![Yadadri Bhongir: Police Busts Human Trafficking Racket 2 Minor Girls Rescued - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/7/06ALR211-230014F.jpg.webp?itok=ZZEMmChd)
బాలికలతో వ్యభిచారం చేయిస్తూ పట్టుబడిన ముఠా సభ్యులు
యాదగిరిగుట్ట: బాలికలను అక్రమ రవాణా చేస్తూ వ్యభిచారం చేయిస్తున్న ఓ ముఠాను యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లికి చెందిన కంసాని అనసూయ చాలా ఏళ్ల క్రితం ఇద్దరు ఆడ శిశువులను కొనుగోలు చేసి యుక్త వయస్సు వచ్చే వరకు పెంచి పోషించింది.
సులువుగా డబ్బు సంపాదించుకునేందుకు ఇద్దరు బాలికలతో వ్యభిచారం చేయించాలని నిర్ణయించుకుంది. అందుకోసం తన బంధువైన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామంలో ఉన్న కంసాని శ్రీనివాస్ వద్దకు బాలికలను పంపించింది. శ్రీనివాస్ అక్కడ ఆ బాలికలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తుండేవాడు. అదే క్రమంలో యాదగిరిపల్లికి కూడా పంపిస్తుండేవాడు. వ్యభిచారం చేయించేందుకు అనసూయ వారిని కొడుతూ ఉండేది. అనసూయ, శ్రీనివాస్‌కు మరికొంతమంది సహకరించేవారు.
తప్పించుకుపోయి.. పోలీసుల కంటపడి..
అనసూయ చిత్రహింసలకు తట్టుకోలేక ఇద్దరిలో ఓ బాలిక ఇటీవల ఇంటి నుంచి పారిపోయింది. జనగామ జిల్లా బస్టాండ్‌లో తిరుగుతూ పోలీసుల కంట పడింది. వారి విచారణలో యాదగిరిపల్లికి చెందిన అనసూయ, తంగళపల్లికి చెందిన శ్రీనివాస్ వ్యభిచారం చేయిస్తున్న విషయం వెలుగు చూసింది. దీంతో అక్కడి పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా బాలల సంరక్షణ అధికారి సైదులుతో పాటు ఇక్కడి పోలీసులకు సమాచారం అందజేశారు.
మెరుపుదాడి చేసి..
ఈ నెల 3న సైదులు ఫిర్యాదు మేరకు యాదగిరిగుట్ట పోలీసులు, షీటీమ్స్, చైల్డ్ ప్రొటెక్షన్ సభ్యులు కలిసి యాదగిరిపల్లిలోని కంసాని అనసూయ ఇంటిపై దాడి చేశారు. అనసూయను అదుపులోకి తీసుకుని విచారించగా సెక్స్ రాకెట్ డొంక కదిలింది. ఆమె ఇచ్చిన సమాచారంతో తంగళపల్లికి చెందిన కంసాని శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన చంద భాస్కర్, చంద కార్తీక్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని టీచర్ కాలనీకి చెందిన కంసాని లక్ష్మిలను పోలీసులు అరెస్టు చేశారు.
యాదగిరిపల్లికి చెందిన కంసాని ప్రవీణ్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన కంసాని స్వప్న, కంసాని అశోక్, కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన చందా సరోజనమ్మ పరారీలో ఉన్నట్లు తెలిపారు. పోలీసులు ఇద్దరు బాలికలను బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. దాడుల్లో పాల్గొన్న డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, టౌన్ సీఐ సైదయ్య, యాదగిరిగుట్ట పోలీసు బృందానికి సీపీ మహేష్ భగవత్ అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment