‘జయదేవ్ విజిటింగ్ ప్రొఫెసర్’
సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. ఇరు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు చేసుకుంటున్నారు. టీడీపీ తమకు కటీఫ్ చెప్పినా అభ్యంతరం లేదని బీజేపీ నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడా కృష్ణమోహన్, యువమోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ రాంప్రసాద్ వ్యాఖ్యానించారు.
బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... ‘మాతో రాంరాం అనుకుంటే రాంరామే. ఒకవేళ యుద్ధం చేయాలనుకుంటే మేమూ చేస్తాం. అందుకు కావాల్సిన ఆయుధాలు కూడా మా దగ్గర ఉన్నాయి. టీడీపీ నేతలు తమ భాషను మృదువుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తే బాగుంటుంద’ని అన్నారు.
ఏం సాధించారని సన్మానం..
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఏం సాధించారని సన్మానం చేస్తున్నారో అర్థం కావడం లేదని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆయన్ను విజిటింగ్ ఫ్రొఫెసర్ అని పిలుస్తారని ఎద్దేవా చేశారు. అవకాశమెస్తే జయదేవ్ కన్నా తాము ఇంకా బాగా మాట్లాడగలమన్నారు.