తెలంగాణ అడ్డుకునేందుకు డబ్బులు పంపిణీ: యెన్నం
మహబూబ్‌నగర్: ఇతర రాష్ట్రాల ఎంపీలకు డబ్బులిచ్చి పార్లమెంట్ వెల్‌లోకి తేవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు టీడీపీ, కాంగ్రెస్‌లు కుట్రపన్నాయని మహబూబ్‌నగర్ బీజేపీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన పాలమూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలకు విందు ఇచ్చి తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేలా కుట్ర చేశారని అన్నారు. టీడీపీ ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరి, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సెల్‌ఫోన్ కాల్ లిస్టును బహిర్గతం చేస్తే తెలంగాణ అడ్డుకునేందుకు వారు చేసిన కుట్రలు బహిర్గమవుతాయన్నారు.
రాష్ట్ర విభజనను అడ్డుకుంటే 30 పార్లమెంట్ సీట్లు ఇస్తామని, దేశంలోని ఇతర పార్టీలను ఎన్డీయే కూటమిలోకి తెస్తామని ప్రకటించినా ఇచ్చిన మాటకు కట్టుబడి బీజేపీ తెలంగాణ ఏర్పాటుకు సహకరించిందన్నారు. దేశంలో చంద్రబాబు వంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడే నేత ఎవరూలేరని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో బీజేపీ ఒంటరిగానే పోటీచేసే యోచనలో ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.