ప్రపంచ వాణిజ్యం పడిపోతోంది
డబ్ల్యూటీఓ అంచనా...
జెనీవా: ప్రపంచ వాణిజ్యవృద్ధి రేటు అంచనాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది ఈ వృద్ధి అంచనా కేవలం 1.7 శాతమని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) తన తాజా నివేదికలో తెలిపింది. 2016కు సంబంధించి ఈ వృద్ధి రేటు అంచనాలను డబ్ల్యూటీఓ తగ్గించడం ఇది వరుసగా మూడవసారి. దీనిని దేశాలు తీవ్రంగా పరిగణించి, తగిన చర్యలు తీసుకోవాలని డబ్ల్యూటీఓ డెరైక్టర్ జనరల్ రాబర్టో అజ్వాడో పేర్కొన్నారు. ఇప్పటికే ఎగుమతులు క్షీణ బాటలో నడుస్తున్న భారత్ వంటి దేశాలకు తాజా పరిణామం ఆందోళన కలిగించేదనడంలో సందేహం లేదు.
2014 డిసెంబర్ నుంచీ వరుసగా 19 నెలలు 2016 మే వరకూ భారత్ ఎగుమతుల్లో అసలు వృద్ధి నమోదుకాకపోగా పడిపోతూ వచ్చాయి. జూన్లో స్వల్ప వృద్ధితో ఊరట నిచ్చాయి. అయితే అటు తర్వాత రెండు నెలలూ (జూలై, ఆగస్టు) ఎగుమతులు క్షీణబాట పట్టాయి. జెనీవాలోని డబ్ల్యూటీఓ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ప్రపంచ వృద్ధిపై ఒక కీలక సమావేశం జరిగింది. 2016లో ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు 3.9 శాతం పెరుగుతుందని 2015 సెప్టెంబర్లో డబ్ల్యూటీఓ అంచనావేసింది.
అయితే ఈ రేటును ఈ ఏడాది ఏప్రిల్లో 2.8 శాతానికి కుదించింది. తాజాగా మరింతగా 1.7 శాతానికి తగ్గించింది. 2009 తరువాత వాణిజ్య వృద్ధి ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారనీ వివరించింది. స్థూల దేశీయోత్పత్తి పడిపోవడమే కాకుండా, చైనా, బ్రెజిల్, ఉత్తర అమెరికా వంటి దేశాలూ ఎగుమతుల మందగమన ఎదుర్కొనక తప్పదని పేర్కొంది.