జింజర్ బర్గర్లో పురుగులు కదిలితే...
బెంగళూరు: సాయంత్రం పూట అలా సేదతీరుతూ కేఎఫ్సీలో బర్గర్ తింటుంటే ఆ మజాయే వేరు కదా. కానీ ఎంతో ఆకలితో ఆతృతగా, తింటున్న బర్గర్లో ఉన్నట్టుండి పురుగులు, అది కూడా కదులుతూ కనిపిస్తే ఎలా ఉంటుంది? వాక్.. అనిపిస్తుంది కదా. ఓ యువజంటకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. మంగళూరులోని సిటీ సెంటర్ మాల్లో ఉన్న కేఎఫ్సీలో జింజర్ బర్గర్ ఆర్డర్ చేస్తే.. అందులో కదులుతున్న చిన్న చిన్న పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో ప్రశాంత్, దీక్షిత అనే ఇద్దరూ అవాక్కయ్యారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రశాంత్, దీక్షిత మంగళూరులోని కేఎఫ్సీలో జింజర్ బర్గర్ ఆర్డరిచ్చారు. క్షణాల్లో వేడి వేడి బర్గర్ టేబుల్ మీద రడీ. సగం తిన్నాక ఏదో తేడాగా అనిపించింది దీక్షితకు. ఏదో బంక బంకగా చేతికి తగిలింది. పరిశీలించి చూస్తే సన్నగా కదులుతున్న పురుగులు కనిపించాయి. దీంతో వాంతి వచ్చినంత పనయ్యింది ఇద్దరికీ.
ఈ ఉదంతంపై వివరణ కోరిన మీడియాపై కేఎఫ్‌సీ యాజమన్యం రుసరుసలాడింది. ఏదో పొరపాటు జరిగి ఉంటుందని, కూరగాయల నుంచి ఆ పురుగులు వచ్చి ఉంటాయంటూ వింత వాదనలు చేసింది. ఫొటోలు తీయడానికి వీల్లేదని హూంకరించినట్టు సమాచారం. ఈ ఘటన పై రాష్ట్ర కుటుంబ, ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ ఆ సెంటర్ యజమానికి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు విషయం తమ దృష్టికి రాగానే ఆ వినియోగదారుణ్ని తమ కిచెన్ పరిశీలించాల్సిందిగా ఆహ్వానించినట్లు కేఎఫ్‌సీ తెలిపింది. అన్నీ చూసిన తర్వాత ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారని చెప్పింది. అంతర్జాతీయ ప్రమాణాలతో తమ కిచెన్‌ను నిర్వహిస్తున్నామని కేఎఫ్‌సీ ప్రతినిధి వాదిస్తున్నారు. ఇది ఆ స్థానిక ఔట్లెట్ బాధ్యత అని, ఇలాంటి వాటిని సహించబోమని తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి నోటీసులు అందలేదని అన్నారు. ఏదైనా ఫిర్యాదు ఉంటే విచారణకు సిద్ధమని చెప్పారు.