ఆదిలాబాద్: జిల్లాలోని ఐదు ఆధార్ కేంద్రాలపై యూనిక్ ఐడేంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) వేటు వేసింది. ఆ కేంద్రాల ద్వారా అందించే సేవలను నిలిపివేస్తూ నిర్వాహకుల ఆథరైజేషన్‌ను సస్పెండ్ చేసింది. దీంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఐదు కేంద్రాల నిర్వాహకులు ఆధార్ సంబంధిత సేవలందించేందుకు దూరమవాల్సిన దుస్థితి నెలకొంది.
అడ్రస్ మార్పునకు సంబంధించి తప్పుడు వివరాలతో కూడిన ధృవీకరణ పత్రాలను జత చేసినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యల ద్వారా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం, భుక్తాపూర్‌లోని సెంటర్‌తో పాటు, తలమడుగు, బేల, ఇంద్రవెల్లి మండల కేంద్రాల్లోని ఆధార్ కేంద్రాలపై వేటు పడింది. ఇందులో ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఆధార్ సెంటర్‌ను ఇది వరకే సస్పెన్షన్ వేటు వేయగా తాజాగా మిగతా సెంటర్లపై చర్యలు చేపట్టింది.
ఆధార్ సంస్థ చేపట్టిన చర్యల విషయం తెలియకపోవడంతో నిత్యం ఆధార్ సంబంధిత సేవల కోసం వస్తున్న ప్రజలు ఆ సెంటర్లు మూసి ఉండటంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. కేంద్రాలపై చర్యలు చేపట్టిన విషయాన్ని ప్రజలకు సమాచారమందించాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.
ఏమరుపాటుగా ఉంటే వేటు తప్పదు...
ఆధార్ కేంద్రాల నిర్వాహకులు ఏమాత్రం ఎమరుపాటుగా వ్యవహరించినా శాఖపరంగా చర్యలు ఎదుర్కొనక తప్పదని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ, అభివృద్ధి పథకాలు పొందాలన్నా, పోటీ పరీక్షలు, విద్యా, ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలన్న ప్రభుత్వాలు ఆధార్ కార్డును తప్పనిసరి చేశాయి. అంతటి కీలకమైన ఆధార్ కార్డుల జారీలో తప్పుడు సమాచారం పొందుపరిచినట్లు తేలితే ఆధార్ సేవ కేంద్రాలనే బాధ్యులను చేస్తూ ఆధార్ సంస్థ వారిపై చర్యలు చేపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment