సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో అభం శుభం తెలియని చిన్నారులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టిన వ్యవహారంపై ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బ్రాయిలర్ కోళ్లకు ఇచ్చినట్లు ఆడపిల్లలకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చినా ఇంటెలిజెన్స్ ఏం చేస్తోందని మండిపడింది. యాదాద్రిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. మీకు తెలియలేదంటే అసలేం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిర్వాహకులు, అధికారులు కుమ్మక్కయి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. అటు, ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారికి దిగువ కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బీ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్‌ల ధర్మాసనం సోమవారం విస్మయం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన కేసుల విచారణలో జాప్యం జరగకుండా అవసరమైతే ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ఆదేశాలు ఇస్తామని తెలిపింది. ‘యాదాద్రి’ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయడంపై వైఖరి తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నరకకూపం నుంచి బయటపడిన బాధితులను రక్షించేందుకు ఏమేం చర్యలు తీసుకున్నారో చెప్పాలని, ఇటువంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఏం చేయాలనుకుంటున్నారో కూడా వివరించాలని ఆదేశాలు జారీచేసింది. పూర్తి వివరాలన్నింటినీ తమ ముందుంచాలంటూ విచారణను మంగళవారానికి (అక్టోబర్ 23) వాయిదా వేసింది.
అలాంటి వారికి బెయిలిస్తారా?
యాదాద్రి వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారికి కింది కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలాంటి హేయమైన కేసుల్లో దిగువ కోర్టు బెయిల్ ఇస్తుంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ‘సదరు కోర్టు బెయిల్‌ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యతిరేకించారా? ఒకవేళ ఆయన వ్యతిరేకించినా.. జడ్జీ బెయిల్ ఇచ్చారా? ఇంత క్రూరంగా వ్యవహరించిన వారికి బెయిల్ ఎలా ఇస్తారు?’ అని ధర్మాసనం మండిపడింది. ఈ కేసు వివరాలన్నింటినీ తన ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘చిన్నారులను వ్యభిచార వృత్తిలోకి దింపడమే తీవ్రమైన నేరమైతే.. వారు యుక్త వయస్కులుగా కనిపించేందుకు హార్మోన్ల ఇంజక్షన్లు ఇవ్వడం అమానవీయం. మాంసం ఎక్కువగా వచ్చేందుకు బ్రాయిలర్ కోళ్లకు హార్మోన్ ఇంజక్షన్లు ఇస్తారు. ఇక్కడ హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వడానికి వాళ్లు.. ఆడపిల్లలా? లేక బ్రాయిలర్ కోళ్లా?’ అని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. చిన్నారులను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపడం ఓ మార్కెట్‌గా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది.
బాధితులకోసం ఏం చేస్తున్నారు?
యాదాద్రిలో చిన్నారులను వ్యభిచార వృత్తిలోకి దింపిన దారుణ వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన కథనాలతో చలించిపోయిన ప్రధాన న్యాయమూర్తి ఈ ఘటనను సుమోటోగా పరిగణించారు. ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ స్పందిస్తూ.. యాదాద్రి ఘటనపై ఇప్పటి వరకు నమోదు చేసిన కేసులు, జరిపిన అరెస్టులు వివరాలను కోర్టు ముందుంచారు. కొందరిపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగించామన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. బాధితులను రక్షించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని, ఇలాంటివి పునరావృత్తం కాకుండా ఏం చర్యలు తీసుకోబోతున్నారని ప్రశ్నించింది. ఘటన జరిగిన తీరును చూస్తుంటే.. నిర్వాహకులు, అధికారులు కుమ్మక్కయ్యారనే అనుమానం వస్తోందని పేర్కొంది. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వ వైఖరేంటో తెలియచేయాలని ఆదేశించిన ధర్మాసనం.. ఈ సిట్‌లో మహిళాధికారులకు తగిన ప్రాధాన్యత ఉండాలని తేల్చిచెప్పింది.
వర్ణనాతీత వేదనకు పరిహారం సరిపోతుందా?
అమాయకులైన చిన్నారులకు హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చిన వైద్యుడికి కూడా బెయిల్ రావడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసింది. ఈ వైద్యుడిపై నేరపూరిత కుట్ర (ఐపీసీ సెక్షన్ 120(బీ)కింద) కేసు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను నిలదీసింది. ఈ సమయంలో అదనపు ఏజీ జె. రామచంద్రరావు జోక్యం చేసుకుంటూ బాధితులకు పరిహారం చెల్లించామని చెబుతుండగా.. ధర్మాసనం జోక్యం చేసుకుని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘తమపై అరాచకంగా వ్యవహరించిన నరకకూపంలో మగ్గిన చిన్నారులు పడ్డ వర్ణనాతీత వేదనకు పరిహారం ఇస్తే సరిపోతుందా?’ అంటూ మండిపడింది. పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో ఇటువంటి హేయమైన ఘటనలు జరుగుతున్నా.. తెలియలేదంటే ఏం చేస్తున్నారని ఇంటెలిజెన్స్‌ను, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై అదనపు ఏజీ సమాధానమిస్తూ.. అసలు వ్యభిచారం జరుగుతున్నట్లు చుట్టుపక్కల వారికీ తెలియదని చెప్పారు. దీనిపైనా ధర్మాసనం మండిపడింది. దారుణమైన అరాచకాన్ని నిరోధించలేకపోవడానికి ఇలాంటి వాదనలు ఎంత మాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. పత్రికల్లో వచ్చిన కథనాలపై అదనపు ఏజీ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ‘మేం పత్రికా కథనాలపై పూర్తిగా ఆధారపడలేదు. జిల్లా జడ్జీ నుంచి కూడా నివేదిక కూడా తెప్పించుకున్నాం’ అని వెల్లడించింది. అవసరమైతే ఈ కేసులో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేందుకు సైతం ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. మంగళవారం నాటి విచారణకు యాదాద్రి డీసీపీ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment