వస్తువు నీడను కోల్పోయిన దృశ్యాన్ని వీక్షిస్తున్న చిన్నారులు
నిర్మల్‌ఖిల్లా: నిర్మల్‌లో మంగళవారం ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. నిమిషం 40 సెకన్ల పాటు నీడ మాయమైంది. మధ్యాహ్నం 12.12 నుంచి 12.13 నిమిషాల 40 సెకన్ల పాటు మనుషులు, వస్తువుల నీడ కనిపించలేదు. ఒక వస్తువుపై సూర్యకిరణాలు పడితే మరోవైపున వ్యతిరేక దిశలో ఆ వస్తువు నీడ ఏర్పడటం సర్వసాధారణమే. దీనికి భిన్నంగా ఉష్ణమండలంలోని కర్కాటక రేఖ, మకరరేఖ 23.4 డిగ్రీల మధ్యన నీడలేని రోజు (జీరో షాడో డే) సంవత్సరానికి రెండుసార్లు ఏర్పడుతుంది.
ఈ ఏడాది నిర్మల్ జిల్లాకేంద్రంలో శ్రీనీడలేని రోజుశ్రీ మే 16న కనిపించింది. ఇదే ఘటన తిరిగి జూలై 27న మరోసారి పునరావృతం కానుంది. నిర్మల్‌లో నీడ మాయం కావడంతో పలువురు చిన్నారులు పొడువాటి వస్తువుతో పరీక్షించారు.
భూమి అక్షం సూర్యునితో గల కోణంలో వంపు కారణంగా నీడ సంభవిస్తుంది. ఏడాది పొడవునా సూర్యకిరణాలు ప్రసారమయ్యే కోణాన్ని బట్టి వాటి నీడల పొడవు, దిశ మారుతుంటుంది. భూభ్రమణం అక్షం సమతలానికి 23.45 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. భూమి సూర్యుని మధ్యరేఖను సౌరక్షీణత అని పిలుస్తారు. ఈ సౌరక్షీణత సూర్యకిరణాలు పడే అక్షాంశానికి సమానమైనప్పుడు ‘జీరో షాడో డే’ ఏర్పడుతుందని జిల్లాకేంద్రానికి చెందిన భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు పురస్తు శ్రీనివాస్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ఏడాదిలో రెండుసార్లు కనిపిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment