Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

KSR Comments On Chandrababu And Media1
బాబూ.. మీడియాతో పెట్టుకోకు!

ఎవరైనా బలవంతంగా ఇంట్లోకి చొరబడితే ఏం చేస్తాం?. ముందుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మరి పోలీసులే వ్యక్తుల ఇళ్లల్లోకి బలవంతంగా చొరబడితే? చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే? ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని హరిస్తూ అరాచకాలకు పాల్పడితే? ఏపీలో ప్రస్తుత పరిస్థితి ఇదే.ఏపీ ప్రభుత్వం మిగిలిన పనులన్నీ పక్కనబెట్టి మరీ పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తూ విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను వేధిస్తూ చివరికి ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న మీడియా గొంతు నొక్కేందుకూ ప్రయత్నిస్తోంది. సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి నివాసంపై పోలీసుల దాడిని కూడా ఈ కోణంలోనే చూడాలి. టీడీపీ, అధికారంలోకి వచ్చినప్పటి జనసేన, బీజేపీ కూటమి దుశ్చర్యలకు అంతు లేకుండా పోతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎప్పుడూ మీడియాపై ఒక కన్నేసే ఉంచుతారు. బాకా మీడియాను ఒకరకంగా, వైఫల్యాలను, ప్రభుత్వ స్కామ్‌లను బయటపెట్టే మీడియాను మరో రకంగా చూస్తారు. మాట వినని జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి తొలగించేలా యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకు వస్తారు కూడా. అనుకూలంగా ఉండే మీడియాకు రకరకాల రూపాలలో మేళ్లు చేస్తారు. తద్వారా ఆ యాజమాన్యాలను తన గుప్పెట్లో ఉంచుకుంటారు.1995లో తన మామ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక వర్గం మీడియా ద్వారా ఆయనపైనే వ్యతిరేక ప్రచారం అనండి.. దుష్ప్రచారం చేయించిన చరిత్ర చంద్రబాబుది అని అప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నవారు చెబుతుంటారు. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉంటూనే ఆయన తెలివిగా ఎన్టీఆర్‌ ప్రతిష్టను తగ్గించే వ్యూహాలు అమలు చేశారని ఆరోపణలున్నాయి. ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీపార్వతిని బూచిగా చూపెట్టేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలను బాగా వాడుకోగలిగేవారు. ఈనాడు చూడడానికే అసహ్యంగా ఉండే ఘోరమైన కార్టూన్లు ఎన్టీఆర్‌పై వేసేది. అయినా ఆ రోజుల్లో ఈ పత్రికలపై ఎన్టీఆర్‌ కేసులు పెట్టలేదు.మామను కూలదోసి ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు పాలన మాటెలా ఉన్నా అనుకూల మీడియా వ్యవస్థనైతే బాగానే ఏర్పాటు చేసుకున్నారు. మీటింగ్‌లు జరిగినా, జరగకపోయినా, కల్పిత కథనాలకు కొదవ ఉండేది కాదు. అదే టైమ్‌లో రాజకీయ ప్రత్యర్థులపై బురద చల్లే వ్యూహాలు పక్కాగా అమలయ్యేవి. ఆ రోజుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే కొన్ని పత్రికలకు ప్రభుత్వ ప్రచార ప్రకటనలు నిలిపివేసే వారు. కానీ ఇప్పటిలా బరితెగించి మరీ కేసులు పెట్టేవారు కాదనే చెప్పాలి. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం చంద్రబాబుకు కొత్తకాదు. అయితే, ఆ హామీలను అమలు చేయకపోయినా ఎవరూ వాటిని గుర్తు చేయకూడదు! అందుకోసం ఆయన నానా ప్రయత్నాలూ చేస్తుంటారు.2014లో రైతుల సంపూర్ణ రుణమాఫీ కావచ్చు.. కాపుల రిజర్వేషన్‌ ఉద్యమం కావచ్చు.. మరేదైనా కావచ్చు. చంద్రబాబు పంథా ఒక్కటే. తనకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుంటే అనుకూల మీడియా చేత వాటిని అణచివేసే ప్రయత్నం చేయడం. అంశం ఏదైనా.. టీవీ ఛానళ్లలో అనుకూల ప్రచారమే సాగాలన్నది ఆయన ఆకాంక్ష. కాపుల రిజర్వేషన్‌ విషయమే తీసుకుందాం.. ఇచ్చిన హామీ అమలుకు ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేపడితే ఆ విషయం ప్రజలలోకి వెళ్లనీయకుండా కొన్ని టీవీ చానళ్లను బ్లాక్ చేయడానికి యత్నించారు. ఇదే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అధికార పార్టీపై వ్యతిరేక వార్తలు రాయాలని జర్నలిస్టులకు నూరి పోస్తుంటారు. దానికి తగినట్లే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి తమ రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం ఉన్నవి, లేనివి కల్పించి వార్తలు ఇచ్చేవి. ఈ మీడియా 2019-2024 మధ్యలో ముఖ్యమంత్రి జగన్‌పై కక్కినంత విషం బహుశా ప్రపంచంలోనే మరే మీడియా కక్కి ఉండదు. ఇందుకోసం పచ్చి అబద్ధాలు రాసేందుకూ వెనుకాడలేదు ఈ సంస్థలు.టీడీపీ మీడియా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్‌ను కించపరిచేలా కథనాలు ఇచ్చినా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌ తదితరులు దారుణమైన వ్యాఖ్యలు చేసినా అప్పట్లో ఎవరిపై కేసులు పెట్టలేదు. కానీ 2024లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు.. సాక్షి మీడియా అణచివేతకు యత్నిస్తూనే ఉన్నారు. పలువురు విలేకరులపై పోలీసు కేసులు నమోదవడం ఇందుకు నిదర్శనం. నెల్లూరు జిల్లా కావలి వద్ద ఎప్పుడో మూడేళ్ల క్రితం శిలాఫలకం పడవేశారంటూ అప్పటి ఎమ్మెల్యేతోపాటు విలేకరిపై కూడా కేసు పెట్టారట. అప్పుడు ఏం చేశారో కాని, కూటమి అధికారంలోకి వచ్చాక, టీడీపీ, జనసేన వారు లెక్కలేనని శిలా ఫలకాలను ధ్వంసం చేసినా ఒక్క కేసు నమోదు కాలేదు. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎవరెవరో ఫిర్యాదు చేయడం పోలీసులు హుటాహుటిన వైఎస్సార్‌సీపీ వారిని అరెస్టు చేయడం సాధారణమై పోతోంది.ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేశ్‌ ‘రెడ్ బుక్’పేరుతో కక్ష రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ?. చాలా సింపుల్‌ ప్రభుత్వ తప్పులు ఎవరూ ఎత్తి చూపకూడదు. సూపర్ సిక్స్ తో సహా ఎన్నికల సమయంలో ఇచ్చిన 150 హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ఎవరూ ప్రశ్నించకూడదు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరుల అసత్యపు ప్రచారాన్ని ఎవరూ గుర్తు చేయకూడదు. ఏడాది తిరగకుండానే కూటమి ప్రభుత్వం చేసిన రూ.1.5 లక్షల కోట్ల అప్పులు ఎందుకు? దేనికి ఖర్చుపెట్టారు? అని ఎవరూ అడగకూడదు. ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను ఎవరూ వెలికి తీయకూడదు. సాక్షి మీడియా ఇవన్నీ చేస్తున్నందునే చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టి దాడి చేస్తోంది.నిజానికి సాక్షి మీడియా ప్రతీ వార్తనూ ఆధార సహితంగానే రాస్తుంది. సౌర శక్తి ఒప్పందాలనే తీసుకుందాం. జగన్‌ హయాంలో యూనిట్‌కు రూ.2.49లకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంస్థ సెకీతో ఒప్పందం చేసుకుంది. ఇందుకు గగ్గోలు పెట్టిన చంద్రబాబు, ఎల్లోమీడియా..లక్ష కోట్ల రూపాయల నష్టం జరిగిపోయిందని ప్రచారం చేశాయి. తీరా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిందేమిటి? అదే విద్యుత్తును రూ.4.60లకు కొనుగోలు చేస్తున్నారు. అంటే.. యూనిట్‌కు దాదాపు రెండు రూపాయలు ఎక్కువ పోసి కొంటున్నారన్నమాట. అయినా సరే.. దీనిపై ఈనాడు, ఆంధ్రజ్యోతుల్లో ఒక్క వార్త కూడా రాలేదు. సాక్షి మాత్రం పక్కా ఆధారాలతో జరిగిన అవినీతిని వివరించారు. సౌర శక్తి కొనుగోళ్ల విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది.అలాగే.. విశాఖలో టీసీఎస్‌కు 99 పైసలకు ఎకరా భూమి ఇవ్వడం, ఊరు, పేరు లేని ఒక కంపెనీకి అరవై ఎకరాలు కట్టబెట్టడం, అమరావతి రాజధాని నిర్మాణాల పేరుతో అధిక రేట్లకు ఇష్టారాజ్యంగా టెండర్లు కేటాయించడం, అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను కూడా తాకట్టు పెట్టడం పెన్షన్లు మినహా మరే హామీ అమలు చేయకపోవడంతో ప్రజలలో అసంతృప్తి నెలకొనడం మొదలైన వార్తలను సాక్షి మీడియా ఇస్తోంది. ఏలికలకు ఇది పంటికింద రాయిలా మారింది. దీంతో సాక్షిని ఇబ్బంది పెట్టడానికి యత్నిస్తోంది. ఈ క్రమంలో ఆధారాలు లేని మద్యం స్కామ్‌ను సృష్టించి వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టుకు చంద్రబాబు.. పోలీసులను ప్రయోగించారు. నిందితులు సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంటిలో ఉన్నారన్న అనుమానం వచ్చిందని పోలీసులు.. చెప్పా పెట్టకుండా విజయవాడలో ఆయన ఇంటిపై పడ్డారు. నిజంగా అలాంటి అనుమానం ఉంటే ఏమి చేయాలి? సెర్చ్ వారంటే ఇచ్చి సోదాలు చేయాలి. అసలు ఒక పత్రికా సంపాదకుడి ఇంటికి అంత ధైర్యంగా వెళ్లారంటే ఈ ప్రభుత్వం ఎంత నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది అర్థం చేసుకోవచ్చు.సాక్షి సిబ్బందిని మానసికంగా వేధించడానికి ఇలా చేసినట్లు తెలుసుకోవడం కష్టం కాదు. ఇంత మాత్రానికే సాక్షి మీడియా వణికిపోతుందా?. 2008 నుంచి సాక్షి మీడియా ఇలాంటి ఆటుపోట్లను ఎన్నింటినో ఎదుర్కొంది. ఈ మీడియాను దెబ్బతీయడానికి చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి ఎన్ని కుట్రలు పన్నింది.. ఎన్ని కేసులు పెట్టించింది తెలియనిది కాదు. 2014 టర్మ్‌లో కూడా సాక్షిని లేకుండా చేయాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. తిరిగి ఈ టర్మ్‌లో అంతకన్నా ఎక్కువగా కక్ష సాధింపు చర్యలకు తెగిస్తున్నారు. ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి వాటిని సమర్థంగానే ఎదుర్కొన్నారు. పోలీసులు మూడు గంటలపాటు అక్కడ ఉన్నా వారికి ఏమీ దొరకలేదు. దాంతో వారు సైలెంట్‌గా వెళ్లిపోక తప్పలేదు. సెర్చ్ వారంట్ లేకుండా వెళ్లడం ద్వారా పోలీసులు దుశ్చర్యకు పాల్పడినట్లు అయింది.ఇక, ఎమర్జన్సీలో సైతం ఇందిరాగాంధీ ఇలాంటి పద్దతులు అనుసరించి మీడియా గొంతు నులమాలని విశ్వయత్నం చేశారు. కానీ, అంతిమంగా ఆమె ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నారు. తొలుత ఇందిరాగాంధీ శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత తెలుగుదేశంను తన అధీనంలోకి తెచ్చుకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అవే పద్దతులు అవలంభిస్తున్నారు. చరిత్ర చెప్పిన పాఠాలను మర్చిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎవరికైనా ఓటమి తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Pakistan's Deputy Prime Minister Ishaq Dar Falsely About Pakistan Air Force2
పార్లమెంట్‌లో ప్రసంగం.. నవ్వుల పాలైన పాక్‌ ఉప ప్రధాని ఇషాక్‌ దార్‌

ఇస్లామాబాద్‌: పాక్‌ ఉప ప్రధాని ఇషాక్‌దార్‌ మరోసారి నవ్వుల పాలయ్యారు. ఫేక్‌ వార్తను పార్లమెంట్‌లో చదివి వినిపించి గొప్పలు చెప్పుకున్నారు. పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌ను విదేశీ మీడియా ప్రశంచిందంటూ ప్రకటించుకున్నారు. అయితే విదేశీ మీడియా తమ ఎయిర్‌ఫోర్స్‌ గురించి నిజంగా ప్రశంసలు కురిపించిందా? అని పాకిస్తాన్‌ మీడియా సంస్థ ‘డాన్‌’ నిజనిర్ధారణ చేసింది. అందులో విదేశీ మీడియా కథనం బూటకమని తేల్చి చెప్పింది. అసలు ఇషాక్‌ దార్‌ చెప్పినట్లుగా సదరు మీడియా సంస్థ సైన్యానికి సంబంధించిన ఎలాంటి వార్తల్ని ప్రచురించలేదని తెలిపింది.ఇంతకీ ఏం జరిగిందంటే? పాకిస్తాన్‌పై భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ను కీర్తిస్తూ అంతర్జాతీయ మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన డైలీ టెలిగ్రాఫ్‌ అందుకు భిన్నంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్తాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వ్యవహరించిన తీరును ప్రశంసంపై ఓ కథనాన్ని ప్రచురించింది’ అంటూ డైలీ టెలిగ్రాఫ్‌ హెడ్‌లైన్‌ను పార్లమెంట్‌లో ఇషాక్‌ దార్‌ ప్రస్తావించారు. అసలు విషయం ఏంటంటే?Pakistan's Deputy Prime Minister and Foreign Minister Ishaq Dar falsely told the Senate that The Telegraph headlined the PAF as the ‘Undisputed King of the Skies’—a far-fetched claim that even Dawn News felt compelled to fact-check him. pic.twitter.com/piho3z9Zha— DD India (@DDIndialive) May 16, 2025 ‘గగనతల రారాజు పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌’ వాస్తవానికి డైలీ టెలిగ్రాఫ్‌ ఆ హెడ్‌లైన్‌ను రాయలేదు. పాకిస్తానీయులే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో తప్పుడు వార్తను సృష్టించారు. దాన్నే నిజమనుకుని ఇషాక్‌దార్‌ భ్రమపడ్డారు. ‘గగనతల రారాజు పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌’ అంటూ విదేశీ మీడియా కీర్తించిందని ప్రకటన చేశారు. దీంతో కంగుతిన్న డైలీ టెలిగ్రాఫ్‌ .. అసలు తాము అలాంటి హెడ్‌లైన్‌ పెట్టలేదని స్పష్టం చేసింది. డైలీ టెలిగ్రాఫ్‌ మాత్రమే కాదు.. పాక్‌ దేశ మీడియా సంస్థ డాన్‌న్యూస్‌ సైతం ఇదే విషయాన్ని చెప్పింది. పాకిస్తాన్‌ పార్లమెంట్‌ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది.ఇషాక్‌ దార్‌వి పచ్చి అబద్ధాలు ‘పాకిస్తాన్‌ ఎయిర్ ఫోర్స్ ఆకాశాలలో తిరుగులేని రాజు’ అని పేర్కొంటూ డైలీ టెలిగ్రాఫ్‌ వార్త రాసిందా? లేదా? అని డాన్‌ మీడియా ప్రతినిధులు పరిశీలించారు. ఇషాక్‌ దార్‌ చెప్పినట్లుగా సోషల్‌ మీడియాలో ప్రసారం అవుతున్నట్లుగా మే 10న ది డైలీ టెలిగ్రాఫ్‌ ఫ్రంట్‌ పేజీలో ఉన్న వార్తకి.. ఇషాక్‌ దార్‌ చదివి వినిపించిన హెడ్‌లైన్‌కు పొంతన లేదని తేలింది. ఆ పత్రిక ఎప్పుడూ అలాంటి కథనాల్ని ప్రచురించలేదని డాన్‌ తేల్చింది. దీంతో పాక్‌ ఉప ప్రధాని ఇషాక్‌ దార్‌పై నెటిజన్లు చూసికోవాలని కదాయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

AP Police Case Filed On Vallabhaneni Vamshi3
వంశీపై కూటమి కుట్రలు.. మరో కేసు నమోదు

సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వంశీపై తాజాగా మరో కేసు నమోదు చేశారు పోలీసులు. గన్నవరంలో మైనింగ్ అక్రమాలపై ఏడీ ఫిర్యాదుతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.ఇప్పటికే వంశీకి ఐదు కేసుల్లో బెయిల్‌ మంజూరు అయినప్పటికీ కూటమి సర్కార్‌ మాత్రం తప్పుడు కేసులతో వంశీ​కి బెయిల్‌ రాకుండా అడ్డుకుంటోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్‌పై నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇంతలో నిన్న నూజివీడు పోలీసులు.. వంశీపై పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. ఈరోజు మరో కేసు నమోదు చేశారు. గన్నవరంలో జరిగిన మైనింగ్‌పై 58 పేజీలతో గనుల శాఖ ఏడీ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, క్రైమ్ నెం.142/2025తో గన్నవరం పీఎస్‍లో వంశీపై కేసు నమోదైంది. ఇలా.. వంశీపై ఏదో ఒక కేసు పెడుతూ వంశీకి బెయిల్ రాకుండా కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. సర్కార్‌ తీరు కారణంగా వంశీ.. 90 రోజులుగా విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

His Chances Don't Look Great: BCCI Official On IPL Captain ENG vs IND Tests4
BCCI - IND vs ENG: టీమిండియాలో అతడికి చోటు కష్టమే!

విరాట్‌ కోహ్లి (Virat Kohli) రిటైర్మెంట్‌ కారణంగా టీమిండియా సెలక్టర్లకు కొత్త చిక్కు వచ్చి పడింది. టెస్టు జట్టులో ఈ దిగ్గజ ఆటగాడి స్థానాన్ని భర్తీ చేసే సరైన ప్లేయర్‌ కోసం సెలక్షన్‌ కమిటీ వేట కొనసాగిస్తోంది. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో ఎవరిని ఆడించాలన్నది తలనొప్పిగా మారింది.టీమిండియాలో అతడికి చోటు కష్టమేఅయితే, వసీం జాఫర్‌, ఆకాశ్‌ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు కోహ్లి స్థానంలో శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)ను పంపాలని సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer), సర్ఫరాజ్‌ ఖాన్‌, రజత్‌ పాటిదార్‌ల పేర్లు తెరమీదకు తీసుకువస్తున్నారు. ఇలాంటి తరుణంలో బీసీసీఐ అధికారి ఒకరు ‘టెలిగ్రాఫ్‌’తో మాట్లాడుతూ.. శ్రేయస్‌ అయ్యర్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘ఒకవేళ టీమిండియా సొంతగడ్డ మీద టెస్టు సిరీస్‌ ఆడుతున్నట్లయితే శ్రేయస్‌ అయ్యర్‌కు జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉండేవి. అయితే, తదుపరి భారత జట్టు విదేశంలో సిరీస్‌ ఆడబోతోంది.. అది కూడా ఇంగ్లండ్‌ గడ్డమీద.కాబట్టి శ్రేయస్‌కు ఛాన్స్‌ లేదనే చెప్పాలి. అతడు రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో మరింత గొప్పగా రాణించాల్సిన అవసరం ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో శ్రేయస్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు.కానీ టెస్టు ఫార్మాట్‌ వైట్‌బాల్‌ క్రికెట్‌తో పోలిస్తే పూర్తి భిన్నమైనది. అందుకే అతడి విషయంలో ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేము’’ అని సదరు అధికారి పేర్కొన్నారు.ఓపికగా బ్యాటింగ్‌ చేయాలిఅదే విధంగా.. ఇంగ్లండ్‌లో పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్‌లో బంతి ఎక్కువగా స్వింగ్‌ అవుతుంది. కాబట్టి ఒక్కోసారి అలాంటి బంతులను వదిలేయడమే ఉత్తమం. ఇంగ్లండ్‌ గడ్డ మీద ఎంత ఓపికగా బ్యాటింగ్‌ చేస్తున్నామనదే ముఖ్యం’’ అని పేర్కొన్నారు.కాగా శ్రేయస్‌ అయ్యర్‌ చివరగా గతేడాది ఫిబ్రవరిలో టీమిండియా తరఫున టెస్టు బరిలో దిగాడు. విశాఖపట్నంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆడాడు. ఆ తర్వాత అతడికి మళ్లీ ఇంత వరకు సెలక్టర్లు టెస్టు జట్టులో చోటివ్వలేదు.చాంపియన్స్‌ ట్రోఫీలో అదరగొట్టాడుఅయితే, దేశవాళీ క్రికెట్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ ముంబై తరఫున బరిలోకి దిగి దంచికొట్టాడు. రంజీల్లో రాణించడంతో పాటు టీ20 ఫార్మాట్‌లో నిర్వహించే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ గెలవడంలోనూ కీలక పాత్ర పోషించాడు. అనంతరం ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025ని భారత్‌ సొంతం చేసుకోవడంలో అతడిది ముఖ్య భూమిక.ఇక ఐపీఎల్‌-2025లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా, బ్యాటర్‌గానూ శ్రేయస్‌ అ‍య్యర్‌ అదరగొడుతున్నాడు. అయితే, టెస్టుల్లో మాత్రం అతడు ఇప్పట్లో పునరాగమనం చేసే అవకాశం కనిపించడం లేదు. కాగా జూన్‌ 20 నుంచి భారత జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సీజన్‌ ఈ సిరీస్‌తోనే మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఇటీవలే టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌.. నాలుగో స్థానంలో ‘కొత్త’ ఆటగాడు!

Konda Surekha Controversy Comments On Telangana Ministers5
మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

సాక్షి,హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకోకుండా మంత్రులు ఏ పనిచేయరూ అంటూ ఆమె చేసిన బహిరంగ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. వరంగల్‌లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఆవరణలో రూ.5 కోట్ల సీఎస్ఆర్‌ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ నిర్మించిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.‘నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైల్స్‌ వస్తుంటాయి. మామూలుగా మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్‌ క్లియర్‌ చేస్తుంటారు. నేను అలా చేయను.. సమాజ సేవే చేయమంటాను. నాకు నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పా. స్కూల్‌ డెవలప్‌మెంట్‌ చేయమని కోరా’ అని వ్యాఖ్యానించారు. అయితే, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. నేను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ.. అయితే, తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం కావడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. ‘నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. నేను వరంగల్‌లో చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. ప్రతి ఫైలుకు డబ్బులు తీసుకున్నారో లేదో గత ప్రభుత్వంలోని మంత్రులకు తెలుసు. నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారు. నేను మాట్లాడిన దాంట్లో ముందు వెనక కట్ చేసి చిన్న క్లిప్‌లను కావాలని ట్రోల్ చేస్తున్నారు. మా కేబినెట్ మంత్రుల మధ్య గొడవలు పెట్టాలని కొందరు కుట్ర చేస్తున్నారు. పని చేస్తున్న మంత్రులపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒక్కో మెట్టు ఎక్కి మంత్రినయ్యాను నాపై తప్పుడు ప్రచారాలు చేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టను. గత ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ నేతలు చర్చకు సిద్ధమా? ఎక్కడికి వస్తారో రండి’ అంటూ సవాల్‌ విసిరారు.

Eleven Movie Review And Rating In Telugu6
‘లెవన్‌’ మూవీ రివ్యూ

నవీన్ చంద్ర హీరోగా నటించిన తాజా చిత్రం ‘లెవన్’. సుందర్ సి వద్ద కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. AR ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్,రేయా హరి నిర్మించిన ఈ చిత్రం నేడు(మే 16) తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘లెవన్‌’ కథేంటంటే.. అరవింద్‌(నవీన్‌ చంద్ర) ) ఓ సిన్సియర్‌ పోలీసాఫీసర్‌. ఏసీపీ హోదాలో వైజాగ్‌కి ట్రాన్స్‌ఫర్‌ అవుతాడు. వచ్చీరావడంతోనే ఓ దొంగతనం కేసును ఈజీగా సాల్వ్‌ చేస్తాడు. అదే సమయంలో వైజాగ్‌లో వరుస హత్యలు జరుగుతుంటాయి. తొలుత ఈ కేసును ఏసీసీ రంజిత్‌ కుమార్‌ (శశాంక్‌) డీల్‌ చేస్తాడు. విచారణ మధ్యలోనే అతనికి యాక్సిడెంట్‌ అవుతుంది. దీంతో ఈ కేసు అరవింద్‌ చేతికి వస్తుంది. అతనికి సహాయంగా ఎస్సై మనోహర్‌ ఉంటాడు. వీరిద్దరు కలిసి చేసిన విచారణలో చనిపోయినవారంతా కవలలు అని, ఇద్దరిలో ఒకరిని మాత్రమే చంపుతున్నారని తేలుతుంది. ఈ హత్యలు చేస్తున్న సీరియల్‌ కిల్లర్‌ ఎవరు? ఎందుకు చేస్తున్నాడు? ట్విన్స్‌లో ఒకరిని మాత్రమే ఎందుకు చంపుతున్నాడు? వారితో సీరియల్‌ కిల్లర్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఏసీపీ అరవింద్‌ ఈ కేసును ఎలా డీల్‌ చేశాడు? చివరకు హంతకుడిని పట్టుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. విలన్‌ క్రైమ్‌ చేయడం... పోలీసు అయిన హీరో ఆ కిల్లర్‌ని పట్టుకోవడం..అతనికో ప్లాష్‌ బ్యాక్‌ స్టోరీ..ఇలా ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్ల ఫార్మాట్‌ దాదాపు ఒకేలా ఉంటుంది. దీంట్లో క్రైమ్‌ జరిగిన తీరు.. వాటి చుట్టు అల్లుకున్న మైండ్‌ గేమ్‌, హీరో ఎంత తెలివితా ఈ కేసును ఛేధించాడనే అంశాలపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సినిమాలకు బిగిస‌డ‌ల‌ని స్క్రీన్‌ప్లే అవసరం. ప్రేక్షకుడు ఒక్క క్షణం కూడా తలను పక్కకు తిప్పుకోకుండా ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో కథనాన్ని నడిపించాలి. ‘లెవన్‌’ ఈ విషయంలో ఇది కొంతవరకు సఫలం అయింది. విలన్‌ ప్లాట్‌ రొటీన్‌గా ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌ కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో వచ్చే ట్విస్టులను ముందుగా డీకోడ్‌ చేడయం కొంతవరకు కష్టమే. క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలను రెగ్యులర్‌గా చూసేవాళ్లు విలన్‌ ఎవరనేది కనిపెట్టినా.. వాళ్ల మైండ్‌తో కూడా గేమ్‌ ఆడేలా స్క్రీన్‌ప్లే ఉంటుంది. సినిమా ప్రారంభంలో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. సీరియల్‌ కిల్లింగ్‌ కేసు హీరో చేతికి వచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అదే సమయంలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ ఇరికించినట్లుగా అనిపిస్తుంది. ప్రీఇంటర్వెల్‌ నుంచి కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో ఇన్వెస్టిగేషన్‌ ప్రాసెస్‌ ఉత్కంఠభరితంగా సాగుతుంది. మధ్యలో వచ్చే ప్లాష్‌బ్యాక్‌ స్టోరీ హృదయాలను హత్తుకుంటుంది. ఇక చివరిలో వచ్చే ట్వీస్టులు అదిరిపోతాయి. ఈ కథకి లెవన్‌ అనే టైటిల్‌ ఎందుకు పెట్టారనేదానితో పాటు ప్రతి సీన్‌కి లాజిక్‌ ఉంటుంది. మొత్తంగా ‘లెవన్‌’ సినిమా రొటీన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ కథే అయినా.. కథనం మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. నవీన్‌ చంద్రకు పోలీసు పాత్రలు చేయడం కొత్త కాదు. ఈ మధ్య ఆయన ఎక్కువ ఇలాంటి పాత్రలే చేశాడు. ఇందులో ఏసీపీ అరవింద్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన బాడీలాంగ్వేజ్‌, లుక్‌ నిజమైన పోలీసుల అధికారిని గుర్తు చేసేలా ఉంటుంది. హీరోయిన్‌ రియా హరి పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. ఎస్సై మనోహర్‌గా దిలీపన్‌, పోలీసు ఉన్నతాధికారిగా ఆడుకాలం నరేన్‌, ఏసీపీ రంజిత్‌ కుమార్‌గా శశాంక్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. కిరీటీ, రవివర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. డి ఇమాన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు ప్లస్‌ అయింది. తనదైన బీజీఎంతో అదరగొట్టేశాడు. పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నంతా ఉన్నాయి.

Today Gold and Silver Price May 16th 20257
ఉన్నట్టుండి భారీగా పెరిగిన బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి అనుకునే లోపే.. ఈ రోజు (మే 16) మళ్ళీ భారీగా పెరిగాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 87,200 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,130 వద్ద నిలిచాయి. నిన్న భారీగా తగ్గిన ధరలు.. ఈ రోజు భారీగా పెరిగాయి. ఈ రోజు కూడా రూ. 1100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 1200 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 1100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 1200 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,200 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 95,130 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 87,350 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 95,280 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 1100, రూ. 1200 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఈ రోజు (శుక్రవారం) కేజీ సిల్వర్ రేటు రూ.1,08,000 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).ఇదీ చదవండి: జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్: 365 రోజుల వ్యాలిడిటీ కోసం..

Bangalore Varsha Travels Fraud Tirumala Devotees8
తిరుమల భక్తులకు ట్రావెల్స్ సంస్థ కుచ్చుటోపీ.. భక్తుల ఆవేదన

సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తులకు బెంగళూరుకు చెందిన ట్రావెల్స్‌ సంస్థ కుచ్చుటోపీ పెట్టింది. బెంగళూరు నుండి తిరుపతికి రవాణా ఖర్చుతోపాటు దర్శనం కల్పిస్తామని నమ్మించిన భక్తులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దిక్కుతోచని స్థితిలో 35 మంది కన్నడ భక్తులు తిరుమలలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. తిరుమల కొండను టార్గెట్ చేసుకొని కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు మోసాలకు పాల్పడుతున్నాయి. తాజాగా బెంగళూరు నుండి తిరుపతికి రవాణా ఖర్చుతోపాటు దర్శనం కల్పిస్తామని బెంగళూరుకు చెందిన వర్షా ట్రావెల్స్ భక్తులను మోసం చేసింది. సర్వదర్శనం పేరుతో నకిలీ దర్శన టిక్కెట్లను వారికి ఇచ్చింది. ఒక్కొక్క భక్తుడి నుండి రూ.3,350 నగదు వసూలు చేసింది. టికెట్‌ ఉందని ధీమాతో భక్తులు తిరుమలకు వచ్చారు.తిరుమలకు వచ్చాక.. తీరా నకిలీ టికెట్లని తెలడంతో శ్రీవారి భక్తులు బోరుమంటున్నారు. 35 మంది కన్నడ భక్తులు దిక్కుతోచని స్థితిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం, భక్తులు.. పోలీసులను ఆశ్రయించారు. వర్షా ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, భక్తులకు విక్రయించిన టికెట్లపై తిరుమల శ్రీవారి ఫొటో ఉండటం గమనార్హం.ఇదిలా ఉండగా.. తిరుమలలోని విష్ణు నివాసం అతిథి గృహంలో భారీ దొంగతనం జరిగింది. 32 గ్రాముల బంగారం, 40వేల నగదు, ఓ సెల్ ఫోన్‌ అపహరణకు గురైంది. ఈనెల 7న శ్రీవారి దర్శనం కోసం నెల్లూరు జిల్లా, మర్రిపాడుకు చెందిన విజయభాస్కర్ కుటుంబం తిరుమలకు వచ్చింది. వీరంతా.. రైల్వే స్టేషన్ సమీపంలోని విష్ణు నివాసం రూమ్ నెంబర్ 461లో బస చేశారు. రూమ్‌లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వీరి వస్తువులను దొంగతనం చేశాడు. దీంతో, బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఈస్ట్ ఎస్సై మహేష్ తెలిపారు.

Nitanshi Goel Shines At Cannes  Film Festival 2025 9
కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్‌ అగ్ర హీరోయిన్లను..!

లాపతా లేడీస్‌ సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన యంగ్‌హీరోయిన్‌ నితాన్షి గోయల్ (Nitanshi Goel). ఈ మూవీలో తనదైన నటనతో అటు విమర్శకులు, ఇటు అభిమానుల హృదయాలను గెలుచుకుంది. 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాల్లో ఒకటైన లాపతా లేడీస్‌లోని ఫూల్‌ పాత్రతో అభిమానులను కట్టిపడేసింది. ఇన్‌స్టాలో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉన్న అతి పిన్న వయస్కురాలైన నటి కూడా నితాన్షి కావడం విశేషం.ఇపుడు మరో విశేషం ఏమిటంటే... నితాన్షి 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అరంగేట్రం చేసింది. అరంగేట్రం చేయడం మాత్రమే కాదు కాన్స్‌లో తన లుక్స్‌తో వావ్‌ అనిపించింది. 17 ఏళ్ల యువతార బ్లాక్‌ అండ్‌ గోల్డ్‌ గౌన్‌తో తళుకున్నమరిసి అభిమానులను ఫిదా చేసింది. ఆమె లుక్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె డిజైనర్‌ దుస్తులు, స్టైల్‌, సీనియర్‌ నటీమణులకు ఆమె ఇచ్చిన గౌరవం స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. అందరి దృష్టి నితాన్షి గోయల్ జుట్టుపైనే ఉంది, ఆమె రేఖ-మధుబాలతోపాటు, శ్రీదేవికి లాంటి స్టార్లను తన జడలో చుట్టేసుకుంది.నితాన్షి లుక్‌లో ప్రధాన ఆకర్షణ, ముత్యాల జడలో కేన్స్ 2025లో తన ముత్యాల జుట్టుతో 8 మంది బాలీవుడ్ నటీమణులకు నివాళి అర్పించింది. నితాన్షి గోయెల్ అలనాటి బాలీవుడ్‌అందాల తారలు మధుబాల, నర్గీస్, మీనా కుమారి, నూతన్, వహీదా రెహ్మాన్, ఆశా పరేఖ్, వైజయంతిమాల, హేమ మాలిని, రేఖ , శ్రీదేవి వంటి ప్రముఖ బాలీవుడ్ నటీమణుల సూక్ష్మ ఫోటో ఫ్రేమ్‌లున్న(miniature photo frames) కస్టమ్-మేడ్ హెయిర్‌ యాక్సెసరీతో అదరగొట్టేసింది. హిందీ సినిమా ప్రపంచంలో తమ కలకాలం ముద్ర వేసిన నటీమణులపై తన ప్రేమను చాటుకున్న వైనంగా పలువుర్ని ఆకట్టుకుంది.కాన్స్ 2025కి ఈ డ్రెస్ వేసుకోవాలని నిర్ణయించుకోవడానికి తనకు 10-15 నిమిషాలు పట్టిందని చెప్పింది.ముత్యాల చీర,పూసలు, ముత్యాలు, సీక్విన్లతో తయారు చేసిన ప్రీ-డ్రేప్డ్ చీరలో అందంగా ముస్తామైంది. దానిపై మల్టీ లేయర్ల , 3D వర్క్‌, ఇంకా దీనికి భారీ పల్లూ కూడా ఉంది. ఈ చీరకు ముత్యాలు పొదిగిన స్ట్రాపీ బ్లౌజ్‌తో జత చేసింది. నితాన్షి తన ఫ్యాషన్ ఐకాన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ అని చెప్పిన నితాన్షి, కాన్స్‌లో ఉన్నప్పుడు అలియా భట్‌ ధీటుగా ఉండాలని కోరుకున్నానని వెల్లడించింది. నితాన్షి లుక్ డిస్నీడాల్‌గా చాలా ముద్దుగా ఉంది.

Congress MLA Kothur Manjunath doubts On Operation Sindoor10
ఆపరేషన్‌ సరే.. పహల్గాం నిందితులు చనిపోయారా?: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

బెంగళూరు: పాకిస్తాన్‌పై భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రతిపక్ష కాంగ్రెస్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌తో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. భారత దాడుల్లో మరణించింది ఎవరు?. పహల్గాంలో దాడి చేసిన వారు మృతుల్లో ఒక్కరైనా ఉన్నారా?. సరిహద్దులో ఎందుకు భద్రత లేదు?. పహల్గాం ఘటన జరిగిన తర్వాత వారు ఎలా తప్పించుకున్నారు? అని ప్రశ్నలు సంధించారు.కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోతూర్ మంజునాథ్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌కు ఎలాంటి ప్రయోజనం అందించలేదు. ఈ ఆపరేషన్‌లో ఏమీ చేయలేదు. కేవలం గొప్పగా చూపించుకోవడానికే ఇదంతా చెబుతున్నారు. ఓ నాలుగు విమానాలు సరిహద్దులు దాటి వెళ్లి.. మళ్లీ తిరిగి వచ్చాయి. అంతే తప్ప ఇంకేమీ జరగలేదు. భారత దాడుల్లో మరణించిన వారు ఎవరు?. పహల్గాంలో దాడి చేసిన వారు మృతుల్లో ఎవరైనా ఉన్నారా?. అధికారులు ఒకటి చెబితే.. టీవీలు మరొకటి చెబుతున్నాయి. మరొకరు ఇంకేదో అంటున్నారు. మనం ఎవరిని నమ్ముతాము? అధికారిక ప్రకటన ఎక్కడ?’ అని ప్రశ్నించారు.అలాగే, భారత్‌ దాడుల్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు మృతిచెందినట్టు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎవరు నిర్ధారించారు?. మన సరిహద్దును దాటిన ఆ ఉగ్రవాదులు ఎవరు? వారి గుర్తింపు ఏంటి? సరిహద్దులో ఎందుకు భద్రత లేదు? వారు ఎలా తప్పించుకున్నారు? ఉగ్రవాద మూలాలు, శాఖలను గుర్తించి వాటిని నిర్మూలించాలి. పహల్గాం ఘటన పూర్తిగా నిఘా వైఫల్యమే. పహల్గాం దాడి బాధితుల కుటుంబాలకు న్యాయం చేయడంలో కేంద్రం​ విఫలమైంది. పహల్గాం బాధితులకు కేంద్రం పరిహారం ఇచ్చిందా?. కర్ణాటక, పాకిస్తాన్, చైనా లేదా బంగ్లాదేశ్‌లో ఎక్కడైనా పౌరులపై జరిగే దాడులను మేము వ్యతిరేకిస్తాం’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఈ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతుందని చెప్పారు. పాక్‌ దాడులు చేస్తే తిరిగి దాడులు చేస్తామని పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సిందూర్‌’ పేరుతో పాకిస్తాన్‌, పీవోకేలోని తొమ్మిది ఉగ్ర శిబిరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. భారత్‌.. నూర్‌ఖాన్‌, రఫీకీ, షోర్కోట్‌, మురిద్‌, సుక్కోర్‌, సియాల్కోట్‌, పసురూర్‌, చునియన్‌, సర్గోదా, భోలారీ, జకోబాబాద్‌లో దాడులు చేసింది. దాడికి ముందు.. తర్వాత ఇక్కడినుంచి సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో నష్టం తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జకోబాబాద్‌లోని షాబాజ్‌ బేస్‌ చాలావరకు ధ్వంసమై కనిపిస్తోంది. ఇక భారత పదాతి దళం జరిపిన దాడిలో నియంత్రణ రేఖ వద్ద పాక్‌ సైనిక స్థావరాలు, ఉగ్ర బంకర్లు నాశనమయ్యాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement