23.. గత 24 గంటల్లో తెలంగాణలో కిడ్నాప్ అయిన చిన్నారుల సంఖ్య ఇదీ! వారిలో పోలీసులు 9 మందిని కాపాడారు.ఇంకా 14 మంది జాడ తెలియరాలేదు.
2,283.. గత ఏడాది కాలంగా రాష్ట్రంలో తప్పిపోయిన చిన్నారుల సంఖ్య ఇది. వారిలో పోలీసులు 1,371 మందిని కిడ్నాప్ ముఠాల నుంచి కాపాడారు. ఇంకా 912 మంది చిన్నారులు ఎక్కడున్నారో.. ఎలా ఉన్నారో ఎవరికీ తెలియదు!
6,088.. పోలీసు లెక్కల ప్రకారం ఏపీ, తెలంగాణల్లో 2010–16 మధ్య కనిపించ కుండా పోయిన మహిళల సంఖ్య ఇది. వీరంతా ఎటు పోతున్నారు? ఏమై పోతున్నట్టు?
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : యాదగిరిగుట్ట వ్యభిచార గృహాల నుంచి 11 మంది బాలికలను పోలీసులు కాపాడిన నేపథ్యంలో ఈ ప్రశ్నలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా మాయమవుతున్న చిన్నారులు, మహిళలపై ‘సాక్షి’ దృష్టి సారించగా విస్మయకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మహిళల అక్రమ రవాణాకు తెలంగాణ, ఏపీలో అనేక గ్యాంగ్‌లు పని చేస్తున్నాయి. చిన్నపిల్లలు, యుక్తవయసులో ఉన్న పేద ఆడపిల్లలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను గుర్తించడమే ఈ ముఠాల పని. ఇందుకు వారు పెద్ద నెట్‌వర్క్‌నే నడుపుతున్నారు. ఈజీగా వలలో పడే మహిళల వివరాలు ఇస్తే రూ.25 వేల నగదును అందజేస్తూ కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారు. ఓ పోలీసు అధికారి చెప్పిన వివరాల ప్రకారం హైదరాబాద్, విజయవాడలో ఇలాంటి గ్యాంగ్‌లు వందకు పైగానే ఉన్నాయి. వీరి కింద దాదాపు ఐదు వేల మంది ఏజెంట్లు పని చేస్తుంటారు.
మాయమాటలు.. కిడ్నాప్‌లు..
ఈజీ మనీకి అలవాటుపడ్డ ముఠాలు చిన్నారులు, యుక్తవయసు ఆడపిల్లలు, మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని, చదువు చెప్పిస్తామని మాయమాటలతో నమ్మించి నట్టేట ముంచుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను టార్గెట్ చేసుకుని.. విదేశాల్లో పనిమనుషులుగా మంచి వేతనాలు ఇప్పిస్తామంటూ మహిళలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. మోసపోయిన నెల, ఆరు నెలల తర్వాత బాధితుల తరఫు బంధువులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంలో చైతన్యం తెచ్చేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదని ‘ఆపరేషన్ ముస్కాన్’లో పని చేసిన ఓ పోలీసు అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కరీంనగర్ జిల్లాలోని ఒక గ్రామంలో పది కుటుంబాలకు చెందిన మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని, నెలకు రూ.25 వేలు ఇంటికి పంపిస్తానని తల్లిదండ్రులు, భర్తలకు ఆశ చూపి తీసుకెళ్లాడు ఓ మోసగాడు. వరుసగా నాలుగు మాసాల పాటు డబ్బులు పంపాడు. తర్వాత మరో ఐదుగురు ఇంటర్ చదివే అమ్మాయిలను తీసుకెళ్లాడు.
ఇది జరిగి రెండున్నర సంవత్సరాలవుతోంది. ఇప్పుడు వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియదు’’ అని ఆ పోలీసు అధికారి పేర్కొన్నారు. హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విషయం తెలిసి అతని సమీప బంధువు పదో తరగతి పాసైన అతని కూతురుకు నెలకు రూ.30 వేల ఉద్యోగం ఇప్పిస్తానని ముంబై తీసుకెళ్లాడు. ఏడాది దాటినా కూతురు ఆచూకీ తెలియకపోవడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఉద్యోగం ఇప్పిస్తానని కూతురిని తీసుకువెళ్లిన బంధువు జాడ కూడా తెలియలేదు. దాదాపు రెండేళ్ల పాటు పుణెలోని వ్యభిచార గృహాల్లో చిత్రహింసలు భరించిన ఆ బాలికను పోలీసులు కాపాడారు. ఆ అమ్మాయి బయటకు వచ్చి అసలు విషయం చెప్పేదాకా ఆమె ఎంత నరకం అనుభవించందో తెలియదు. ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకువెళ్లిన వ్యక్తి ఆమెను రూ.లక్షకు ఓ వ్యభిచార గృహానికి అమ్మేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వెతలెన్నో కనిపిస్తున్నాయి.
కిడ్నాప్ చేసి అమ్మేస్తున్నారు
ఆరు నుంచి పదేళ్ల వయసున్న అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్న ముఠాలు వారిని ముంబై, పుణె, ఢిల్లీలోని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నాయి. చిన్న పిల్లలు తప్పిపోతున్నట్లు అనేక ఫిర్యాదులు వస్తుండటంతో తెలంగాణ పోలీసు శాఖ ‘ముస్కాన్’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆపరేషన్ స్మైల్ పేరుతో పోలీసులు గడచిన మూడున్నర సంవత్సరాల్లో 25,834 మందిని కాపాడారు. వీరిలో 12,483 మంది పిల్లల్ని వారి తల్లిదండ్రులకు అప్పగించగా 13,351 మందిని సేŠట్‌ట్ హోమ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment