Harika Dronavalli : Indian Chess Grandmaster, Career And Personal Life - Sakshi
Sakshi News home page

Dronavalli Harika: కల నెరవేరింది.. నా భర్త అన్ని విధాలా అండగా నిలిచారు

Published Tue, Oct 5 2021 7:43 AM | Last Updated on Tue, Oct 5 2021 11:52 AM

Dronavalli Harika Comments About Her Career And Personal Life - Sakshi

భారత చెస్‌ స్టార్‌ ద్రోణవల్లి హారిక ఖాతాలో ఇప్పటి వరకు మూడు వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ వ్యక్తిగత కాంస్యాలు ఉన్నాయి. అయితే 2004నుంచి జట్టు సభ్యురాలిగా ఉన్నా టీమ్‌ ఈవెంట్‌లో ఒక్కసారి కూడా పతకం అందుకునేందుకు పోడియం ఎక్కలేదనే నిరాశ ఆమెను వెంటాడింది. ఇప్పుడు హారికకు ఆ లోటు తీరిపోయింది. స్పెయిన్‌లో జరిగిన వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌తో రజతం ఆమె ఖాతాలో చేరింది. పైగా వ్యక్తిగత ప్రదర్శనకుగాను మరో వెండి పతకం కూడా హారిక చెంత చేరడంతో ఆనందం రెట్టింపైంది. ఇదే ఉత్సాహంతో మున్ముందు మరిన్ని ఘనతలు సాధించేందుకు ఆమె సిద్ధమవుతోంది.

సాక్షి, హైదరాబాద్‌: వ్యక్తిగత పతకంకంటే తన దృష్టిలో సమష్టి విజయంతో దక్కే టీమ్‌ మెడల్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక అభిప్రాయ పడింది. చెస్‌లోనూ ఒలింపియాడ్‌ ఉన్నా... వరల్డ్‌ చాంపియప్‌లో సాధించిన పతకం తన దృష్టిలో ఒలింపిక్‌ క్రీడల్లో విజయంలాంటిదేనని ఆమె పేర్కొంది. స్పెయిన్‌నుంచి తిరిగొచ్చాక ‘సాక్షి’తో ముచ్చటించిన హారిక చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... 

చాంపియన్‌షిప్‌కు ముందు అంచనాలు... 
పెద్దగా ఆశలతో మేం టోర్నీకి వెళ్లలేదు. పైగా కోనేరు హంపి కూడా దూరం కావడంతో టీమ్‌ కాస్త బలహీనంగానే మారింది. అయితే మా శాయశక్తులా ప్రయత్నించాలని, చివరి వరకు పట్టుదలగా పోరాడాలని మాత్రం అనుకున్నాం. నేను ఈ టోర్నీ కోసం సుమారు నెలన్నర పాటు ప్రత్యేకంగా ప్రాక్టీస్‌ చేశాను. స్విస్‌ సిస్టంతో పోలిస్తే ఈ సారి ఫార్మాట్‌ నాకౌట్‌కు మారడం మాకు కొంత సానుకూలంగా పని చేసిందని భావిస్తున్నా. ఎందుకంటే ఇలాంటి గేమ్‌లలో పెద్ద జట్లు, అగ్రశ్రేణి ఆటగాళ్లపై అదనపు ఒత్తిడి ఉంటుంది. మేం స్వేచ్ఛగా ఆడేందుకు అది మేలు చేసింది. క్వార్టర్‌ ఫైనల్లో కజకిస్తాన్‌పై గెలవడం అన్నింటికంటే కీలకంగా నేను భావిస్తున్నాను.  

టీమ్‌ ఈవెంట్‌ పతకానికి ఉన్న ప్రత్యేకత... 
నా 13 ఏళ్ల వయసులో తొలిసారి భారత జట్టులో భాగమయ్యాను. 17 ఏళ్లలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వేర్వేరు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లే కాకుండా చెస్‌కే ప్రత్యేకమైన ఒలింపియాడ్‌లలోనూ పాల్గొన్నాను. కానీ ఒక్కసారి కూడా పతకం లభించలేదు. వ్యక్తిగత విజయాలు ఎన్ని సాధించినా భారత జట్టుతో కలిసి వేదికపై నిలబడాలని ఎన్నో సార్లు కోరుకున్నాను. ఇప్పుడు నా కల తీరింది. ఒలింపిక్స్‌లో చెస్‌ క్రీడాంశం లేదు కానీ ఇప్పుడు జట్టుగా కలిగిన ఆనందం అక్కడ దక్కే పతకంకంటే తక్కువేమీ కాదు.

గతంలో టీమ్‌ ఈవెంట్లలో భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన నాలుగో స్థానం మాత్రమే. ఇప్పుడు మేం దానిని మార్చాం. దీనిని అధిగమించాలంటూ ముందు తరాల కోసం ఒక లక్ష్యాన్ని నిర్దేశించాం. టోర్నీ ‘టేబుల్‌ 1’లలో నా ఆటకు మరో రజతం కూడా దక్కడం సంతోషం. 

ఏడాదిగా ఆన్‌లైన్‌ టోర్నీలు ఆడటంపై... 
బయటినుంచి చూస్తే చెస్‌లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ తేడా ఏముుంటుంది అనిపిస్తుంది. కానీ ఆన్‌లైన్‌లో తలపడటం ఏమాత్రం ఆసక్తి కలిగించదు. చెస్‌ ఆట మాత్రమే కాదు...మైండ్‌ గేమ్స్‌ కూడా చాలా ఉంటాయి. దగ్గరినుంచి  ప్రత్యర్థి కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ స్పందనను బట్టి సైకలాజికల్‌గా వేసే ఎత్తులు కూడా ఎంతో ముఖ్యం. అది ఆన్‌లైన్‌లో సాధ్యపడదు. కరోనా కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆడటం ఒక కొత్త అవకాశాన్ని సృష్టించినా...అసలు ఆటతో దానికి పోలిక లేదు. కోవిడ్‌ తర్వాత సోచిలో ఆఫ్‌లైన్‌లో ఆడిన నాకు ఇది రెండో టోర్నీ. అయితే ర్యాపిడ్, బ్లిట్జ్‌ తరహాలో ఇకపై ఆన్‌లైన్‌ కూడా ఒక ఫార్మాట్‌గా మారుతుందేమో! 

ఇప్పటికీ భారత మహిళల చెస్‌నుంచి ఇద్దరే గ్రాండ్‌మాస్టర్లు ఉండటంపై... 
చాలా దురదృష్టకరం. నిజాయితీగా చెప్పాలంటే కారణం ఏమిటో కూడా నాకు అర్థం కావడం లేదు. 70 మంది గ్రాండ్‌మాస్టర్లలో ఇన్నేళ్ల తర్వాత కూడా నేను, హంపి మాత్రమే మహిళలం. మనతో పోలిస్తే ఇతర దేశాల్లో మహిళల చెస్‌కు ఎంతో ప్రాధాన్యత లభిస్తుంది. అయితే ఓవరాల్‌గా చూస్తే మన చెస్‌లో మంచి పురోగతి కనిపిస్తుండటం శుభ పరిణామం. 2022 ఆసియా క్రీడల్లో మళ్లీ చెస్‌ రానుండటం సంతోషించాల్సిన విషయం.  

చెస్‌ ఖరీదైన క్రీడగా మారిపోవడంపై... 
ఇప్పుడే కాదు. చాలా కాలంగా చెస్‌లో ఒక స్థాయికి చేరాలంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందనేది వాస్తవం. ఇందులో సింహ భాగం కోచింగ్‌కే వెళుతుంది. పెద్ద స్థాయికి చేరే కొద్దీ మంచి శిక్షణ అవసరం అయితే దాని కోసం ఎక్కువ మొత్తం చెల్లించాల్సిందే. ఈ ఇబ్బందులతో చాలా మంది ఆటగాళ్లు ఇంటర్నెట్, పుస్తకాలపై ఆధారపడి కూడా తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడం కూడా నేను చూస్తున్నాను.

వ్యక్తిగత జీవితంపై... 
మూడేళ్లుగా నా భర్త కార్తీక్‌ నాకు అన్ని విధాలా అండగా నిలిచారు. 2019 చివరి వరకు కూడా ఇద్దరం కలిసే ప్రయాణాలు చేశాం. దాదాపు అన్ని టోర్నీలకు కలిసి వెళ్లడంతో నా ఆట ఏమిటో, ఇతర సమస్యలేమిటో ఆయనకూ తెలిశాయి. 

చదవండి: వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ సంచలన కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement