yarlagadd Lakshmi Prasad
-
లోకేష్ పెళ్లిపై చంద్రబాబు నాన్సెన్స్ అన్నారు: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
సాక్షి, విశాఖపట్నం: నారా లోకేష్ పెళ్లి అంశంపై మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేనరికం సంబంధాలు మంచివి కాదని చంద్రబాబు అనేవారు. నాన్సెన్స్ అని నన్ను తిట్టేవారు. కానీ, తర్వాత బాలకృష్ణ కూతురును నారా లోకేష్‌కు ఇచ్చి చంద్రబాబు వివాహం చేశారని చెప్పుకొచ్చారు. కాగా, యార్లగడ్డ శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆకాశమంత ఎత్తు ఎదిగారు. ఆకాశం మీద ఉమ్ము వేయాలని చూస్తే వారి మొహం మీదనే పడుతుంది. తారక్ ప్లెక్సీలు తొలగిస్తే ఆయనకు ఏమీ నష్టం లేదు. తారక్‌పై ఎవరు విమర్శలు చేస్తే అది వారికే నష్టం. గతంలో బాలకృష్ణ కూతురును లోకేష్‌కు ఇచ్చి పెళ్లి చేస్తున్నారా? అని చంద్రబాబును అడిగాను. నాన్సెన్స్ అని నన్ను చంద్రబాబు తిట్టారు. మేనరికం సంబంధాలు మంచివి కాదని చెప్పారు. తర్వాత లోకేష్‌కు బాలకృష్ణ కూతురినిచ్చి చంద్రబాబు వివాహం చేశారు. అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ మంచి నిర్ణయం. అంబేడ్కర్ దేశానికి ఒక ఐకాన్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం. సీఎం జగన్‌పై పిచ్చి కేసులు పెట్టారు. లక్ష కోట్ల అవినీతిని అని తప్పుడు ప్రచారం చేశారు. సీఎం జగన్ ఒక హీరో. నేను మంచి చేస్తేనే ఓటు వేయండని ధైర్యంగా చెప్పిన నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే. అలాంటి నేత దేశంలో మరొకరు లేరు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ పుస్తకావిష్కరణ
-
‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ బుక్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : సాక్షి, తాడేపల్లి: జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత, రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన దివంగత డాక్టర్ సి. నారాయణ రెడ్డి పార్లమెంట్ ప్రసంగాల సంకలనం 'పెద్దల సభలో తెలుగు పెద్ద' పుస్తకావిష్కరణ కార్యక్రమం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. రాజ్యసభ పూర్వ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సేకరించి సంకలనం చేసిన ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఒకే వాక్యంలో చెప్పాలంటే సినారె ప్రసంగాల పుస్తకం తన చేతుల మీదుగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని సీఎం జగన్ అన్నారు. సభాధ్యక్షులుగా పాల్గొన్న సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. తనకు డాక్టర్ సి.నారాయణ రెడ్డితో 45 ఏళ్ల పరిచయమని, ఆయనతో ఇందిరా పార్కులో మార్నింగ్ వాకింగ్ చేసే రోజుల్లో ఆయన కవితల ప్రధమ శ్రోతను తానే అని అన్నారు. జ్ఞాన్‌పీఠ్ అవార్డు పొందిన తెలుగు వారిలో మొదటి వారు విశ్వనాథ సత్యనారాయణ, రెండో వారు సినారె అని గుర్తు చేశారు. ముఖ్య అతిథి జాతీయ జ్యుడిషియల్ అకాడమి డైరెక్టర్ జస్టిస్ గోడ రఘురాం మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌కు ప్రజలు గొప్ప విజయాన్ని ఇచ్చారని, అందుకు తగ్గ సవాళ్లు కూడా ఉంటాయని అన్నారు. వాటిని అధిగమించే శక్తి సీఎం జగన్‌కు ఉందని భావిస్తున్నానన్నారు. పార్లమెంట్లో అనేక అనుభవాలను, దృశ్యాలను సంఘటనలను చెప్పిన డాక్టర్ సినారె ప్రసంగాలను సంకలనం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఈ పుస్తకావిష్కరణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా జరగడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి రైతు నేస్తం పబ్లికేషన్స్ అధిపతి యడవల్లి వేంకటేశ్వరరావు సంధానకర్తగా వ్యవహరించారు. -
సింగపూర్‌లో ప్రపంచ తెలుగు సాహితీ మహాసభలు
నవంబర్ 5, 6 తేదీల్లో నిర్వహణకు ఏర్పాట్లు: యార్లగడ్డ విశాఖపట్నం : ప్రపంచ తెలుగు సాహితీ మహాసభలను నవంబర్ 5, 6 తేదీల్లో సింగపూర్‌లో నిర్వహించనున్నట్టు లోక్‌నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వంగూరి ఫౌండేషన్ అధ్యక్షుడు వంగూరి చిట్టన్రాజు తెలిపారు. వారు బుధవారం విలేకరులతో మాట్లాడారు. లోక్‌నాయక్ ఫౌండేషన్, వంగూరి ఫౌండేషన్, సింగపూర్ తెలుగు అసోసియేషన్, మలేషియా తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించనున్న ఈ మహాసభలకు. భారత్‌తోపాటు హాంకాంగ్, మలేసియా, థాయ్‌లాండ్, దక్షిణాఫ్రికా, సింగపూర్, మయన్మార్ దేశాల్లోని సాహితీవేత్తలు పాల్గొంటారన్నారు. వివిధ దేశాల్లోని తెలుగు రచయితలు, సాహితీవేత్తలను ఒక వేదికపైకి తీసుకురావడమే ఉద్దేశమన్నారు. తెలుగుభాషపై మక్కువ గలవారిని, సాహితీవేత్తలను ఈ సభలకు ఆహ్వానం పలుకుతున్నామన్నారు. వివరాలకు vangurifound ation@gmail.com వెబ్సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు.