Yasmin Basha
-
ఒక్కరోజు మహిళా కలెక్టర్
⇒ జేసీ యాస్మిన్ బాషాకు దక్కిన అరుదైన గౌరవం ⇒ స్వయంగా సీట్లో కూర్చోబెట్టిన కలెక్టర్ కృష్ణభాస్కర్ సాక్షి, సిరిసిల్ల: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా ప్రత్యేక గౌరవం పొందారు. జిల్లా కలెక్టర్ సీటులో ఆసీనులు కావడమే కాకుండా.. మహిళా దినోత్సవ బహిరంగ సభలోనూ కలెక్టర్‌గా కీర్తింపబడ్డారు. కలెక్టర్ హోదాలో పలు సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ లీవ్‌లో ఉన్న సమయంలో జేసీ ఇన్చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం సర్వసాధారణమే అయినా.. కలెక్టర్ డి.కృష్ణభాస్కర్ పక్కన ఉండగానే ఆమె కలెక్టర్‌గా సంబోంధింపబడడం విశేషం. మహిళా దినోత్సవం రోజున కలెక్టర్‌గా అధికారిక సంతకం చేయడం మినహా ఆమె బుధవారం ‘ఒక్కరోజు కలెక్టర్’గా వ్యవహరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కలెక్టర్ సీటులో జేసీ.. ఉదయం కలెక్టరేట్లో జేసీ యాస్మిన్‌ను తన చాంబర్‌లోని కలెక్టర్ సీటులో కూర్చోబెట్టి కలెక్టర్ డి.కృష్ణభాస్కర్ మహిళల పట్ల తనకున్న గౌరవం చాటుకున్నారు. ‘ఈరోజు మీరే కలెక్టర్’ అంటూ జేసీని తన సీటులో కూర్చోబెట్టి.. తాను అధికారుల సీట్లలో కూర్చొని మరోసారి తనదైన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు. దాదాపు పావుగంటపాటు ఆమె కలెక్టర్ సీటులో, కలెక్టర్ అధికారుల సీటులో ఉండిపోయారు. అలాగే సభలో మాట్లాడుతున్న సమయంలో ‘ఇవాల్టి కలెక్టర్ యాస్మిన్ బాషా’ అని జిల్లా కలెక్టర్ డి.కృష్ణభాస్కర్ సంబోధించడంతో సభికులు కరతాళ ధ్వనులు చేశారు. మిగతా అతిథులు కూడా యాస్మిన్ బాషాను కలెక్టర్‌గా ప్రస్తావించారు. అధికారికంగా కుదరదని కలెక్టర్‌గా మారిన యాస్మిన్ అదే హోదాలో పలు సమావేశాలు నిర్వహించారు. బీసీ కమిషన్ పర్యటన, అపరిష్కృతంగా ఉన్న అభివృద్ధి పనులు, తహసీల్దార్లతో సమావేశాలను కలెక్టర్ హోదాలో నిర్వహించి, పలు సూచనలు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా జేసీ యాస్మిన్‌కు ఒక్కరోజు కలెక్టర్‌గా పూర్తి బాధ్యతలు అప్పగించడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ అధికారికంగా వీలుపడదని ఉన్నతాధికారులు చెప్పడంతో వెనక్కి తగ్గినట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
పక్కా ప్రణాళికతో ‘స్వచ్ఛ సిరిసిల్ల’
26వరకు ఐఎస్ఎల్ నిర్మాణాలు పూర్తి ► వార్డుల్లో కౌన్సిలర్ల సహకారం అవసరం ► జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా ►సిరిసిల్ల మున్సిపల్ అత్యవసర సమావేశం సిరిసిల్ల టౌన్: జిల్లా కేంద్రాన్ని ‘స్వచ్ఛ సిరిసిల్ల’గా మార్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం పక్కా ప్రణాళికను అనుసరిస్తుందని జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. జిల్లా ముఖచిత్రమైన సిరిసిల్లలో నూరుశాతం ఐఎస్ఎల్ సాధించాల్సిన అవసరం ఉందని ఇందుకు అన్ని వార్డుల్లో కౌన్సిలర్ల పాత్ర ఉండాలని సూచించారు. నూరుశాతం శానిటేషన్ కోసం గురువారం సాయంత్రం మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఆమె మాట్లాడారు. గతంలో 2వేల వరకు ఐఎస్ఎల్ నిర్మాణాలు చేపట్టాల్సినట్లుగా గుర్తించినా వివిధ కారణాలతో వాటి గణాంకాలు రెండింతలు పెరిగిందదన్నారు. ఈనెల 26వరకు పట్టణంలో పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు నిర్మాణం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఐఎస్ఎల్ నిర్మాణాలకు ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందుతుందన్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో నూరుశాతం ఐఎస్ఎల్ ప్రకటించుకున్నాయని హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛ సిరిసిల్ల కోసం ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రజలతో సంఘటితంగా ముందుకెళ్లాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలోనే జిల్లాను అభివృద్ధి పథంలో ఉంచాలన్న మంత్రి కేటీఆర్ ఆశయానికి అందరూ సహకరించాలని కోరారు. నోట్లరద్దు తదితర ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాశయాన్ని అధికారులు, కౌన్సిలర్లు నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందరూ దృష్టి సారిస్తే నూరుశాతం శానిటేషన్ సాధన పెద్దసమస్య కాదని స్పష్టం చేశారు. స్థానికంగా పేరుకుపోయిన సమస్యలను కౌన్సిలర్లు ఆమె దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బడుగు సుమన్ రావు, ప్రత్యేకాధికారి శ్రీధర్, డీఈఈ ప్రభువర్ధన్ రెడ్డి, వైస్‌చైర్మన్ తౌటు కనుకయ్య, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
మళ్లీ పెన్షన్ సర్వే!
జోగిపేట: నగర పంచాయతీ పరిధిలో పెన్షన్ అర్హుల ఎంపిక సక్రమంగా జరుగలేదని తేలడంతో మళ్లీ వారం రోజుల్లో మండల స్థాయి అధికారులతో సర్వే నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని అందోలు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్, ఆర్వీఎం పీఓ యాస్మిన్ బాష తెలిపారు. శుక్రవారం జోగిపేటలోని తహిశీల్దారు కార్యాలయంలో పెన్షన్‌కు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎంత మందిని అర్హులుగా గుర్తించారు? లబ్ధిదారుల ఎంపిక ఎలా జరిగిందని స్పెషల్ ఆఫీసర్ నగర పంచాయతీ కమిషనర్ విజయలక్ష్మిపై ప్రశ్నల వర్షం కురిపించారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆమెపై యాస్మిన్‌బాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పంచాయతీలో 2408 మంది పెన్షన్‌కు అర్హతలేని వారు దరఖాస్తు చేసుకున్నారు. 175 దరఖాస్తులు తొలగించారు. కాగా 2233 దరఖాస్తుల్లో అర్హులను ఎంపిక చేయాల్సి ఉండగా 1382 మందిని ఇప్పటి వరకు ఎంపిక చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇంకా 900 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ 98 శాతం అర్హులు ఎలా వచ్చారని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం కొన్ని గైడ్‌లై న్స్ ఇచ్చిందని, వాటిని ఏమీ పట్టించుకోకుండా అర్హులను గుర్తించినట్లు తెలుస్తుందన్నారు. పెన్షన్ దారులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేసిందో అప్పటి నుంచి పెన్షన్ డబ్బులు చెల్లిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పెన్షన్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించేందుకు తనను పంపించారని, కలెక్టర్‌కు పూర్తి నివేదికను అందజేసి ఏమి చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు.