షాదీఖానా మరమ్మతులు.. కొత్త షాదీఖానా నిర్మాణానికి రూ.4కోట్లు, కళానికేతన్ నుంచి సంభానినగర్, గాంధీచౌక్ రోడ్డు, డీఆర్డీఏ రోడ్డు అభివృద్ధికి రూ.11కోట్లు కేటాయిస్తూ తీర్మానాలను ఆమోదించింది. తీర్మానాలను ప్రవేశపెడుతున్నప్పుడు అభ్యంతరం చెప్పి, నిరసన వ్యక్తం చేసి, పోడియం ముందు బైఠాయించిన ప్రతిపక్ష సభ్యులు.. వాటికి ఆమోదం తెలిపేటప్పుడు మాత్రం మౌనంగా ఉన్నారు.
కోఆప్షన్ సభ్యుల ఎన్నిక సమయంలో అందుబాటులో లేని కోఆప్షన్ సభ్యుడు అన్వర్‌పాషా.. ఈ సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశారు. స్టాండింగ్ కమిటీ సభ్యులుగా చావా నారాయణరావు, కుమ్మరి ఇందిర, హనుమాన్, మాటేటి నాగేశ్వరరావు, రజియాబేగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు మేయర్ డాక్టర్ పాపాలాల్ ప్రకటించి, వారిని సభకు పరిచయం చేశారు.
కౌన్సిల్ సమావేశం ప్రారంభమవగానే సీపీఎం కార్పొరేటర్ అఫ్రోజ్‌సమీనా మాట్లాడుతూ.. పారిశుద్ధ్యానికి సంబంధించి గత కౌన్సిల్ నిర్ణయాలను ఇప్పటివరకు అమలు చేయలేదని, కార్మికుల వేతనాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కార్పొరేటర్ బాలగంగాధర్ తిలక్ మాట్లాడుతూ.. ప్రతి రోజు తాగునీరు అందిస్తామన్న హామీ అమలవడం లేదని, రెండు మూడు రోజులకోసారి నీళ్లు వస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సీపీఐ కార్పొరేటర్ బి.జి.క్లెమెంట్ మాట్లాడుతూ.. కార్పొరేషన్‌లోని ఔట్సోర్సింగ్ కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. మరో కార్పొరేటర్ వడ్డెబోయిన నరసింహారావు మాట్లాడుతూ.. ఐదు నెలల తర్వాత ప్రజాసమస్యలు ప్రస్తావించేప్పుడు, తీర్మానాలు చేసేటప్పుడు సభ్యుల అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారిని టీఆర్ఎస్ కార్పొరేటర్లు కమర్తపు మురళి, కర్నాటి కృష్ణ తదితరులు వారించేందుకు ప్రయత్నించారు. తీర్మానాలను ప్రవేశపెట్టాలని మేయర్ డాక్టర్ పాపాలాల్ చెప్పడంతోనే పోడియం వద్ద ప్రతిపక్ష సభ్యులు బైఠాయించారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ జోక్యం చేసుకుని, ‘‘సభను సజావుగా నడిపించేందుకు సహకరించాలి. అందరి సమస్యలను తప్పకుండా వింటారు. తీర్మానాల తర్వాత సమస్యలను చర్చించుకునే అవకాశం ఉంటుంది’’ అని నచ్చచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.