యుమునలో భక్తుల పుణ్య స్నానాలు
పవిత్ర యుమునా నది పుష్కరాలు గురువారం వేకువజాము నుంచి ప్రారంభం అయ్యాయి. భక్తులు యమునలో పవిత్ర స్నానాలు ఆచరించి తరిస్తున్నారు. గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నదికి పుష్కరాలు వస్తాయి. యమునా నది హిమాలయ పర్వతాలలొని కాళింది పర్వత శ్రేణులలో యమునోత్రి వద్ద జన్మించి ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుండి ప్రవహించి అలహాబాద్ వద్ద గంగ మరియు సరస్వతి నదులతో కలిసి ప్రయాగలో త్రివేణి సంగమం ఏర్పడుతుంది.
అయిదు రాష్ట్రాల ద్వారా ప్రవహించే యమునా పుష్కరాలకు దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తుల హాజరు అవుతారు. పుష్కరాలు మొదలైన 19వ తేదీన రాజమండ్రి, విజయనగరం, భీమడోలు, విజయవాడ నుంచి తరలి వచ్చిన సుమారు 1880 మంది భక్తులు విజిరాబాద్ ఘాట్‌లో పుణ్యస్నానాలు చేశారు. ఢిల్లీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజిరాబాబాద్ ఘాట్‌ను బీజేపీ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ 2001లో ప్రారంభించారు.
కాగా యమునా పుష్కరాల కోసం వచ్చే తెలుగు ప్రజల కోసం రాజమండ్రికి చెందిన నరసింహరావు, ఎన్వీ సత్యనారాయణ ఆధ్వర్యంలో అల్పాహారంతో పాటు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. విజిరాబాద్తో పాటు మధుర పుష్కర ఘాట్ వద్ద ఈ కార్యక్రమం కొనసాగుతోంది. భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది.