కేంద్ర సాయం పచ్చి మోసం
-కేంద్ర సాయంపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపాటు
-ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే!
సాక్షి, హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం పచ్చి మోసమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం చేస్తున్నాయో... ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉండదని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం రాష్ట్రానికి రూ 1,976 కోట్లు సాయం చేసిందంటూ కేంద్రంలో టీడీపీ మంత్రి సుజనా చౌదరి వెల్లడించిన కొద్ది సేపటికి ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తాము లోక్‌సభలో ప్రత్యేక హోదా కోసం నిరవధికంగా ఆందోళన చేస్తే రెండు రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పుకొచ్చారని ఏదో పెద్ద ప్యాకేజీ ఇస్తామని పేర్కొన్నారని, అయితే తీరా చూస్తే ఏమీ లేదన్నారు.
విభజన జరిగినపుడు చట్టంలో పేర్కొన్నవే ఇపుడు ఇస్తున్నారని కొత్తగా ఇస్తున్నదేమీ లేదన్నారు. రాష్ట్ర లోటు బడ్జెట్, రాజధాని నిర్మాణానికి నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వడం ఇవన్నీ కూడా విభజన హామీల్లో భాగమేనన్నారు. అది కూడా ఇపుడు ప్రకటించిన కేంద్ర ఆర్థిక సాయం ఎందుకూ చాలదని ఆయన అభిప్రాయపడ్డారు. తాము ప్రధానంగా డిమాండ్ చేసిన ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. హోదా వస్తే అనేక పారిశ్రామిక ప్రోత్సహకాలు వస్తాయని తద్వారా అభివృద్ధి చెందుతుందని కేంద్రాన్ని కోరామన్నారు.
రాజధానికి ఇపుడు ఇచ్చిన రూ. 450 కోట్లు నిధులు ఎందుకూ సరిపోవని, పోలవరం ఊసే లేదన్నారు. పరిస్థితి చూస్తూంటే పదేళ్లకైనా రాజధానిని పూర్తి చేస్తారనే నమ్మకం కలగడం లేదన్నారు. పోలవరం పరిస్థితీ అలాగే ఉందన్నారు. రాజధానికి కేంద్రం ఇచ్చిన నిధులు రంగులు వేసుకోవడానికి, పబ్లిసిటీ చేసుకోవడానికే సరిపోతాయని ఆయన వ్యంగంగా అన్నారు. అంతా తూతూ మంత్రం వ్యవహారంగా ఉందన్నారు. రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా తీసుకురావాలని వైవీ డిమాండ్ చేశారు. విభజన చట్టం హామీలన్నీ నెరవేర్చడంతో పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన అన్నారు.