World Championship Wrestling
-
ప్రపంచ రెజ్లింగ్ టోర్నీ: బబితాకు నిరాశ
లాస్ వెగాస్ (అమెరికా) : ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. బబితా కుమారి, వినేశ్ ఫోగత్, నవ్‌జ్యోత్ కౌర్ టోర్నీ నుంచి నిష్ర్కమించారు. 2012లో కాంస్యం సాధించిన బబిత (53 కేజీలు) క్వార్టర్స్ అడ్డంకిని దాటలేకపోయింది. బబిత 2-6తో చైనాకు చెందిన గ్జూచున్ జోంగ్ చేతిలో ఓడింది. యువ రెజ్లర్ వినేశ్ (48 కేజీలు) తొలి రౌండ్లోనే 4-8తో కిమ్ హ్యోన్ గ్యాంగ్ (ఉత్తర కొరియా) చేతిలో పరాజయం పాలైంది. నవ్‌జ్యోత్ (69 కేజీలు) కూడా తొలి రౌండ్లోనే 0-8తో అలినా స్టాడ్నిక్ (ఉక్రెయిన్) చేతిలో ఓటమి పాలైంది. పురుషుల 85 కేజీల గ్రీకో రోమన్ విభాగం క్వార్టర్స్‌లో మనోజ్ కుమార్ 0-10తో రమీ ఆంటెరో (ఫిన్లాండ్) చేతిలో ఓడిపోయాడు. -
ఆసియా క్రీడలకు సుశీల్ దూరం
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ సుశీల్‌కుమార్ వచ్చే నెలలో జరగనున్న ఆసియా క్రీడలతోపాటు ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సుశీల్.. 2016లో రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే లక్ష్యంగా సిద్ధమయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) వెల్లడించింది. ఆసియా క్రీడలకు రెజ్లింగ్ జట్టును బుధవారం ప్రకటించిన డబ్ల్యుఎఫ్ఐ.. సుశీల్ స్థానంలో నర్సింగ్ పంచమ్ యాదవ్‌కు చోటు కల్పించింది. ఏడుగురు సభ్యుల ఫ్రీ స్టయిల్ జట్టుకు యోగేశ్వర్‌దత్ సారథ్యం వహించనున్నాడు. మహిళల జట్టు ఎంపిక కోసం గురువారం లక్నోలో ట్రయల్స్ జరగనున్నాయి.