Yuva Morcha
-
BJP: కాఫీ విత్ యూత్
సాక్షి, న్యూఢిల్లీ: యువ ఓటర్లను ఆకర్షించేందుకు ‘చాయ్ పే చర్చ’ను కాస్తా ‘కాఫీ విత్ యూత్’గా మార్చింది బీజేపీ. వీలైతే కప్పు కాఫీ అంటూ పార్టీ యువ మోర్చా నేతలు కొత్త ఓటర్లను అడుగుతున్నారు. ముంబైలో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించడంతో వీటిని దేశవ్యాప్తంగా చేపడుతున్నారు. యువ ఓటర్ల నాడి తెలుసుకుని, వారిని బీజేపీ వైపు మళ్లించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బూత్ స్థాయి నుంచి... ముంబైలో ఇటీవల పలుచోట్ల దాదాపు 300 మంది యువ ఓటర్లతో బీజేపీ యువ మోర్చా నేతలు ‘కాఫీ పే చర్చ’ నిర్వహించారు. పదేళ్ల్లలో బీజేపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని వారికి వివరించారు. దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో ఈ చర్చలను విస్తరిస్తున్నారు. ప్రతి భేటీలో కనీసం 150 నుంచి 200 మంది యువ ఓటర్లుండేలా ప్లాన్ చేస్తున్నారు. ‘కాఫీ పే చర్చ’లో బూత్ స్థాయి కార్యకర్త మొదలు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుని దాకా పాల్గొంటారు. ప్రతి కార్యకర్త తమ పరిధిలోని కనీసం 10 మంది కొత్త, యువ ఓటర్లను ఈ చర్చకు తీసుకొస్తున్నారు. రెస్టారెంట్లు, పార్కులు, ఆట స్థలాలు, ఖాళీ ప్రదేశాల్లో వినూత్నంగా దీన్ని నిర్వహిస్తున్నారు. మోదీ పేర్కొన్న ‘విజన్ 2047’ లక్ష్యంతో చర్చ సాగుతోంది. ‘రాబోయే ఐదేళ్లలో దేశంలో యువత పాత్ర ఎలా ఉండాలి? ప్రభుత్వం ఏం చేస్తే యువతకు దగ్గరవుతుంది? అన్ని రంగాల్లోనూ ప్రపంచంలో భారత్ అగ్ర స్థానానికి చేరాలంటే ఏం చేయాలి? అవినీతి నిర్మూలన, ఆర్థికాభివృద్ధి, పేదరికం లేని ఇళ్లు’ తదితర అంశాలపై రెండు నుంచి మూడు గంటల పాటు కార్యక్రమం జరుగుతోంది. యువ ఓటర్ల సలహాలను పార్టీ అధిష్టానానికి పంపుతున్నారు. -
వీరంతా బీజేపీ అభ్యర్థులేనా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అభ్యర్థుల జాబితాపై పార్టీలోని పాతకాపులతోపాటు ఏబీవీపీ, యువమోర్చా విభాగాల్లోని వారు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. పార్టీ ప్రకటించిన 111 మంది అభ్యర్థుల్లో 30–35 మంది మాత్రమే పాతనేతలు, పార్టీ సిద్ధాంత భూమిక ఉన్నవారని.. ఇలాంటి పరిస్థితుల్లో సైద్ధాంతిక భూమిక ఉన్న పార్టీగా ప్రజలకు ఏరకమైన సందేశాన్నిస్తారని నిలదీస్తున్నారు. అసలు ఈ అభ్యర్థులను బీజేపీ వారిగా భావించవచ్చా? ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడ్డాక వీరిలో ఎంత మంది పార్టీలో మిగులుతారనే ప్రశ్నలను సంధిస్తున్నారు. పార్టీలో ప్రస్తుత ముఖ్యనేతలు, మరీ ముఖ్యంగా బయట నుంచి వచ్చిన నేతలు వర్గాల వారీగా విడిపోయి తమ అనుయాయులకు పెద్దసంఖ్యలో టికెట్లు ఇప్పించుకున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. టికెట్ల ఖరారులో డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలతో బీజేపీ విమర్శల పాలైదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్రపార్టీలోని ముఖ్యనేతలు తమ వారికి టికెట్లు ఇప్పించుకునేందుకు చేసిన హెచ్చరికలకు జాతీయ, రాష్ట్రనాయకత్వాలు లొంగిపోవడం ఎలాంటి సంకేతాలిస్తాయంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర పార్టీలో ముందు నుంచి ఉన్న ముఖ్యనేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కొందరు వర్గాలుగా విడిపోయి టికెట్ల కేటాయింపులో తమ పట్టును నిలుపుకునేలా ఒత్తిళ్లు తెచ్చి పైచేయి సాధించడం వంటి పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదంటున్నారు. ఏళ్లకు ఏళ్లు పనిచేసినా... నల్లగొండ, చేవెళ్ల, మహబూబాబాద్ ఎంపీ సీట్ల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి కూడా పాతకాపులు, పార్టీ సిద్ధాంతాలు నమ్ముకుని ఏళ్లకు ఏళ్లుగా పనిచేస్తున్న వారికి అవకాశం లభించలేదని వారు వాపోతున్నారు. ఈ స్థానాల్లో కొత్తగా పార్టీలో చేరిన వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక పోతున్నామంటున్నారు. రెండు, మూడువారాల వ్యవధిలోనే పార్టీలో చేరిన పది, పదిహేను మందికి సీట్లు ఇవ్వడం పట్ల విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఈ స్థానాల్లో వీరంతా కచ్చితంగా గెలుస్తారని నాయకత్వం చెప్పగలదా అని ప్రశ్నిస్తున్నారు. అలాంటపుడు అన్నిచోట్లా కాకపోయినా వీలున్న చోట్ల అయినా పార్టీని నమ్ముకున్న వారికి పార్టీకి బలపడేందుకు అవకాశం ఉండేదని వాదిస్తున్నారు. మొత్తంగా 111 స్థానాల వారీగా పార్టీ ఖరారు చేసిన అభ్యర్థుల పూర్వాపరాలు, గతంలో ఉన్న పార్టీలు వంటి వాటిని పరిశీలిస్తే... వీరిలో చాలామంది రెండు, మూడుపార్టీలు మారిన వారేనని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి తర్వాత సమావేశమై భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలనే యోచనలో దీర్ఘకాలం పార్టీలో పనిచేసిన పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. -
‘లోకేశ్‌కు తప్ప ఎవరికి ఉద్యోగం రాలేదు’
సాక్షి, విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్‌కు తప్ప రాష్ట్రంలో మరొకరికి ఉద్యోగం రాలేదని బీజేపీ యువ మోర్చా నాయకులు విమర్శించారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ.. యువ మోర్చా నాయకులు శుక్రవారం విజవాడలో వినూత్న నిరసనకు దిగారు. చెవిలో పూలు, చేతిలో చిప్ప పట్టుకుని భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఇంటికో ఉద్యోగం, రెండు వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికి వరకు ఒక ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 1000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. -
దమ్ముంటే అరెస్టు చేసుకోండి!
న్యూఢిల్లీ/కోల్‌కతా: బీజేపీ చీఫ్ అమిత్ షా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం పెరిగింది. అస్సాం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) తుది ముసాయిదా విడుదలపై మమత ఎక్కువగా స్పందించడం, తదుపరి ఎన్నార్సీ పశ్చిమ బెంగాల్లో∙ఉండొచ్చన్న వార్తలతో బీజేపీ, టీఎంసీల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 11న కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ యువమోర్చా నిర్ణయించింది. ఈ ర్యాలీలో అమిత్ షా పాల్గొననున్నారు. అస్సాం తరహాలో బెంగాల్లో అక్రమంగా ఉన్న బంగ్లాదేశీయులను పంపించేస్తామని షా ప్రకటిస్తే ఇది రాజకీయంగా పెను ప్రభావం చూపుతుందనే కారణంతో ఈ ర్యాలీకి అనుమతివ్వబోమని మొదట కోల్‌కతా పోలీసులు ప్రకటించారు. దీనిపై షా స్పందిస్తూ.. ‘ఆగస్టు 11న ర్యాలీ నిర్వహిస్తాం. దమ్ముంటే అరెస్టు చేసుకోండి’ అని సవాల్ విసిరారు. తర్వాత పోలీసులు ర్యాలీకి ఓకే చెప్పారు. భారత్–బంగ్లా స్నేహానికి ఇబ్బంది! సరైన ఓటర్లను ఎన్నార్సీలో కలపకుండా బీజేపీ ఓటుబ్యాంకు రాజకీయం చేస్తోందని మమత విమర్శించారు. రేపు తననూ చొరబాటుదారు అంటారేమోనని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ‘నా తల్లిదండ్రులు ఇక్కడే పుట్టారనే జనన ధ్రువీకరణ పత్రాల్లేవు. అదృష్టవశాత్తూ నా వద్ద ఆ పత్రాలున్నాయి. కానీ నా తల్లిదండ్రులకు లేవని నన్ను చొరబాటుదారు అంటారేమో?’ అని మమత ఎద్దేవా చేశారు. ‘2019లో విపక్షాలు ఏకమవుతాయి. బీజేపీ పని అయిపోయినట్లే’ అని ఆమె అన్నారు. ‘నన్ను బీజేపీ ఆపలేదు. నేను వారి పనిమనిషిని కాను’ అని∙ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నార్సీ కారణంగా బంగ్లాదేశ్‌తో భారత్‌కున్న సత్సంబంధాలు దెబ్బతింటాయని ఆమె పేర్కొన్నారు. తాను ప్రధాని పదవిని ఆశించడం లేదని.. విపక్షాలన్నీ కలిసే ప్రధాని అభ్యర్థిని ఎన్నుకుంటాయన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా సహా వైఎస్సార్సీపీ, ఆర్జేడీ, డీఎంకే, ఎస్పీ సహా పలు పార్టీల నేతలను కలిశారు. బీజేపీ నేత అడ్వాణీ, బీజేపీ నుంచి సస్పెండైన కీర్తీ ఆజాద్‌లను కలిశారు. ఎన్నార్సీపై రచ్చ అస్సాం ఎన్నార్సీ విషయంలో పార్లమెంటులో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ఎన్నార్సీపై చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ సహా పలువురు ఎంపీలు ఈ డిమాండ్‌తో సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. అయితే రికార్డులను పరిశీలిస్తానని చైర్మన్ వెంకయ్య నాయుడు కాంగ్రెస్ ఎంపీలకు భరోసా ఇచ్చారు. అయినా విపక్ష సభ్యులు వెనక్కు తగ్గకపోవడంలో సభ పలుమార్లు వాయిదా పడింది. లోక్‌సభలోనూ తృణమూల్ ఎంపీలు ప్రభుత్వం తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. -
ముద్దులు, కౌగిలింతలతో ప్రేమికుల నిరసన
తిరువనంతపురం: 'మోరల్ పోలీసింగ్' పేరుతో గతవారం కేరళలోని కోజికోడ్ రెస్టారెంట్ లో యువ మోర్చా కార్యకర్తలు చేసిన దాడికి నిరసనగా కోచి మెరైన్ డ్రైవ్ వద్ద యువతీ, యువకులు పెద్ద ఓ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నవంబర్ 2 తేదిన నిర్వహించే కార్యక్రమంలో బహిరంగంగా ప్రేమ జంటలు ముద్దులు, కౌగిలింతలు పెట్టుకుని నిరసన తెలుపాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ నిరసన కార్యక్రమానికి సంబందించిన విషయాలను తెలిపేందుకు సోషల్ మీడియాను కూడా ఆసరా చేసుకోనున్నారు. త్వరలోనే ఫేస్ బుక్ పేజ్ ను ప్రారంభించనున్నట్టు నిరసనకారులు తెలిపారు. అక్టోబర్ 23 తేదిన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై కోజికోడ్ లోని రెస్టారెంట్ పై యువ మోర్చా కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈకేసులో కొంతమంది యువమోర్చా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.