ఆస్ట్రేలియా నంబర్‌వన్
క్రైస్ట్‌చర్చ్: టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ ను వెనక్కు నెట్టి ఆస్ట్రేలియా నంబర్‌వన్ స్థానాన్ని కైవశం చేసుకుంది. న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో టెస్టుల్లో ఆసీస్ నంబర్‌వన్ గా అవతరించింది. 2014 తర్వాత కంగారూ టీమ్ అగ్రస్థానానికి చేరుకోవడం ఇదే మొదటిసారి.
కివీస్ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని స్మిత్ సేన 54 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేరుకుంది. బర్న్స్(65), స్మిత్(53) అర్ధసెంచరీలతో రాణించారు. వార్నర్ 22, ఖాజా 45, వోజెస్ 10 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, సౌతీ, వాగ్నర్ తలో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 370, ఆస్ట్రేలియా 505 పరుగులు సాధించాయి. రెండో ఇన్నింగ్స్ లో కివీస్ 335 పరుగులు చేసింది. బర్న్స్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గా ఎంపికయ్యాడు.