yada giri gutta
-
వర్షం ఎఫెక్ట్.. యాదాద్రి భక్తులకు చేదు అనుభవం
సాక్షి, యాదాద్రి భువనగిరి: అల్పపీడనం కారణంగా తెలంగాణలో పలు జిల్లాలో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. కాగా, చిన్నపాటి వర్షానికే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో క్యూలైన్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. బుధవారం కురిసిన చిన్నపాటి వర్షానికే యాదాద్రిలో రోడ్లు కుంగిపోయాయి. పలు చోట్ల కుంగిన రోడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కాంట్రాక్టర్లు, అధికారుల పనితనంపై భక్తులు మండిపడుతున్నారు. ఒక్క వర్షానికే యాదాద్రి అభివృద్ధి పనుల్లో అధికారుల వైఫల్యం కనపించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో భారీ వర్షం.. ఈదురు గాలుల బీభత్సం -
లడ్డూ విక్రయాల్లో అవినీతి.. యాదాద్రిలో భక్తుల ఆరోపణ
సాక్షి,యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో టికెట్ లేకుండానే లడ్డూ ప్రసాద విక్రయాలు జరుపుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తద్వారా ప్రసాదం కౌంటర్ల సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. దైవదర్శనం అనంతరం భక్తులు అధిక సంఖ్యలో ఇష్టపడేది లడ్డూ, పులిహోర ప్రసాదం. ఈ లడ్డూ ప్రసాదాన్ని ప్రధానాలయం ప్రారంభమయ్యాక భక్తులు అధికంగా తీసుకెళ్తున్నారు. ప్రసాదం కొనుగోలుకు భక్తులు ఒక కౌంటర్లో డబ్బులు చెల్లించగానే టికెట్ ఇవ్వాల్సి ఉం టుంది. ఆ టికెట్ తీసుకుని మరో కౌంటర్ వద్దకు వెళ్లి ప్రసాదం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నిబంధనల ప్రకారం ఎన్ని ప్రసాదాలు తీసుకుంటే అన్ని టికెట్లివ్వాల్సి ఉంటుంది. కానీ కౌంటర్ల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది ఎలాంటి టికెట్లు ఇవ్వకుండా లడ్డూ ప్రసాద విక్రయాలు చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. -
యాదాద్రిలో ఆంతరంగికంగానే స్వామివారి ఉత్తర ద్వార దర్శనం
► ‘వైకుంఠ ఏకాదశి’ సందర్భంగా యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.గురువారం ఉదయం 6 గంటల, 49 నిమిషాలకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. ►క్యూలైన్ల ద్వారా భక్తులకు స్వామివారి దర్శనాకి అనుమతిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు. మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆలయ ఈవో గీత పేర్కొన్నారు. ►యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా వెండి గరుడ వాహనంపై భక్తులకు లక్ష్మీనరసింహ స్వామి వారు దర్శనమిచ్చారు. ►మాస్క్, బౌతిక దూరం పాటిస్తూ క్యూలైన్ల ద్వారా స్వామి వారిని భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఆలయాన్ని ప్రత్యేక పూలతో అధికారులు అలంకరించారు. యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట : వైకుంఠ (ముక్కోటి) ఏకాదశికి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంతోపాటు పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు ముస్తాబు చేశారు. ఈ సారి కూడా ముక్కోటి పూజలు అంతరంగికంగానే జరగనున్నాయి. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆలయంలో శ్రీస్వామి వారికి చేసే పూజల్లో రద్దీ లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వైకుంఠనాథుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించి క్యూలైన్లలో వెళ్లే విధంగా యాదాద్రి, పాతగుట్ట ఆలయాల్లో వీలు కల్పించారు. బాలాలయంలో లక్ష్మీనరసింహుడి వైకుంఠద్వార దర్శనానికి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో సరిపడా పులిహోర, లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశారు. పాతగుట్ట ఆలయం వద్ద కూడా ఈ సారి ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. యాదాద్రీశుడి బాలాలయంలో గురువారం నుంచి 18వ తేదీ వరకు ఆరు రోజుల పాటు అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. అలంకార సేవలు ఇవే.. బాలాలయంలో నిర్వహించే అధ్యయనోత్సవాల్లో శ్రీస్వామి వారి అలంకార సేవలు నిర్వహిస్తారు. 13న ఉదయం గరుఢ వాహనంపై శ్రీలక్ష్మీనరసింహస్వామి అలంకార సేవ, సాయంత్రం మత్సా్యయవతారంలో విష్ణుమూర్తి అలంకర సేవ, 14న ఉదయం వేణుగోపాల స్వామి అలంకారం, సాయంత్రం గోవర్ధనగిరిధారి అలంకారం, 15న ఉదయం శ్రీరామావతారం, సాయంత్రం శ్రీవెంకటేశ్వరస్వామి అలంకారం, 16న ఉదయం వెన్న కృష్ణుడు అలంకారం, సాయంత్రం కాళీయవర్ధనుడి అలంకారం, 17న ఉదయం వటపత్రసాయి అలంకారం, సాయంత్రం వైకుంఠనాథుడి అలంకారం, 18న ఉదయం శ్రీనరసింహస్వామి అలంకారంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి. కాగా.. ముక్కోటి ఏకాదశికి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు ఈఓ గీతారెడ్డి తెలిపారు. -
కారు చీకట్లో కంటి దీపాలు!
23.. గత 24 గంటల్లో తెలంగాణలో కిడ్నాప్ అయిన చిన్నారుల సంఖ్య ఇదీ! వారిలో పోలీసులు 9 మందిని కాపాడారు.ఇంకా 14 మంది జాడ తెలియరాలేదు. 2,283.. గత ఏడాది కాలంగా రాష్ట్రంలో తప్పిపోయిన చిన్నారుల సంఖ్య ఇది. వారిలో పోలీసులు 1,371 మందిని కిడ్నాప్ ముఠాల నుంచి కాపాడారు. ఇంకా 912 మంది చిన్నారులు ఎక్కడున్నారో.. ఎలా ఉన్నారో ఎవరికీ తెలియదు! 6,088.. పోలీసు లెక్కల ప్రకారం ఏపీ, తెలంగాణల్లో 2010–16 మధ్య కనిపించ కుండా పోయిన మహిళల సంఖ్య ఇది. వీరంతా ఎటు పోతున్నారు? ఏమై పోతున్నట్టు? సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : యాదగిరిగుట్ట వ్యభిచార గృహాల నుంచి 11 మంది బాలికలను పోలీసులు కాపాడిన నేపథ్యంలో ఈ ప్రశ్నలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా మాయమవుతున్న చిన్నారులు, మహిళలపై ‘సాక్షి’ దృష్టి సారించగా విస్మయకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మహిళల అక్రమ రవాణాకు తెలంగాణ, ఏపీలో అనేక గ్యాంగ్‌లు పని చేస్తున్నాయి. చిన్నపిల్లలు, యుక్తవయసులో ఉన్న పేద ఆడపిల్లలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను గుర్తించడమే ఈ ముఠాల పని. ఇందుకు వారు పెద్ద నెట్‌వర్క్‌నే నడుపుతున్నారు. ఈజీగా వలలో పడే మహిళల వివరాలు ఇస్తే రూ.25 వేల నగదును అందజేస్తూ కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారు. ఓ పోలీసు అధికారి చెప్పిన వివరాల ప్రకారం హైదరాబాద్, విజయవాడలో ఇలాంటి గ్యాంగ్‌లు వందకు పైగానే ఉన్నాయి. వీరి కింద దాదాపు ఐదు వేల మంది ఏజెంట్లు పని చేస్తుంటారు. మాయమాటలు.. కిడ్నాప్‌లు.. ఈజీ మనీకి అలవాటుపడ్డ ముఠాలు చిన్నారులు, యుక్తవయసు ఆడపిల్లలు, మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని, చదువు చెప్పిస్తామని మాయమాటలతో నమ్మించి నట్టేట ముంచుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను టార్గెట్ చేసుకుని.. విదేశాల్లో పనిమనుషులుగా మంచి వేతనాలు ఇప్పిస్తామంటూ మహిళలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. మోసపోయిన నెల, ఆరు నెలల తర్వాత బాధితుల తరఫు బంధువులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంలో చైతన్యం తెచ్చేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదని ‘ఆపరేషన్ ముస్కాన్’లో పని చేసిన ఓ పోలీసు అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కరీంనగర్ జిల్లాలోని ఒక గ్రామంలో పది కుటుంబాలకు చెందిన మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని, నెలకు రూ.25 వేలు ఇంటికి పంపిస్తానని తల్లిదండ్రులు, భర్తలకు ఆశ చూపి తీసుకెళ్లాడు ఓ మోసగాడు. వరుసగా నాలుగు మాసాల పాటు డబ్బులు పంపాడు. తర్వాత మరో ఐదుగురు ఇంటర్ చదివే అమ్మాయిలను తీసుకెళ్లాడు. ఇది జరిగి రెండున్నర సంవత్సరాలవుతోంది. ఇప్పుడు వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియదు’’ అని ఆ పోలీసు అధికారి పేర్కొన్నారు. హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విషయం తెలిసి అతని సమీప బంధువు పదో తరగతి పాసైన అతని కూతురుకు నెలకు రూ.30 వేల ఉద్యోగం ఇప్పిస్తానని ముంబై తీసుకెళ్లాడు. ఏడాది దాటినా కూతురు ఆచూకీ తెలియకపోవడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఉద్యోగం ఇప్పిస్తానని కూతురిని తీసుకువెళ్లిన బంధువు జాడ కూడా తెలియలేదు. దాదాపు రెండేళ్ల పాటు పుణెలోని వ్యభిచార గృహాల్లో చిత్రహింసలు భరించిన ఆ బాలికను పోలీసులు కాపాడారు. ఆ అమ్మాయి బయటకు వచ్చి అసలు విషయం చెప్పేదాకా ఆమె ఎంత నరకం అనుభవించందో తెలియదు. ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకువెళ్లిన వ్యక్తి ఆమెను రూ.లక్షకు ఓ వ్యభిచార గృహానికి అమ్మేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వెతలెన్నో కనిపిస్తున్నాయి. కిడ్నాప్ చేసి అమ్మేస్తున్నారు ఆరు నుంచి పదేళ్ల వయసున్న అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్న ముఠాలు వారిని ముంబై, పుణె, ఢిల్లీలోని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నాయి. చిన్న పిల్లలు తప్పిపోతున్నట్లు అనేక ఫిర్యాదులు వస్తుండటంతో తెలంగాణ పోలీసు శాఖ ‘ముస్కాన్’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆపరేషన్ స్మైల్ పేరుతో పోలీసులు గడచిన మూడున్నర సంవత్సరాల్లో 25,834 మందిని కాపాడారు. వీరిలో 12,483 మంది పిల్లల్ని వారి తల్లిదండ్రులకు అప్పగించగా 13,351 మందిని సేŠట్ట్ హోమ్‌కు తరలించారు. -
యాదాద్రిలో భక్తులరద్దీ
సాక్షి,యాదగిరిగుట్ట : తెలంగాణ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ్మస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి ఎక్కువైంది. స్వామివారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది. సెలవుల కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మరో నాలుగు రోజుల్లో పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయి. దీంతో భక్తులు కుటుంబసమేతంగా రావడంతో రద్దీ ఎక్కువగా ఉంది. ఆలయ పునర్నిర్మాణం కారణంగా స్థలాభావంతోపాటు పార్కింగ్, భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు వాహనాలను కొండ పైకి అనుమతించడం లేదు. -
భక్తులతో యాదాద్రి కిటకిట
యాదగిరిగుట్ట (నల్లగొండ): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిట లాడింది. ఉదయం నుంచే భక్తుల సందడి కనిపించింది. ఆదివారం సుమారు 70 వేల మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారని దేవస్థానం అధికారులు తెలిపారు. దర్శనానికి సుమారు 6 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. మరోవైపు, ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ జాం కావడంతో గంటల తరబడి వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. వసతి గదులు లభించక భక్తులు శనివారం రాత్రి ఆరు బయటే విశ్రాంతి తీసుకున్నారు. వర్షం వల్ల భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
యాదగిరిగుట్టలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నల్లగొండ: నల్లగొండ జిల్లా యాదగిరి గుట్టలో అభివృద్ధి పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం ఉదయం శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా సీఎం ఆలయ అభివృద్ధి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం పెద్దగుట్ట వద్ద రాజగోపురం పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్‌తో పాటుగా గవర్నర్ నరసింహన్, చిన్నజీయర్ స్వామి పాల్గొంటారు.