మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
కళ్యాణదుర్గం : భార్యను చంపిన కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవల బయటకు వచ్చిన యుగంధర్(35) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం అర్ధరాత్రి ఐదుకల్లు రోడ్డులో చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ–2 దామోదర్ తెలిపిన సమాచారం మేరకు యుగంధర్ ఐదేళ్ల క్రితం భార్య అంజినమ్మను చంపిన కేసులో శిక్ష పడటంతో జైలు జీవితం అనుభవించి ఇటీవల బయటకు వచ్చాడు. జైలు శిక్ష పడకముందే కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లికి చెందిన మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. యుగంధర్‌కు శిక్ష పడటంతో ఆమె కుర్లపల్లిలోనే స్థిరపడింది.
ఇటీవల బయటకు వచ్చిన యుగంధర్ సంప్రదింపులు జరిపి రెండో భార్యను కళ్యాణదుర్గం పట్టణంలోని తన ఇంటికి తీసుకువచ్చాడు. భర్త ప్రవర్తన నచ్చక ఆమె తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. మొదటి భార్య హత్య కేసులో శిక్ష అనుభవించడం, రెండో భార్య కాపురం విషయంలో సమస్య రావడంతో తాను బతకడం వృథా అని తల్లి రత్నమ్మతో పలుమార్లు వాపోయాడు. మనస్తాపంతో సొంత పొలంలో వేపచెట్టుకు పంచెతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళ్యాణదుర్గం పోలీసులు మృతదేహానికి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.