‘ఉపాధి‘లో జిల్లా ఫస్ట్
రికార్డు స్థాయిలో పనుల కల్పన
కూలీలకు 1.91కోట్ల పనిదినాలు
విశాఖపట్నం : ఉపాధి హామీ అమలులో జిల్లా దూసుకెళ్తోంది. పనుల కల్పనలో కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఉపాధి కూలీలకు 1.8 కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుని ఏకంగా కోటి 91 లక్షల 95 వేల 614 పనిదినాలు కల్పించి జిల్లా నీటియాజమాన్య సంస్థ రికార్డు సృష్టించింది. ఉపాధి పనుల కల్పన కోసం రాష్ర్టంలో ఏ జిల్లాలోనూ ఖర్చుచేయని రీతిలో 301 కోట్ల 87లక్షల 79వేలు ఖర్చు చేశామని డ్వామా పీడీ ఆర్.శ్రీరాముల నాయుడు బుధవారం విలేకరులకు తెలిపారు. ఈ స్థాయిలో పనులు కల్పించడం, ఉపాధి పనుల కోసం ఒకే ఏడాదిలో 300 కోట్లకు పైగా ఖర్చు చేయడం ఇదే తొలిసారన్నారు. వీటిలో కూలీలకు వేతనాల రూపంలోనే అత్యధికంగా 231కోట్ల 61లక్షల 39వేలు చెల్లించగా, మెటీరియల్ అండ్ స్కిల్డ్ కోసం 54 కోట్ల 44 లక్షలు, కంటింజెంట్ ఖర్చుల కింద రూ.15.81కోట్లు ఖర్చు చేశామన్నారు.
జిల్లాలో 4,68,141 కుటుంబా లకు జాబ్‌కార్డులు జారీచేయగా, 38,032 శ్రమశక్తి సంఘాల పరిధిలో 6,72,944 మంది కూలీలున్నారని చెప్పారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 30,063 శ్రమశక్తి సంఘాల్లోని 3,02, 551 కుటుంబాల పరిధిలోని 5లక్షల 43వేల 39 మందికి రికార్డుస్థాయిలో ఏకంగా కోటి 91 లక్షల 95వేల 614 పనిదినాలు కల్పించామన్నారు. 2లక్షల 58 వేల 321 మంది పురుషులుకాగా, 2లక్షల 84వేల 718 మంది మహిళా కూలీలు పనులు పొందారన్నారు. వీరిలో 29,186 మంది ఎస్సీలుకాగా, 2 లక్షల 52వేల 715 మంది ఎస్టీలు, లక్షా 66 వేల 127మంది బీసీలు ఉన్నారన్నారు. ఇంకా 14.49కోట్ల విలువైన పనులను 66,617 మంది కూలీలు చేస్తున్నారని తెలిపారు. 50,257 మంది కూలీలకు ఏడాదిలో 100 రోజుల పైబడి పనులు కల్పించామన్నారు. వీరికి అదనంగా మరో 50రోజుల ఉపాధి పొందారన్నారు.