స్మార్ట్‌గా పోస్టల్‌ సేవలు | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌గా పోస్టల్‌ సేవలు

Published Tue, Oct 8 2024 2:40 AM | Last Updated on Wed, Oct 9 2024 10:43 AM

స్మార్ట్‌గా పోస్టల్‌ సేవలు

స్మార్ట్‌గా పోస్టల్‌ సేవలు

ఆత్మీయుల ఊసులను అక్షరాలుగా మోసుకొచ్చే ఉత్తరాలకు కాలం చెల్లిపోయింది. టెలిగ్రామూ కనుమరుగైంది. మసకబారిన పోస్టల్‌ శాఖకు గత వైభవాన్ని తెచ్చేలా స్మార్ట్‌ సొబగులను అద్దుతున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా అడుగులేస్తోంది. ఆత్మబంధువు అవుతోంది. ఈనేపథ్యంలో ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు పోస్టల్‌ వారోత్సవాలు నిర్వహించనుంది. 

సత్తెనపల్లి: ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పోస్టల్‌ శాఖ వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోంది. బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థల కంటే మిన్నగా ఖాతాదారులకు మెరుగైన ఆర్థిక సేవలు అందించేందుకు సిద్ధమైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలా పాలంటే గుర్తుకొచ్చేది పోస్టాఫీసులే. మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టల్‌ శాఖ టెక్నాలజీని అందిపుచ్చుకుంది. జాబులు, ఇంగ్లాండ్‌ లెటర్లు మాయమయ్యాయి. వాటి స్థానంలో సెల్‌ఫోన్‌ సేవలు వచ్చినా పోస్టల్‌ శాఖ ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. 

ఐకాల్‌ లెటర్లు, ఇంటర్వ్యూ లెటర్లు, అపాయింట్మెంట్‌ ఆర్డర్లు... వీటిని తీసుకొని ఖాకీ డ్రస్‌ వేసుకొని ప్రతిరోజు ఉదయం 10 నుంచి 2 గంటల మధ్య ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ అందరినీ పలకరిస్తూ మీకు ఈ లెటర్‌ వచ్చిందని చెబుతూ ఎందరో ఆశలకు జీవం పోసి ఉత్సాహపరిచే ఆత్మీయులుగా ఉంటారు పోస్టుమాన్‌లు. సుమారు 18 ఏళ్ల కిందట సెల్‌ ఫోన్లు లేని రోజుల్లో పోస్టాఫీసులు, పోస్టుమెన్‌లు ఆత్మబంధువుల్లా కనిపించేవారు. పిన్‌కోడ్‌లో ఉన్న ఆరు అక్షరాల్లో మొదటి రెండక్షరాలు రాష్ట్రాన్ని, మధ్యలో ఉన్న రెండక్షరాలు జిల్లాను, చివరి రెండు అక్షరాలు ప్రాంతాన్ని తెలుపుతాయి.

సెల్‌ఫోన్‌ రాకతో...
సెల్‌ ఫోన్ల ద్వారా ఒకరికొకరు మెసేజ్‌ల రూపంలో ప్రస్తుతం వాట్సాప్‌, ట్విట్టర్‌, టెలిగ్రామ్‌ ద్వారా సమాచారం మార్పిడి చేసుకుంటున్నారు. మనీయార్డర్ల స్థానంలో ఏటీఎంలు, మనీ ట్రాన్స్‌ఫర్‌ రావడంతో పోస్టాఫీస్‌కి వెళ్లేవారు కరువయ్యారు. దీంతో పోస్టాఫీస్‌కి వెళ్లి ఉత్తరాలు కొని డబ్బాలో వేసే సంస్కృతికి కాలం చెల్లిపోయింది. కేవలం ప్రభుత్వ కార్యాలయాల ఉత్తర ప్రత్యుత్తరాలకు పోస్టాఫీస్‌ను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలతో మళ్లీ పోస్టా ఫీస్‌ వైపు అడుగులు పడుతున్నాయి.

ఇవీ పథకాలు...
ప్రైవేట్‌ సంస్థలు, బ్యాంక్‌లకు దీటుగా పోస్టాఫీస్‌లో కూడా ఆన్‌లైన్‌ సేవలు, ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. మొబైల్‌మనీ ట్రాన్స్‌ఫర్‌, ఎలక్ట్రానిక్‌ మనీయార్డర్‌, మై స్టాంప్‌ పథకం, స్పీడ్‌ పోస్టుల సేవలు, ఆధార్‌ సేవలు అందుబాటులోకి తెచ్చింది. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట ప్రధాన తపాలా కార్యాలయంలో పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రం ద్వారా ఆ సేవలు అందుబాటులో ఉన్నాయి. స్పీడ్‌ పోస్ట్‌, వ్యక్తిగతంగా మన ఫొటోలతో విడుదల చేసే మై స్టాంప్‌, రికరింగ్‌ డిపాజిట్లు, మహిళా సమ్మాన్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌, సేవింగ్స్‌, పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, స్టాంపుల కలెక్షన్‌, సుకన్య సంవృద్ధి యోజన, ఇన్సూరెన్స్‌ పథకాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.

పోస్టల్‌ బ్యాంక్‌ ద్వారా గ్రామీణ ప్రజలకు చేరువ మొబైల్‌ మనీట్రాన్స్‌ఫర్‌, ఎలక్ట్రానిక్‌ మనీయార్డర్‌ సేవలు జిల్లాలో నరసరావుపేట, సత్తెనపల్లిలో ప్రధాన తపాలా కార్యాలయాలు నరసరావుపేట హెడ్‌ పోస్టాఫీస్‌లో పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రం ఏర్పాటు బ్యాంక్‌లకు దీటుగా నరసరావుపేట, మాచర్లలో ఏటీఎంలు ఏర్పాటు రేపు ప్రపంచ తపాలా దినోత్సవం.. 9–15 వరకు వారోత్సవాల నిర్వహణ

ఐపీపీబీతో సేవలు...
నరసరావుపేటలో ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌(ఐపీపీబీ)ను పోస్టల్‌ శాఖ ప్రారంభించింది. ఆ శాఖలో ఇది ఒక విప్లవం. పల్నాడు జిల్లాలో నరసరావుపేట, సత్తెనపల్లిలో ప్రధాన తపాలా కార్యాలయాలు ఉన్నాయి. నరసరావుపేట డివిజన్‌ పరిధిలో 51 సబ్‌ పోస్టాఫీస్‌లు, 386 బ్రాంచ్‌లు ఉన్నాయి. కొత్తగా 60 బ్రాంచ్‌లు పెరిగాయి. ఇందులో 980 మంది ఉద్యోగులు ప్రతి రోజూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. గ్రామాల్లో ఉన్న పోస్టల్‌ సిబ్బందికి బయోమెట్రిక్‌ మిషన్‌ అందించారు. దీని ద్వారా బ్యాంకుల్లో అకౌంట్‌ ఉండి ఐపీపీబీలో అకౌంట్‌ ఉంటే బ్యాంక్‌ అకౌంట్‌లో ఉన్న నగదును మనం కావాలని పోస్టల్‌ సిబ్బందికి ఫోన్‌ చేసి చెబితే బయోమెట్రిక్‌ తీసుకొని రూ.5 నుంచి రూ.10 వేల వరకు నగదు అందిస్తారు. ప్రస్తుతం సీనియర్‌ సిటిజన్లకు ఈ పథకం చాలా ఉపయోగపడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement