world women chess championship
-
Dronavalli Harika: కల నెరవేరింది.. నా భర్త అన్ని విధాలా అండగా నిలిచారు
భారత చెస్ స్టార్ ద్రోణవల్లి హారిక ఖాతాలో ఇప్పటి వరకు మూడు వరల్డ్ చాంపియన్ షిప్ వ్యక్తిగత కాంస్యాలు ఉన్నాయి. అయితే 2004నుంచి జట్టు సభ్యురాలిగా ఉన్నా టీమ్ ఈవెంట్లో ఒక్కసారి కూడా పతకం అందుకునేందుకు పోడియం ఎక్కలేదనే నిరాశ ఆమెను వెంటాడింది. ఇప్పుడు హారికకు ఆ లోటు తీరిపోయింది. స్పెయిన్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్‌తో రజతం ఆమె ఖాతాలో చేరింది. పైగా వ్యక్తిగత ప్రదర్శనకుగాను మరో వెండి పతకం కూడా హారిక చెంత చేరడంతో ఆనందం రెట్టింపైంది. ఇదే ఉత్సాహంతో మున్ముందు మరిన్ని ఘనతలు సాధించేందుకు ఆమె సిద్ధమవుతోంది. సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత పతకంకంటే తన దృష్టిలో సమష్టి విజయంతో దక్కే టీమ్ మెడల్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక అభిప్రాయ పడింది. చెస్లోనూ ఒలింపియాడ్ ఉన్నా... వరల్డ్ చాంపియప్లో సాధించిన పతకం తన దృష్టిలో ఒలింపిక్ క్రీడల్లో విజయంలాంటిదేనని ఆమె పేర్కొంది. స్పెయిన్‌నుంచి తిరిగొచ్చాక ‘సాక్షి’తో ముచ్చటించిన హారిక చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... చాంపియన్‌షిప్‌కు ముందు అంచనాలు... పెద్దగా ఆశలతో మేం టోర్నీకి వెళ్లలేదు. పైగా కోనేరు హంపి కూడా దూరం కావడంతో టీమ్ కాస్త బలహీనంగానే మారింది. అయితే మా శాయశక్తులా ప్రయత్నించాలని, చివరి వరకు పట్టుదలగా పోరాడాలని మాత్రం అనుకున్నాం. నేను ఈ టోర్నీ కోసం సుమారు నెలన్నర పాటు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాను. స్విస్ సిస్టంతో పోలిస్తే ఈ సారి ఫార్మాట్ నాకౌట్‌కు మారడం మాకు కొంత సానుకూలంగా పని చేసిందని భావిస్తున్నా. ఎందుకంటే ఇలాంటి గేమ్‌లలో పెద్ద జట్లు, అగ్రశ్రేణి ఆటగాళ్లపై అదనపు ఒత్తిడి ఉంటుంది. మేం స్వేచ్ఛగా ఆడేందుకు అది మేలు చేసింది. క్వార్టర్ ఫైనల్లో కజకిస్తాన్‌పై గెలవడం అన్నింటికంటే కీలకంగా నేను భావిస్తున్నాను. టీమ్ ఈవెంట్ పతకానికి ఉన్న ప్రత్యేకత... నా 13 ఏళ్ల వయసులో తొలిసారి భారత జట్టులో భాగమయ్యాను. 17 ఏళ్లలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వేర్వేరు వరల్డ్ చాంపియన్షిప్లే కాకుండా చెస్కే ప్రత్యేకమైన ఒలింపియాడ్‌లలోనూ పాల్గొన్నాను. కానీ ఒక్కసారి కూడా పతకం లభించలేదు. వ్యక్తిగత విజయాలు ఎన్ని సాధించినా భారత జట్టుతో కలిసి వేదికపై నిలబడాలని ఎన్నో సార్లు కోరుకున్నాను. ఇప్పుడు నా కల తీరింది. ఒలింపిక్స్‌లో చెస్ క్రీడాంశం లేదు కానీ ఇప్పుడు జట్టుగా కలిగిన ఆనందం అక్కడ దక్కే పతకంకంటే తక్కువేమీ కాదు. గతంలో టీమ్ ఈవెంట్లలో భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన నాలుగో స్థానం మాత్రమే. ఇప్పుడు మేం దానిని మార్చాం. దీనిని అధిగమించాలంటూ ముందు తరాల కోసం ఒక లక్ష్యాన్ని నిర్దేశించాం. టోర్నీ ‘టేబుల్ 1’లలో నా ఆటకు మరో రజతం కూడా దక్కడం సంతోషం. ఏడాదిగా ఆన్లైన్ టోర్నీలు ఆడటంపై... బయటినుంచి చూస్తే చెస్‌లో ఆన్లైన్, ఆఫ్‌లైన్ తేడా ఏముుంటుంది అనిపిస్తుంది. కానీ ఆన్లైన్లో తలపడటం ఏమాత్రం ఆసక్తి కలిగించదు. చెస్ ఆట మాత్రమే కాదు...మైండ్ గేమ్స్ కూడా చాలా ఉంటాయి. దగ్గరినుంచి ప్రత్యర్థి కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ స్పందనను బట్టి సైకలాజికల్‌గా వేసే ఎత్తులు కూడా ఎంతో ముఖ్యం. అది ఆన్లైన్లో సాధ్యపడదు. కరోనా కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆడటం ఒక కొత్త అవకాశాన్ని సృష్టించినా...అసలు ఆటతో దానికి పోలిక లేదు. కోవిడ్ తర్వాత సోచిలో ఆఫ్‌లైన్‌లో ఆడిన నాకు ఇది రెండో టోర్నీ. అయితే ర్యాపిడ్, బ్లిట్జ్ తరహాలో ఇకపై ఆన్లైన్ కూడా ఒక ఫార్మాట్‌గా మారుతుందేమో! ఇప్పటికీ భారత మహిళల చెస్నుంచి ఇద్దరే గ్రాండ్‌మాస్టర్లు ఉండటంపై... చాలా దురదృష్టకరం. నిజాయితీగా చెప్పాలంటే కారణం ఏమిటో కూడా నాకు అర్థం కావడం లేదు. 70 మంది గ్రాండ్మాస్టర్లలో ఇన్నేళ్ల తర్వాత కూడా నేను, హంపి మాత్రమే మహిళలం. మనతో పోలిస్తే ఇతర దేశాల్లో మహిళల చెస్‌కు ఎంతో ప్రాధాన్యత లభిస్తుంది. అయితే ఓవరాల్‌గా చూస్తే మన చెస్‌లో మంచి పురోగతి కనిపిస్తుండటం శుభ పరిణామం. 2022 ఆసియా క్రీడల్లో మళ్లీ చెస్ రానుండటం సంతోషించాల్సిన విషయం. చెస్ ఖరీదైన క్రీడగా మారిపోవడంపై... ఇప్పుడే కాదు. చాలా కాలంగా చెస్‌లో ఒక స్థాయికి చేరాలంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందనేది వాస్తవం. ఇందులో సింహ భాగం కోచింగ్‌కే వెళుతుంది. పెద్ద స్థాయికి చేరే కొద్దీ మంచి శిక్షణ అవసరం అయితే దాని కోసం ఎక్కువ మొత్తం చెల్లించాల్సిందే. ఈ ఇబ్బందులతో చాలా మంది ఆటగాళ్లు ఇంటర్నెట్, పుస్తకాలపై ఆధారపడి కూడా తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడం కూడా నేను చూస్తున్నాను. వ్యక్తిగత జీవితంపై... మూడేళ్లుగా నా భర్త కార్తీక్ నాకు అన్ని విధాలా అండగా నిలిచారు. 2019 చివరి వరకు కూడా ఇద్దరం కలిసే ప్రయాణాలు చేశాం. దాదాపు అన్ని టోర్నీలకు కలిసి వెళ్లడంతో నా ఆట ఏమిటో, ఇతర సమస్యలేమిటో ఆయనకూ తెలిశాయి. చదవండి: వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సంచలన కామెంట్స్ -
నా కెరీర్లో ఇది గొప్ప ఫలితం: ద్రోణవల్లి హారిక
-
Dronavalli Harika: ఒకట్రెండుసార్లు ఏడ్చేశాను కూడా.. ఈసారి మాత్రం
సాక్షి, హైదరాబాద్: తన సుదీర్ఘ చెస్ కెరీర్లో ఎంతో కాలంగా ఊరిస్తోన్న లక్ష్యాన్ని సాధించానని ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తెలిపింది. స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ మహిళల టీమ్ చాంపియన్‌షిప్‌లో హారిక, తానియా, వైశాలి, భక్తి కులకర్ణి, మేరీఆన్ గోమ్స్‌లతో కూడిన భారత జట్టు రజతం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్‌కు ఇదే తొలి పతకం. ‘2004 నుంచి టీమ్ ఈవెంట్స్‌లో ఆడుతున్నాను. గతంలో పలుమార్లు పతకానికి చేరువై దూరమయ్యాం. ఒకట్రెండుసార్లు భావోద్వేగానికి లోనై ఏడ్చేశాను కూడా. ఈసారి మాత్రం అనుకున్నది సాధించాం. నా కెరీర్లో ఇది గొప్ప ఫలితం. మా పతకం భవిష్యత్‌లో మరిన్ని విజయాలకు నాంది పలుకుతుందని ఆశిస్తున్నాను. వ్యక్తిగతంగానూ నాకు ఈ టోర్నీ చిరస్మరణీంగా నిలిచింది. ఈ టోర్నీ మొత్తంలో 11 గేమ్‌ల్లో బరిలోకి దిగిన ఏకైక ప్లేయర్ నేనే. చివరకు అజేయంగా నిలిచి వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించినందుకు ఆనందంగా ఉంది’ అని హారిక వ్యాఖ్యానించింది. చదవండి: టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు కాంస్యం.. -
భారత్‌కు రజతం
సిట్‌గెస్ (స్పెయిన్): ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు రజతం లభించింది. 2007లో ఈ మెగా ఈవెంట్ మొదలయ్యాక భారత్‌కు లభించిన తొలి పతకం ఇదే కావడం విశేషం. గోర్యాక్ చినా, కొస్టెనిక్, కాటరీనా లాగ్నో (గ్రాండ్ మాస్టర్లు), షువలోవా, కషిలిన్‌స్కాయాలతో కూడిన రష్యా జట్టు తో శనివారం జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా, భక్తి కులకర్ణి, మేరీఆన్‌గోమ్స్‌లతో కూడిన భారత జట్టు 0–2తో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌ను భారత్ 1.5–2.5తో చేజా ర్చుకోగా... రెండో మ్యాచ్‌లో టీమిండియా 1–3తో ఓటమి చవిచూసింది. ప్రపంచ రెండో ర్యాంకర్ గోర్యాక్‌చినాతో జరిగిన తొలి గేమ్‌లో హారిక 47 ఎత్తుల్లో గెలిచి, రెండో గేమ్‌ను 39 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. -
క్వార్టర్స్‌లో హారిక
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో హారిక ‘టైబ్రేక్’లో 1.5.-0.5తో విజయం సాధించింది. నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత వీరిద్దరూ 1-1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించడానికి బుధవారం టైబ్రేక్‌ను నిర్వహించారు. టైబ్రేక్ తొలి గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 55 ఎత్తుల్లో కొస్టెనిక్‌ను ఓడించగా... నల్లపావులతో ఆడిన రెండో గేమ్‌ను 91 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించి విజయాన్ని ఖాయం చేసుకుంది. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో కోనేరు హంపి; మేరీ అరాబిద్జె (జార్జియా)తో హారిక తలపడతారు.