నేరడిగొండ ఉప తపాలా కార్యాలయం
నేరడిగొండ: బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకుంటూ ఆధునికతను అందిపుచ్చుకునే దిశగా తపాలా శాఖ అడుగులు వేస్తోంది. అన్ని రంగాలతో సమానంగా ఆన్‌లైన్ విధానంలోనూ తామేమీ తక్కువ కాదని నిరూపిస్తోంది. ఇప్పటికే పలుసేవలను ఆన్‌లైన్ విధానంలోకి తెచ్చింది. వీటితోపాటు తాజాగా ‘పోస్ట్ ఇన్ఫో యాప్’ను తీసుకువచ్చింది. దీనిద్వారా పోస్టల్‌కు సంబంధించిన సమాచారాన్ని ఫోన్‌లోనే తెలుసుకునే వీలు కలిగింది.
వినియోగదారుడికి సదుపాయంగా..
పోస్ట్ ఇన్ఫో యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ప్లేస్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో తపాలా చార్జీలు, బీమా ప్రీమియం, వివిధ డిపాజిట్లపై వడ్డీ లెక్కించుకునే సదుపాయాలు సైతం ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన, డిపాజిట్ పథకం, టైమ్ డిపాజిట్లపై ఏడాది నుంచి ఐదేళ్ల వరకు వచ్చే ఆదాయం వాటిని లెక్కించుకోవచ్చు. ప్రస్తుతం అమలులో ఉన్న వడ్డీ రేట్లు ఆధారంగా పథకాలు ఎంచుకొని డిపాజిట్లు చేయడం ద్వారా వచ్చే ఆదాయం వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు అమలులో ఉన్న (ఆరు అంకెల) పిన్‌కోడ్ నంబర్లను ఎంటర్ చేస్తే తపాలా కార్యాలయం పేరు, డివిజన్ పరిధి తెలియజేస్తుంది. తపాలా అందిస్తున్న సేవలపై ఖాతాదారులు ఫీడ్ బ్యాక్ ఇవ్వవచ్చు. ఫిర్యాదులు నమోదు చేసే అవకాశం సైతం ఉంది.
కూర్చున్న చోటు నుంచే.
ఈ యాప్ ద్వారా కూర్చున్న చోటు నుంచే వినియోగదారులు సులువుగా సమాచారం పొందవచ్చు. తపాలా చార్జీలు, బీమా ప్రీమియం, పొదుపు పథకాల గురించి తెలుసుకోవచ్చు.
ఆన్‌లైన్ ద్వారా మరింత సులువు..
తపాలా శాఖలో బ్యాంకులకు దీటుగా ఆన్‌లైన్ ద్వారా సేవలందిస్తోంది. మహిళలకు ప్రత్యేక పథకాలు ఉన్నాయి. మా శాఖ ద్వారా ఆయా గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఏవైన వివరాలు ఉంటే ఆయా గ్రామాల్లో గల తపాలా శాఖ కార్యాలయంలో కాని, బీపీఎంల ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు.
– మహేశ్‌రెడ్డి, సబ్ పోస్టుమాస్టర్, నేరడిగొండ
Comments
Please login to add a commentAdd a comment