yennam srinivasa reddy
-
హామీలను మరిచిన కేసీఆర్
సాక్షి, మహబూబ్‌నగర్ : ఎన్నికల ముందు రైతులకు, ప్రజలకు ఇచ్చిన హమీలను సీఎం కేసీఆర్ మరిచారని..వెంటనే వాటిని నెరవేర్చాలని మాజీ మంత్రి. డి.కే.అరుణ, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీజేపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తక్షణ తలాక్ నిషేద బిల్లును రాజ్యసభలో అమోదించడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. తక్షణ తలాక్ నిషేద బిల్లు వల్ల మహిళలకు ప్రధాని నరేంద్రమోడీ అండగా నిలిచారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బిజేపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా చేపట్టడం జరుగుతుంది. టీఆర్ఎస్ నిరంకుశ పాలనతో బిజేపిలోకి స్వచ్ఛందంగా పలువురు చేరుతున్నారని వాపోయారు. రైతుబంధు, రుణమాఫీ చేయకపోవడంతో రైతులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చని కేసీఆర్..మున్సిపాలిటీ ఎన్నికల ముందు పింఛన్ల ప్రోసిడింగ్తో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కొత్త పింఛన్లు ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఇవ్వలేదనిన్నారు. నిరుద్యోగ భృతి ఏమైంది? నిరుద్యోగులకు రూ.3116 నిరుద్యోగ భృతి ఏమైందని, దివ్యాంగులకు పింఛన్లు ఆగిపోయాయన్నారు. గత ప్రభుత్వ హయంలో 4విడతలుగా రుణమాఫీ చేస్తే, ప్రస్తుతం అధికారంలోకి వచ్చాక ఇంతవరకు రుణమాఫీపై ఊసెత్తడం లేదన్నారు. డబుల్ బెడ్రూం నిర్మాణాలు నాసిరకంగా చేపట్టడం వల్ల కూలిపోతున్నాయని, ఇప్పటికే చాలా వరకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతటా అభివృద్ధిచేయాలన్నారు. పాలమూరు–రంగారెడ్డి మూడేళ్లలో చేస్తామని చెప్పి..ఆరేళ్లు కావస్తుందన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను వెంటనే నెరవేర్చి రైతులకు న్యాయం చేయాలన్నారు. అనంతరం తక్షణ తలాక్ బిల్లును పార్లమెంటు ఆమోదించడం పట్ల మైనార్టీ మహిళలు డికే.అరుణకు స్వీట్లు తినిపించి, హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్‌చైర్మెన్ కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు రామన్నగారి వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు కుమారస్వామి, రఘు, అనుజ్ఞరెడ్డి, ప్రవీన్, మురార్జీ తదితరులు ఉన్నారు. -
బుజ్జగించారు..ఉపసంహరించుకున్నారు...
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముందస్తు ఎన్నికల్లో మహాకూటమి పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. గెలుపే లక్ష్యంగా నేతలందరూ ఒక తాటి మీదకు వస్తున్నారు. ముఖ్యంగా టికెట్లు దక్కక అసంతృప్తితో నామినేషన్లు వేసిన నేతల్లో కొందరిని బుజ్జగించే పని మొదలుపెట్టారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు దక్కక మూడు చోట్ల రెబల్స్ నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ తరఫున ఒక స్థానంలో రెబెల్ బరిలోకి దిగారు. ఆయా నేతలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే.అరుణను రంగంలోకి దింపింది. దీంతో ఆమె మహబూబ్‌నగర్‌లో కూటమి పొత్తుకు విఘాతం కలగకుండా రెబెల్స్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేలా జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. అలాగే దేవరకద్ర విషయంలో జైపాల్‌రెడ్డి జోక్యంతో పార్టీ నేత జి.మధుసూదన్‌రెడ్డి(జీఎంఆర్) తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఇక నారాయణపేటలో రెబెల్‌గా బరిలోకి దిగిన కుంభం శివకుమార్‌రెడ్డి మాత్రం వెనక్కి తగ్గడంలేదు. బీఎల్ఎఫ్ అభ్యర్థిగా కొనసాగేందుకు ఆయన నిర్ణయించుకోగా.. మక్తల్‌లోనూ టీఆర్ఎస్ రెబెల్ నేత ఎం.జలందర్‌రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. నచ్చజెప్పిన డీకే.అరుణ మహాకూటమిలో భాగంగా టీడీపీకి కేటాయించిన మహబూబ్‌నగర్ స్థానం విషయంలో నెలకొన్న చిక్కులను చక్కదిద్దేందుకు కాంగ్రెస్ అధిష్టానం మాజీ మంత్రి డీకే. అరుణకు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రంగప్రవేశం చేసిన అరుణ... కూటమిలో భాగస్వామ్యమైన తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ జన సమితి నేతలతో సంప్రదింపులు చేశారు. తెలంగాణ ఇంటి పార్టీ తరఫున బరిలో నిలిచిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డిని మహబూబ్‌నగర్‌లోని తన నివాసం వద్దకు పిలిపించుకుని సర్దిచెప్పారు. భవిష్యత్‌లో కూటమి భాగస్వామ పక్షాలకు అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే తెలంగాణ జన సమితి నేత జి.రాజేందర్‌రెడ్డికి సైతం నచ్చజెప్పారు. ఇలా సంప్రదింపులు చేసి ఇరువురు నేతలతతో నామినేషన్లు ఉపసంహరింప చేశారు. అలాగే కూటమి భాగస్వామ అభ్యర్థి ఎర్ర శేఖర్‌కు మద్దతుగా ప్రచారం చేయాలని సూచించారు. అందుకు ఇరువురు నేతలు కూడా సమ్మతి తెలిపి... ప్రచారంలో పాల్గొంటామని ప్రకటించారు. అయితే కాంగ్రెస్ టికెట్ దక్కక బయటకు వెళ్లి ఎన్సీపీ తరఫున బరిలో ఉన్న ఎం.సురేందర్‌రెడ్డి, బీఎస్పీ తరఫున బరిలో ఉన్న సయ్యద్ ఇబ్రహీం మాత్రం తమ నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. అలాగే దేవరకద్రలో సైతం జైపాల్‌రెడ్డి వర్గంగా ముద్రపడిన జీఎంఆర్ సైతం బుజ్జగింపుల పర్వంలో భాగంగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అంతేకాదు.. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న డోకూరు పవన్‌కుమార్‌కు మద్దతుగా ప్రచారంలో సైతం పాల్గొంటామని ప్రకటించారు. నారాయణపేటలో సీన్ రివర్స్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు మూడు చోట్ల రెబెల్స్ బెడద ఉండగా రెండు చోట్ల కాస్త సద్గుమణిగింది. కానీ నారాయణపేటలో మాత్రం టికెట్ దక్కక స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన శివకుమార్‌రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. అసంతృప్తులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ ముఖ్యులు డీకే.అరుణను రంగంలోకి దించగా.. ఆమె కూడా నారాయణపేట విషయాన్ని పట్టించుకోలేదు. ‘పేట’లో గెలిచే అవకాశం ఉన్న శివకుమార్‌రెడ్డికి టికెట్ కేటాయించకపోవడం దారుణమని... అందువల్ల పోటీ నుంచి వైదొలగాలని ఆయనకు తాను చెప్పబోనని స్పష్టం చేసినట్లు సమాచారం. అన్ని సర్వేల్లో మెరుగైన నివేదికలు ఉన్న శివకుమార్‌ను అవసరమైతే గెలిపించుకుంటానని అరుణ చెప్పినట్లు తెలిసింది. -
తెలంగాణ అడ్డుకునేందుకు డబ్బులు పంపిణీ: యెన్నం
మహబూబ్‌నగర్: ఇతర రాష్ట్రాల ఎంపీలకు డబ్బులిచ్చి పార్లమెంట్ వెల్‌లోకి తేవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు టీడీపీ, కాంగ్రెస్‌లు కుట్రపన్నాయని మహబూబ్‌నగర్ బీజేపీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన పాలమూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలకు విందు ఇచ్చి తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేలా కుట్ర చేశారని అన్నారు. టీడీపీ ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరి, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సెల్‌ఫోన్ కాల్ లిస్టును బహిర్గతం చేస్తే తెలంగాణ అడ్డుకునేందుకు వారు చేసిన కుట్రలు బహిర్గమవుతాయన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకుంటే 30 పార్లమెంట్ సీట్లు ఇస్తామని, దేశంలోని ఇతర పార్టీలను ఎన్డీయే కూటమిలోకి తెస్తామని ప్రకటించినా ఇచ్చిన మాటకు కట్టుబడి బీజేపీ తెలంగాణ ఏర్పాటుకు సహకరించిందన్నారు. దేశంలో చంద్రబాబు వంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడే నేత ఎవరూలేరని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో బీజేపీ ఒంటరిగానే పోటీచేసే యోచనలో ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. -
'విశ్వసనీయతకు తెలంగాణ బిల్లు పరీక్ష'
హైదరాబాద్: సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడుపై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి తెలిపారు. వెంకయ్య నాయుడు ఎన్నడూ తెలంగాణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు ముందుగా లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీల విశ్వసనీయతకు తెలంగాణ బిల్లు ఒక పరీక్ష అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణకు వెంకయ్య నాయుడు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని యెన్నం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. వెంకయ్య నాయుడు సీమాంధ్ర నాయకుడిగా మాట్లాడుతున్నారా లేదా జాతీయ నాయకుడిగా సంప్రదింపులు జరుపుతున్నారా అనేది స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిండు పాలకుండలో విషంచుక్క వేయొద్దంటూ వెంకయ్యను విమర్శించారు. -
'కాంగ్రెస్ జేజమ్మలు దిగొచ్చినా రాయల తెలంగాణను తేలేరు'
హైదరాబాద్: ఎంఐఎం పార్టీ రాయల తెలంగాణను అడిగిందని తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలిపెడతారా? అంటూ కాంగ్రెస్ అధిష్టానంపై రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. పూటకో డ్రామా ఆడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తున్నామని చెప్పి ఇప్పుడీ సరికొత్త రాగమేంటని ప్రశ్నించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నేతలు యెండల లక్ష్మీనారాయణ, యన్నం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.రాజేశ్వరరావు, అరుణా జ్యోతి, బండారు దత్తాత్రేయ తదితరులు బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. వందల ఏళ్ల చరిత్ర, సంస్కృతి ఉన్న రాయలసీమ సెంటిమెంటును దెబ్బతీస్తారాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బ్రేకులు, లీకులతో ప్రజలను గందరగోళపరుస్తారా? కబడ్దార్’ అని హెచ్చరించారు. కాంగ్రెస్ జేజమ్మలు దిగొచ్చినా రాయల తెలంగాణను తేలేరన్నారు. జేఏసీ భాగస్వామ్య పార్టీగా గురువారం నాటి బంద్‌కు మద్దతిస్తున్నట్టు తెలిపారు. ఇదిలావుంటే, కర్నూలుకు చెందిన డీ భీమలింగేశ్వరరావు నాయకత్వంలో పలువురు బీజేపీలో చేరారు. ప్రపంచ రోలర్ స్కేటింగ్ చాంపియన్ పోటీలో పసిడి పతకాన్ని సాధించిన హైదరాబాద్ యువకుడు అనూప్ కుమార్ యామాను నేతలు ఘనంగా సత్కరించారు.